REVANTHREDDY: మేమొచ్చాక.. మళ్లీ మద్యం టెండర్లు

ABN , First Publish Date - 2023-08-15T02:31:20+05:30 IST

ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్లు ఎలా పిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వైన్‌ షాపులను సీఎం కేసీఆర్‌ సొంత మనుషులకు అప్పగించేందుకే ముందుగా టెండర్లు పిలిచారని ఆరోపించారు.

REVANTHREDDY: మేమొచ్చాక.. మళ్లీ మద్యం టెండర్లు

కేసీఆర్‌ మనుషులకు అప్పగించేందుకే.. ఎన్నికల ముందు టెండర్లు పిలిచారు

నగరం చుట్టూ 10 వేల ఎకరాలను ఆక్రమించిన కేసీఆర్‌ కుటుంబం

బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని సర్వేల్లో వెల్లడి

రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్‌దే: రేవంత్‌

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్లు ఎలా పిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వైన్‌ షాపులను సీఎం కేసీఆర్‌ సొంత మనుషులకు అప్పగించేందుకే ముందుగా టెండర్లు పిలిచారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రె్‌సదేనని, అధికారంలోకి రాగానే మద్యం షాపులకు మళ్లీ టెండర్లను పిలుస్తామని ప్రకటించారు. సోమవారం అలంపూర్‌, దేవరకద్ర, మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోనున్నట్లు సర్వేలు చెబుతున్నాయని, అందుకే కేసీఆర్‌ అన్ని ఆస్తులనూ అమ్ముకుుంటున్నారని తెలిపారు.

హైదరాబాద్‌ చుట్టూ కేసీఆర్‌ కుటుంబం 10 వేల ఎకరాలను ఆక్రమించుకుందని, రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పేదలకు పట్టా భూములు ఇస్తే.. అభివృద్ధి ముసుగులో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని లాక్కుంటోందని మండిపడ్డారు. ‘‘హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టడానికి జాగా లేదంటున్న ముఖ్యమంత్రి.. వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారు?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు. వంద రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రానుందని, భూములు కొంటున్నవారు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు.

అక్రమ కేసులు పెట్టించిన శ్రీనివా్‌సగౌడ్‌..

మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ కాంగ్రెస్‌ నేతలపై అక్రమ కేసులు పెట్టించారని, అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రేవంత్‌రెడ్డి అన్నారు. తప్పుడు కేసులు పెట్టే పోలీసు అధికారుల పేర్లను రెడ్‌ డైరీలో రాసి పెడతామని, అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని అన్నారు. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టానికి పరిహారం కోసం వరంగల్‌లో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నేతల అరెస్టును రేవంత్‌ ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

సోనియా గాంధీకి అద్దంకి దయాకర్‌ లేఖ

ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీని వీడకుండా ఉండే నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ కోరారు. పార్టీ పట్ల అంకిత భావం, నమ్మకం ఉన్న నేతలకే టిక్కెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆమెకు లేఖ రాశారు. రాష్ట్రంలోని అమర వీరుల కుటుంబాలని, ఉద్యమకారులను పార్టీ అక్కున చేర్చుకోవాలని, పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు, కార్యకర్తలకు విశ్వాసం కల్పించాలని స్పష్టం చేశారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ హామీని సోనియాగాంధీనే ప్రకటించి ప్రచారం చేయాలని సూచించారు.

ఖర్గే సభ వాయిదా

ఈ నెల 18న నిర్వహించ తలపెట్టిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ వాయిదా పడినట్లు తెలిసింది. తొలుత సభను జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరపాలనుకున్నా.. తాజాగా చేవెళ్లలో నిర్వహించాలన్న యోచనకు వచ్చినట్లు సమాచారం. ఖర్గే వీలునుబట్టి ఈ నెల 21 లేదా 22న నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రానికి కాంగ్రెస్‌ పార్టీ లేఖ ఇవ్వాలని మంద కృష్ణమాదిగ ఆ పార్టీ నేతల్ని కోరారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌ రెడ్డితో ఆయన సోమవారం గాంధీభవన్‌లో భేటీ అయ్యారు. వారు అనుకూలంగా లేఖ ఇస్తే.. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు విషయంలో తమ నిర్ణయం చెబుతామని విలేకరుల సమావేశంలో వివరించారు.

18 నుంచి కాంగ్రెస్‌ దరఖాస్తుల స్వీకరణ

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి పోవాలని పట్టుదలతో ఉంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులను ఈ నెల 18 నుంచి 25 వరకు గాంధీభవన్‌లో స్వీకరించనుంది. గాంధీభవన్‌లో సోమవారం జరిగిన స్ర్కీనింగ్‌ కమిటీ, ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ తొలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దరఖాస్తు విధివిధానాలు, రుసుము నిర్ణయంపై మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ చైర్మన్‌గా, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ సభ్యుడిగా సబ్‌ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ నెల 17 కల్లా సబ్‌ కమిటీ నివేదిక ఇవ్వాలని, 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలని నిర్ణయించారు. దరఖాస్తుకు ఓసీలకు రూ.50 వేలు, బీసీలకు రూ.25 వేల చొప్పున రుసుముగా తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సెప్టెంబరు నెలాఖరు కల్లా కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని మహే్‌షకుమార్‌ గౌడ్‌ తెలిపారు. దరఖాస్తు రుసుమును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Updated Date - 2023-08-15T02:54:52+05:30 IST