REVANTH REDDY : కేటీఆర్‌.. పత్తా లేకుండా పోయారేం!

ABN , First Publish Date - 2023-07-28T03:48:21+05:30 IST

వర్షాలు వరదలతో నాలుగు రోజులుగా హైదరాబాద్‌ ప్రజలు సతమతమవుతుంటే..

 REVANTH REDDY : కేటీఆర్‌.. పత్తా లేకుండా పోయారేం!

వర్షాలు, వరదలతో హైదరాబాద్‌ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోరా?

హైదరాబాద్‌ను నరకకూపంగా మార్చారు

మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు

బహిరంగ లేఖలో రేవంత్‌ విమర్శలు

హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): వర్షాలు(Rains) వరదలతో నాలుగు రోజులుగా హైదరాబాద్‌ ప్రజలు సతమతమవుతుంటే.. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ సమస్యలను పరిష్కరించకుండా పారిపోయారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మంత్రి కేటీఆర్‌(Ktr)పై విమర్శలు గుప్పించారు. పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటూ ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘హైదరాబాద్‌ నగర ప్రజలు వరదలతో గోసపడుతుంటే బాధ్యతాయుత పదవిలో ఉంటూ.. పట్టించుకోకుండా పత్తాలేకుండా పోయారు. ఫాం హౌస్‌లో మీ అయ్య, పార్టీల్లో మీరు సేద తీరుతూ ప్రజలను వరదల్లో ముంచేశారు. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్‌ హోల్‌ ఉందో అని ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించిం ది. హైదరాబాద్‌ను డల్లాస్‌, ఓల్డ్‌ సిటీని ఇస్తాంబుల్‌ చేస్తామని ప్రగల్బాలు పలికిన తండ్రీకొడుకులు నగరాన్ని నరక కూపంగా మార్చారు’’ అని విమర్శించారు.

గడిచిన 9 ఏళ్లలో నగరంలో సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టలేదని, ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్లుగా అన్నీ జరిగితే ఐటీ కారిడార్‌ నుంచి హయత్‌నగర్‌ దాకా ట్రాఫిక్‌ జామ్‌(Traffic jam)లు ఎందుకు నిత్యకృత్యంగా మారతాయని ప్రశ్నించారు. ట్రాఫిక్‌ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారని, పది నిమిషాల ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతోందని దుయ్యబట్టారు. ఫ్లై ఓవర్ల కింద అండ ర్‌ పాస్‌ల్లో నీళ్లు నిండిపోయి వాహనా లు వెళ్లలేక జనాలు ఇబ్బంది పడుతుం టే స్ర్టాటజిక్‌ రోడ్లు అంటూ మీరు చేసే హడావుడి అంతా డొల్లేనని తేలిపోయిందని విమర్శించారు. గ్రేటర్‌ పరిధిలోని టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారం భూములు, చెరువులను కబ్జా చేస్తూ అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఇంత విధ్వంసం జరుగుతుంటే కనీసం సమీక్ష చేసే సమ యం లేకుండా పోయిందని, వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించినా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అధికారులకైనా ఆదేశాలివ్వాలనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవరిస్తున్న మిమ్మల్ని ఏ విధంగా శిక్షించినా పాపం లేదని రేవంత్‌ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలను తీర్చే యత్నం చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో శుక్రవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.


వరద బాధితులకు అండగా నిలుద్దాం

వర్షాలు, వరదలతో ప్రజల కష్టాలు పడు తుంటే సీఎం కేసీఆర్‌ ప్రజలను పట్టించు కోకుండా రాజకీయాలు చేస్తూ పార్టీ ఫిరా యింపుదార్లను ప్రోత్సహిస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. వరద బాధితులకు కాంగ్రెస్‌ అండగా నిలవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం నిర్వహించిన జూమ్‌ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వర దలతో ఉపాధి కోల్పోయిన వారికి రూ.10వేలు ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షు లు కిషన్‌రెడ్డి స్పందించి కేంద్రం నుంచి వరద సహా యం వచ్చేలా చూడాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ హైద రాబాద్‌ కేంద్రంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి పున రావాసం కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు.

బాధితులను ఆదుకోవాలి: వామపక్షాలు

భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన వారిని తక్షణమే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. వరద బాధితులకు యుద్ధప్రాతిపదికన సాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-07-28T05:13:18+05:30 IST