Sharmila Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ మొదలైందా? షర్మిల చేరికపై మాణిక్ రావు ఠాక్రే అలా ఎందుకు అన్నారంటే..!?

ABN , First Publish Date - 2023-06-26T14:20:32+05:30 IST

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అన్ని పార్టీలు ఎవరికి వారే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ మంచి జోష్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఆ ఊపు తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా మొదలైంది. ఇందుకు జూపల్లి, పొంగులేటి లాంటి పెద్ద లీడర్లు హస్తం గూటికి చేరడమే కారణం.

Sharmila Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ మొదలైందా? షర్మిల చేరికపై మాణిక్ రావు ఠాక్రే అలా ఎందుకు అన్నారంటే..!?

ఢిల్లీ: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అన్ని పార్టీలు ఎవరికి వారే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ మంచి జోష్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఆ ఊపు తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా మొదలైంది. ఇందుకు జూపల్లి, పొంగులేటి లాంటి పెద్ద లీడర్లు హస్తం గూటికి చేరడమే కారణం. నిన్నామొన్నటి దాకా జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఏ పార్టీలో చేరతారో అన్న దానిపై ఉత్కంఠ నడిచింది. మొదట్లో బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. కానీ కర్ణాటక ఫలితం తర్వాత.. మొత్తం సీన్ రివర్స్ అయింది. వారి ఆలోచన కాంగ్రెస్ వైపునకు మళ్లింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు నడిపించిన చర్చలు ఫలించడంతో జూపల్లి, పొంగులేటి హస్తం గూటికి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక వీరితో పాటు మరికొందరు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమిత్ షా (Amit Shah)ను కలిసిన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కూడా రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. బీజేపీపై ఎలాంటి భ్రమలు పెట్టుకోకుండా.. హస్తంతో చేతులు కలపాలని రేవంత్ వారికి పిలుపునిచ్చారు. ఇంకోవైపు వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను కూడా కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయిని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆమె ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలవబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. పొత్తు పెట్టుకుంటారా? లేదంటే పార్టీ విలీనం చేస్తారా? అన్నది త్వరలోనే తేలిపోనుంది. ఇదిలా ఉంటే అధికార పార్టీ కూడా దూకుడు పెంచింది. బీసీలకు లక్ష రూపాయల సాయం.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీతో ఎన్నికల సమరానికి రెడీ అయిపోయింది. ప్రస్తుతం 200 వాహనాలతో సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. ఇలా అన్ని పార్టీల్లో ఎన్నికల హంగామా మొదలైపోయినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా హస్తినకు చేరుకున్నారు. వీరితో పాటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఢిల్లీలోనే ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్‌గాంధీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై నేతలతో రాహుల్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

షర్మిల చేరికపై మాణిక్ రావు ఠాక్రే ఏమన్నారంటే..!

ఇక వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila)తో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు టచ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే (Manikrao Thakare) స్పందించారు. వైఎస్సాఆర్‌టీపీ.. కాంగ్రెస్‌లో విలీనంపై తనకు సమాచారం లేదని తెలిపారు. ఈ అంశం అధిష్టానం పరిధిలోని అంశంగా తేల్చిచెప్పారు. షర్మిల.. అధిష్టానంతో టచ్‌లో ఉన్నారో లేదో తనకు తెలియదు అని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. రేణుకాచౌదరి సీనియర్ లీడర్‌గా తనను కలిశారని వివరించారు. ఇందులో కొత్తేమీ లేదని చెప్పారు. నేతలతో చర్చించడం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లడం వల్ల ఒరిగేదేమీ లేదని తేల్చిచెప్పారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్‌లో చేరేవారి వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. పసలేనివారే బీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనని తెలంగాణ ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌లో మరిన్ని చేరికలుంటాయని.. సర్వే రిపోర్టులను బట్టే టికెట్లు ఇవ్వడం జరుగుతుందని మాణిక్ రావు ఠాక్రే తేల్చిచెప్పారు.

ఇదిలా ఉంటే ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక పీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్‌ను షర్మిల కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాహుల్‌గాంధీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. అనంతరం పాదయాత్రలో అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్కకు షర్మిల ఫోన్ చేసి పరామర్శించారు. ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆమె ఢిల్లీ పెద్దలను కలవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ సీనియర్ నేత వీహెచ్.. షర్మిల చేరికను వ్యతిరేకిస్తున్నారు. ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగిస్తే బాగుందని.. అక్కడికి వెళ్లడమే మేలు అని వీహెచ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-26T14:20:32+05:30 IST