BJP: అధ్యక్షుల మార్పు చేర్పులపై బీజేపీ కీలక సమావేశం
ABN, First Publish Date - 2023-04-20T13:18:11+05:30
తెలంగాణ బీజేపీలో ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో (Telangana BJP) ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. ఎలక్షన్ టీంను సిద్ధం చేసే పనిలో బీజేపీ నాయకత్వం బిజీ బిజీగా ఉంది. ఇందులో భాగంగా గురువారం బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi Sanjay), శివప్రకాష్ (Shiva Prakash) , సునీల్ బన్సల్ (Sunil Bansal), తరుణ్ చుగ్ (Tarunu chug), అరవింద్ మీనన్ (Arvind menan)లు సమావేశమయ్యారు. గత కొద్దిరోజులుగా రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పులపై బీజేపీలో చర్చ జరుగుతోంది. ఎన్నికల ఏడాది కావడంతో యాక్టివ్ టీంను సిద్ధం చేయాలన్న యోచనలో జాతీయ నాయకత్వం ఉంది.
జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో విఫలమైనట్టు రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త టీంలో ఎవరెవరు ఉండాలన్న దానిపై ఇప్పటికే ఇంచార్జ్‌లు, జిల్లా అధ్యక్షుల నుంచి అభిప్రాయాలను జాతీయ నాయకత్వం సేకరించింది. అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులపై రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు సీరియస్‌గా దృష్టి సారించారు. టీంను మార్చాల్సిన అవసరం ఉందని కొంతమంది నేతలు భావిస్తున్నారు. నాయకుల పనితీరుపై గత కొంతకాలంగా ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వం రిపోర్ట్‌లను తెప్పించుకుంటోంది. సంస్థాగత ఎన్నికల వరకు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటాడని తరుణ్ చుగ్ పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో సంజయ్ టీంలో ఎవరెవరు ఉండాలన్న దానిపై జాతీయ నేతలు చర్చిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి సమావేశం కొనసాగుతోంది.
Updated Date - 2023-04-20T13:18:11+05:30 IST