T.Highcourt: బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపుపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2023-08-16T15:47:01+05:30 IST
తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపు సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కార్యాలయాలకు భూముల కేటాయింపు సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై బుధవారం హైకోర్టులో (Telangana High Court) విచారణ జరిగింది. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం చౌకగా భూములు అమ్మకాలు చేశారంటూ పిల్ దాఖలైంది. బుధవారం విచారణ జరుగగా.. ప్రభుత్వ భూమిని ప్రజలకు ఎకరం రూ.100 కోట్లకు అమ్మకాలు చేసిందని... అదే బీఆర్ఎస్ పార్టీకి అతి తక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మకాలు చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర రావు (BRS Chief Chandrashekar rao) ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడం లేదని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. 16 నెలల క్రితమే నోటీసులు ఇచ్చినప్పటికీ కౌంటర్ దాఖలు చేయడం లేదని అభ్యంతరం తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ కోసం కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపడితే ప్రజలకు ఇబ్బంది తలెత్తుతుందని వాదించారు. ప్రజలకైతే రూ.100 కోట్లకు.. టీఆర్ఎస్ పార్టీకి అయితే చదరపు అడుగు రూ.100 రూపాయలకే అమ్మకాలు చేశారని కోర్టుకు తెలిపారు. అయితే రూలింగ్ పార్టీని కౌంటర్ దాఖలు చేయాలని బలవంతం చేయక్కర్లేదని హైకోర్టు చెప్పింది. ప్రజలకు ప్రభుత్వ భూమిని ఎంత రేటుకు అమ్మకాలు చేశారో అదే రేటు బీఆర్‌ఎస్ పార్టీ చెల్లించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తీసుకున్న భూమికి ఎకరాకు 100 కోట్ల రూపాయలు చెల్లించాలని బెంజ్ మార్క్ తీర్పు ఉందని న్యాయస్థానం గుర్తుచేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.