Revanth Reddy: వాళ్ల పేర్లు రెడ్ బుక్‌లో రాస్తున్నాం.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-18T16:39:20+05:30 IST

ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్‌లో రాస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం.

Revanth Reddy: వాళ్ల పేర్లు రెడ్ బుక్‌లో రాస్తున్నాం.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తనను ఓడించడానికి సీఎం కేసీఆర్ (CM Kcr) పోలీసులను వాడుకుంటున్నారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. సెక్యూరిటీ, కోకాపేట భూములు, మైనార్టీల విషయంపై రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘‘కోర్టు చెప్పినా ప్రభుత్వం నాకు సెక్యూరిటీ ఇవ్వడం లేదు. ఎంపీగా ఉన్నాను.. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగిస్తారా?, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కి కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చాం. నేను ప్రజల మనిషిని. నాకు సెక్యూరిటితో పని లేదు. నేను సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా వెళ్తాను. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు కేసీఆర్ రాగలరా?, సెక్యూరిటీ విషయంలో నన్ను భయపెట్టాలని చూస్తే భయపడేవాడ్ని కాదు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నా సైన్యం. నా సెక్యూరిటీ వాళ్లే. ఎన్నికల సమయం వచ్చినప్పుడు పొత్తుల గూర్చి ఏఐసీసీ చూసుకుంటుంది.’’ అని రేవంత్ తెలిపారు.

మైనార్టీలు కాంగ్రెస్ వైపే..

‘‘కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ మైనార్టీ అనే తేడా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు చాలా పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మైనార్టీల కోసం ఏం చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఒక్క పర్సెంట్ కూడా మైనార్టీలకు దక్కలేదు. ఇక్కడ కారు బయల్దేరి ఢిల్లీకి చేరే వరకు అది కమలంగా మారిపోతోంది. బీఆర్ఎస్‌కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. కేసీఆర్ మైనార్టీ ఓట్లను బీజేపీకి అమ్ముకుంటున్నారు. మైనార్టీలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. బీజేపీ తెచ్చిన ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లుకి కేసీఆర్ మద్దతు ఇచ్చారు. బీజేపీ-బీఆర్ఎస్ వేర్వేరు కాదు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడానికి ఎక్కడికైనా వస్తాం. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుడి, మసీదు, చర్చి ఎక్కడికైనా వచ్చి చెప్తాం. బీఆర్ఎస్ వాళ్లు అలా చెప్పగలరా?, అన్ని డిపార్ట్‌మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారు. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్‌లో రాస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం. ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు, భుజంగ రావు, నర్సింగ్ రావు లాంటి అధికారులనే నేను అనేది. ప్రజల కోసం పని చేసే అధికారులపై నాకెప్పుడూ గౌరవం ఉంటుంది. ప్రభుత్వ అధికారులుగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని అంటున్న వాళ్ల విషయంలో సైలెంట్‌గా ఎలా ఉంటాం. అధికారులకు రాజకీయాలతో ఎం సంబంధం?, పది సంవత్సరాల్లో చేయనిది రెండు నెలల్లో ఎలా చేస్తారు?.’’ అని రేవంత్ నిలదీశారు.

బీఆర్ఎప్ నేతలు ఆ స్థాయికి ఎదిగారు

‘‘ఒక్క ఎకరానికి వంద కోట్లు పెట్టగలిగేలా బీఆర్ఎస్ నేతలు ఎదిగారు. పేద ప్రజలు మాత్రం పేదలుగానే ఉంటున్నారు. కోకాపేట, బుద్వేల్‌లో భూములు కొన్న సంస్థల పేర్లు ఎందుకు చెప్పడం లేదు. కోకాపేట, బుద్వేల్‌లో భూములు కొన్నది బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ బీనామీలే.’’ అని రేవంత్ ఆరోపించారు.

Updated Date - 2023-08-18T16:39:20+05:30 IST