T.HighCourt: బండి సంజయ్ అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్
ABN , First Publish Date - 2023-04-05T09:59:28+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్ట్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ (BJP Leader Bandi Sanjay Kumar) అక్రమ అరెస్ట్‌పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ (Telangana BJP Legal Cell) ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. బండి సంజయ్ (BJP Leader) ను అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో బీజేపీ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ (BJP) పిలుపునిచ్చింది. అటు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివస్తున్నారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పోలీస్ స్టేషన్ ప్రధాన ద్వారాన్ని బారికేడ్లతో మూసివేశారు. బీజేపీ శ్రేణులు భారీగా వస్తున్న నేపథ్యంలో బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుంచి బండి సంజయ్‌ను తరలించే అవకాశం ఉంది. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.
కాగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్ జ్యోతి నగర్‌లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లారు. అయితే, ఎక్కడికి తీసుకెళ్లారు!? ఎందుకు అరెస్టు చేశారు!? అనే విషయాలపై పోలీసులు నోరు మెదపడం లేదు. అయితే, పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తొలుత, అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత సుమారు 100 మంది పోలీసులు సంజయ్ ఇంటిని చుట్టుముట్టారు. ఆయన అరెస్టుకు ప్రయత్నించారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో, బండి సంజయ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని సంజయ్ కోరితే, అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబు ఇచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. చివరికి, దాదాపు ఒంటి గంట సమయంలో సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.