YSRTP: చివరి నిమిషంలో వ్యూహం మారింది!

ABN , First Publish Date - 2023-10-12T03:50:37+05:30 IST

గతంలో వైసీపీ తరఫున ఏపీలోని పులివెందుల శాసనసభ నియోజకవర్గం, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎ్‌సఆర్‌ సతీమణి విజయలక్ష్మి.. ఈ సారి తెలంగాణలో తన

 YSRTP: చివరి నిమిషంలో వ్యూహం మారింది!

  • పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ

  • మిర్యాలగూడకు షర్మిల షిఫ్ట్‌

  • నేడు వైఎస్‌ఆర్టీపీ కార్యవర్గ భేటీ

  • మొత్తం 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం

  • మిగిలిన నియోజకవర్గాలకూదరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): గతంలో వైసీపీ తరఫున ఏపీలోని పులివెందుల శాసనసభ నియోజకవర్గం, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎ్‌సఆర్‌ సతీమణి విజయలక్ష్మి ( YS Vijayalakshmi).. ఈ సారి తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి వైఎ్‌సఆర్టీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంతకుముందు పాలేరు నుంచే తాను పోటీ చేయనున్నట్లుగా ప్రకటించిన ఆ పార్టీ అధినేత్రి షర్మిల.. మిర్యాలగూడకు షిఫ్ట్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. వైఎ్‌సఆర్టీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరగనున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో షర్మిల ఈ మేరకు ప్రకటన చేయనున్నట్లు సమాచారం. పాలేరు, మిర్యాలగూడ సహా 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు ఆస్కారం ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి వైఎస్‌ విజయలక్ష్మి ఎన్నికల ప్రస్థానం ఇప్పటిదాకా ఏపీలోనే కొనసాగింది. వైఎ్‌సఆర్‌ చనిపోయిన తర్వాత పులివెందులకు ఉప ఎన్నిక రాగా.. కాంగ్రెస్‌ తరఫున ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె కుమారుడు జగన్‌.. కాంగ్రె్‌సను వీడి వైసీపీని పెట్టినప్పుడు.. విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌ పార్టీకి, పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున పులివెందుల నుంచి ఆమె తిరిగి ఎన్నికయ్యారు. అయితే 2014 ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్‌ జగన్‌ పోటీ చేయగా.. విజయలక్ష్మి విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు. తెలంగాణలో వైఎ్‌సఆర్‌ పాలన లక్ష్యంగా ఆమె కూతురు షర్మిల.. వైఎ్‌సఆర్టీపీ పెట్టిన తర్వాత వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచీ విజయలక్ష్మి తెలంగాణలో షర్మిలకు అవసరమైన సహకారం అందిస్తూ వస్తున్నారు.

అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు కూతురు కోసం!

రాష్ట్రంలో షర్మిల (ys sharmila) సుదీర్ఘ పాదయాత్ర చేసినా.. వైఎస్‌ఆర్టీపీకి ప్రజల నుంచి ఆశించిన మేరకు ఆదరణ రాలేదన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్‌ఆర్టీపీని కాంగ్రె్‌సలో విలీనం చేసే అంశంపై ఆ పార్టీతో షర్మిల చర్చలు జరిపారు. అయితే తనకు తెలంగాణ స్థానికతనే కావాలంటూ షర్మిల పట్టుపట్టడం, దానికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. ఆయన వర్గం అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో ఆ ప్రతిపాదన అటకెక్కింది. ఈ క్రమంలో వైఎ్‌సఆర్టీపీ తరఫున అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను దింపేందుకు ప్రస్తుతం షర్మిల కసరత్తు చేస్తున్నారు. అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సమాయత్తమైన షర్మిల.. పార్టీ పునరుజ్జీవం కోసం తన తల్లి వైఎస్‌ విజయలక్ష్మిని మళ్లీ ఎన్నికల రంగంలోకి దించనున్నట్లు చెబుతున్నారు. పాలేరును విజయలక్ష్మికి కేటాయించి.. తాను మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రకటించనున్నట్లు సమాచారం. అలాగే మరో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.. పార్టీ నేత తూడి దేవేందర్‌రెడ్డి అధ్యక్షతన మ్యానిఫెస్టో కమిటీనీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్‌ వద్ద రిజిస్టర్డ్‌ పార్టీగా మాత్రమే ఉన్న వైఎ్‌సఆర్టీపీకి గుర్తింపు కోసమూ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వైఎ్‌సఆర్టీపీని రికగ్నైజ్డ్‌ పార్టీగా ప్రకటించి రైతు గుర్తును కేటాయించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తూ చేసుకున్నట్లు చెబుతున్నారు.

Updated Date - 2023-10-12T11:33:36+05:30 IST