Kishanreddy: తెలంగాణలో నడుస్తోంది వాటాల ప్రభుత్వం.. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త
ABN, First Publish Date - 2023-08-12T13:06:57+05:30
తెలంగాణలో 30 శాతం వాటాల ప్రభుత్వం నడుస్తోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో (Telangana State) 30 శాతం వాటాల ప్రభుత్వం నడుస్తోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 30 శాతం వాటాల ప్రభుత్వం మళ్ళీ వస్తే.. తెలంగాణలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. భూములమ్మి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని, అమ్మకాలపై ఆధాపడి కేసీఆర్ ప్రభుత్వం (Telangana Government) నడుస్తోందని విమర్శించారు. బైఎలక్షన్స్‌లో ఈటలను ఓడించటం కోసమే దళితబంధు పథకం తీసుకొచ్చారన్నారు. దళితబంధు పేరుతో కేసీఆర్ (CM KCR) దళితులను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి పేరుతో విద్యార్థులను దగా చేశారన్నారు. పెట్రోల్, డీజిల్‌పై టాక్స్ తగ్గించని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పొదుపు సంఘాల ఉసురు పోసుకుంటున్నారన్నారు. కేసీఆర్ హాయాంలో తెలంగాణలో వాటాల ప్రభుత్వం నడుస్తోందని కేంద్రమంత్రి విరుచుకుపడ్డారు.
డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే డబుల్ బెడ్రూం ఇళ్లు...
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు వస్తాయని అన్నారు. తొమ్మిదేళ్ళల్లో పేదలకు ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లో ప్రగతిభవన్ కట్టుకున్న కేసీఆర్‌కు పేదల ఇళ్ళపై చిత్తశుద్ధి లేదన్నారు. పేదల గొంతు కోయటం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అంటూ వ్యాఖ్యలు చేశారు. బలిదానాలతో వచ్చిన తెలంగాణ కేసీఆర్ పాలనలో దగా పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్నారు. తెలంగాణ సంపదను బీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారని.. మాఫియాలు తెలంగాణను పాలిస్తున్నాయని మండిపడ్డారు. 35 లక్షల మందికి డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తామన్న కేసీఆర్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సొంత జాగ ఉంటే ఇల్లు కట్టుకోవటానికి డబ్బులిస్తామనటం దుర్మార్గమన్నారు. రాష్ట్ర సర్కార్ పేదలకు ఇళ్లు కడితే.. కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత తెలంగాణ బీజేపీ తీసుకుంటోందని తెలిపారు. నాలుగు నెలల తర్వాత కేసీఆర్ గద్దె దిగటం ఖాయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ లోపల, బయట డబుల్ బెడ్రూం ఇళ్ళపై పేదలను మభ్యపెడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-08-12T13:07:01+05:30 IST