Kishanreddy Arrest: కిషన్‌రెడ్డి వాహనాన్ని నడుపుతున్న డీసీపీ స్థాయి అధికారి.. పోలీసులపై కేంద్రమంత్రి ఫైర్
ABN , First Publish Date - 2023-07-20T12:46:15+05:30 IST
బాటసింగారంకు వెళ్తున్న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: బాటసింగారంకు వెళ్తున్న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డిని (Kishan Reddy) శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. కిషన్‌రెడ్డి తీసుకెళ్లేందుకు డీసీపీ స్థాయి అధికారి ముందుకొచ్చారు. డ్రైవర్‌ను దింపేసి మరీ.. కిషన్ రెడ్డి వాహనాన్ని డీసీపీ స్థాయి అధికారి నడుపుతున్న పరస్థితి. అయితే బీజేపీ చీఫ్‌ను ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాన్ని పోలీసులు చెప్పేందుకు నిరాకరించారు. కాగా.. కిషన్ రెడ్డిని నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరిలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కిషన్‌రెడ్డి అరెస్ట్ విషయం తెలిసిన బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకుంటున్నారు.
అంత అవసరం ఏమొచ్చింది?: కిషన్‌రెడ్డి
అరెస్ట్ సమయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రజాసమస్యలను పరిశీలించేందుకు వెళ్తుండగా అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. దీనిపై పార్లమెంటు స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులకన్నా తాను ఎక్కువ బాధ్యతగా ఉంటానన్నారు. కేసీఆర్ తొత్తుల్లాగా కాకుండా ప్రజాసేవకుల్లో పోలీసులు వ్యవహరించాలని హితవుపలికారు. కేంద్రమంత్రి కాన్వాయ్‌కు డీసీఎంను అడ్డంపెట్టి ఆపేంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో దౌర్జన్య పాలన నడుస్తోందని విమర్శలు గుప్పించారు. పశ్చిమబెంగాల్‌లో కూడా పోలీసులు ఇంత దౌర్జన్యంగా వ్యవహరించడం లేదన్నారు. బాటసింగారం వెళ్లేందుకు అడ్డుకోవద్దని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కేంద్రమంత్రిని అడ్డుకునే మీరు సామాన్యులతో ఎలా వ్యవహరిస్తారో అర్థమవుతోందంటూ కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.