KTR: కాంగ్రెస్ అధికారానికి వస్తే రైతుబంధుకు ఎసరు!
ABN, First Publish Date - 2023-08-15T02:29:54+05:30
అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ఎత్తేస్తామని ప్రకటించిన కాంగ్రెస్(Congress) పార్టీ దాంతో పాటు రైతు బంధు, బీసీ బంధు, దళిత బంధు లాంటి పథకాలను తొలగించేస్తుందని మంత్రి కేటీఆర్(Minister KTR) రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.
బీసీ, దళిత బంధులు కూడా ఇవ్వరు.. ఢిల్లీ గాళ్లతో ఊదు కాలదు.. పీరు లేవదు
హిందూ-ముస్లిం తప్ప బీజేపీకి ఎజెండా ఏదీ?: కేటీఆర్
కామారెడ్డి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ఎత్తేస్తామని ప్రకటించిన కాంగ్రెస్(Congress) పార్టీ దాంతో పాటు రైతు బంధు, బీసీ బంధు, దళిత బంధు లాంటి పథకాలను తొలగించేస్తుందని మంత్రి కేటీఆర్(Minister KTR) రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. ఈ పథకాలను తొలగించే రాబందుల సర్కారు కావాలా? అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం(BRS Govt) కావాలో ప్రజలే తేల్చాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో సోమవారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఎల్లారెడ్డి శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 50 ఏళ్లు పాలించి రూ.200 పింఛన్ ఇవ్వడానికి తలకిందులైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏకంగా రూ.4 వేల పెన్షన్ ఇస్తానంటూ ప్రలోభ పెడుతోందని, ఇదే విషయమై ఆ పార్టీ నేతలను నిలదీయాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
‘సంచులు మోసే రేవంత్‌ది థర్డ్ క్లాస్ క్యారెక్టర్’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలే తప్ప సాగునీరు ఎన్నడూ సక్రమంగా అందించలేదన్నారు. ఎరువులు, విత్తనాల పంపిణీ కూడా పోలీసు స్టేషన్‌లో చేయాల్సిన దుస్థితి కాంగ్రెస్ పాలనలో ఉండేదని చెప్పారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని చెప్పారు. హిందూ-ముస్లిం తప్ప ఆ పార్టీకి మరో ఎజెండా లేదన్నారు. మన్మోహన్ హయాంలో సిలిండర్ ధర రూ.400 ఉంటేనే మోదీ నాలుగొందల తిట్లు తిట్టారని, ఇప్పుడు సిలిండర్ రూ.1200 ఉంటే ఆయన్ను ఎంత తిట్టాలని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలను వంద దాటించిన ఘనత ఆయనదేనని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలు విఫరీతంగా పెంచడం ద్వారా ఫిరెమైన ప్రధానిగా పేరుగాంచారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ గాళ్లతో ఊదు కాలదు..ఫీరు లేవదు.. అంటూ రెండు పార్టీల అధిష్ఠానం ఢిల్లీలో ఉంటే తమ అధిష్ఠానం మాత్రం గల్లీలో ఉంటే పేద ప్రజలేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ అన్నారు.
కేటీఆర్‌కు అడుగడుగునా నిరసనలు
కామారెడ్డి జిల్లాలో కేటీఆర్‌కు అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. పోలీసుల వలయాన్ని దాటుకొని కాంగ్రెస్ నేతలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కామారెడ్డి శివారులోని లింగాపూర్‌లో కాంగ్రెస్ నాయకులు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ వైపు దూసుకెళ్లారు. లింగంపేట సమీపంలో కాంగ్రెస్ నేతలు ఫ్లకార్డులతో నిరసనలు తెలిపారు. పోలీసులు కాంగ్రెస్, బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. కేటీఆర్ కోసం ముందుజాగ్రత్తగా పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ప్రధాని, ముఖ్యమంత్రి స్థాయి భద్రత వలయాన్ని ఏర్పాటు చేయడంపై జనం చర్చించుకోవడం కనబడింది. ఎల్లారెడ్డి ప్రధాన కూడళ్లలో పలు దుకాణాలను పోలీసులు బంద్ పెట్టడంపై దుకాణదారులు మండిపడ్డారు. మంత్రి వెళ్లేంతవరకు ఎవరూ దుకాణాలు తెరవొద్దని హెచ్చరించారు. ఎల్లారెడ్డి సభ నుంచి కామారెడ్డి వరకూ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
కేటీఆర్‌కు స్వల్ప అస్వస్థత
కేటీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేటీఆర్ కామారె డ్డిలో కార్యక్రమం జరిగే చోటుకు నేరుగా వెళ్లకుండా ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్నారు. నీరసంగా ఉండటంతో స్థానిక వైద్యుల చేత వైద్య పరీక్షలు చేయించుకుని గంట పాటు విశ్రాంతి తీసుకున్నారు.
తెలంగాణ హక్కులను అడ్డుకుంటున్న కేంద్రం
‘బీజేపీ వంద అబద్ధాలు’ పుస్తకావిష్కరణలో కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలకు హక్కుగా రావాల్సిన వాటిని కేంద్రప్రభుత్వం అడ్డుకుంటోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రూపొందించిన ‘బీజేపీ వంద అబద్ధాలు’ బుక్‌లెట్, సీడీలను మంత్రి, ప్రగతిభవన్‌లో సోమవారం ఆవిష్కరించారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోదీ సర్కారు చేసిన మోసం వివరాలను ఇందులో వివరించామని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు మన్నె క్రిషాంక్, సతీ్‌షరెడ్డి, జగన్మోహన్‌రావు, దినే్‌షచౌదరిలు తెలిపారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విభజన హామీల అమలు, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎస్టీ రిజర్వేషన్లతోపాటు.. బీజేపీ నాయకుల అసలు రూపాన్ని ఈ క్యాంపెయిన్‌లో బయటపెట్టామని చెప్పారు.
Updated Date - 2023-08-15T04:01:55+05:30 IST