YS Sharmila: ‘పథకం ప్రకారమే నన్ను అడ్డుకున్నారు.. నేను ఎందుకు తగ్గాలి’
ABN , First Publish Date - 2023-04-26T15:33:56+05:30 IST
టీసేవ్ నిరుద్యోగ నిరాహార దీక్ష ఆపాలని ప్రయత్నించారని అందుకే తనను అరెస్ట్ చేశారని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.
హైదారబాద్: టీసేవ్ నిరుద్యోగ నిరాహార దీక్ష ఆపాలని ప్రయత్నించారని అందుకే తనను అరెస్ట్ చేశారని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) వ్యాఖ్యలు చేశారు. ఇందిరాపార్క్ వద్ద టీ సేవ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. టీసేవ్ (T-Save) దీక్షకు అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయినా దీక్షను ఆపాలని ప్రయత్నాలు చేశారని.. అందుకే తనను అరెస్ట్ చేశారన్నారు. సిట్ ఆఫీస్‌కు వెళ్తుంటే రసాబాస చేశారన్నారు. పథకం ప్రకారమే అడ్డుకున్నారని ఆరోపించారు. ఒక్క మహిళను అడ్డుకోవడానికి మొత్తం పోలీస్ ఫోర్స్ దిగారని మండిపడ్డారు. ‘‘నన్ను అడ్డుకొనేందుకు ఏం ఆర్డర్స్ లేవు. నన్ను హౌజ్ అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ కూడా లేవు. నేను ఎందుకు తగ్గాలి. నేను పోరాటం చేస్తున్నది నిరుద్యోగుల కోసం. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం పోరాటం’’ చేస్తున్నానని తెలిపారు. ప్రతిపక్షాలు నోరు మూసుకొని కూర్చుంటే ప్రజల పక్షాన నిలబడాలని పోరాటం చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉందని ఎత్తి చూపింది తానే అని అన్నారు. ఈ ప్రభుత్వానికి మహిళలు అంటే లెక్కే లేదని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి భార్య విజయమ్మకు (YS Vijayamma) గౌరవం ఇవ్వకుండా అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ హయాంలో పోలీస్ శాఖ ఒక వెలుగు వెలిగిందని.. ఇప్పుడు పోలీసులను కేసీఆర్ పని మనుషులుగా వాడుకుంటున్నారని విమర్శించారు. పోలీస్ శాఖ అంటే గౌరవం ఉందని.. వారిని అవమానపరచడం తన ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. మీద పడ్డారు కాబట్టే సెల్ఫ్ డిఫెన్స్ కోసం తోయాల్సి వచ్చింది.. అంతేకాని కొట్టాలని ఉద్దేశం లేదన్నారు. పోలీసులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఎవరు జీతాలు ఇస్తున్నారు.. ఎవరికి సేవ చేస్తున్నాం తెలుసు కోవాలని వైఎస్సార్టీపీ అధినేత్రి హితవుపలికారు.
తీగ లాగితే ఐటీశాఖ డొంక కదిలే ప్రమాదం ఉందని...
కేసీఆర్ (CM KCR) కుటుంబం మొత్తం స్కాంలతో కూరుకుపోయిందని విమర్శించారు. కేసీఆర్ వాటర్ స్కాం, బిడ్డ లిక్కర్ స్కాం, కొడుకు టీఎస్‌పీఎస్సీ పేపర్ స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. సిట్‌కు కేవలం రిప్రజెంటేషన్ కోసమే వెళ్ళాలి అనుకున్నామని వివరించారు. ఈ కేసులో కేవలం 19 మందిని మాత్రమే దోషులుగా చిత్రీకరణ చేశారని.. పెద్ద తలకాయలను వదిలేశారని అన్నారు. పాత్రధారులను మాత్రమే పట్టుకున్నారని... సూత్రధారులను వదిలేశారని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌లో ఐటీ లోపాలు ఉన్నాయన్నారు. పేపర్ హ్యాక్ అయ్యిందని స్వయంగా చైర్మన్ చెప్పారన్నారు. ఇదేనా ఐటీ శాఖ భద్రత అని ప్రశ్నించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR).. టీఎస్‌పీఎస్సీకి పారదర్శకత ఉందంటారని.. పేపర్ లీక్ అయ్యేసరికి తనకేం సంబంధం లేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐటీ శాఖ చట్టం ప్రకారం ప్రభుత్వ పరిధిలో వాడే ప్రతీ కంప్యూటర్‌కు ఆడిట్ జరగాలన్నారు. సూటు బూటు వేసుకొని విదేశాలు తిరిగితే ఐటీ శాఖ మంత్రి అనరన్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేసిన కేటీఆర్‌కు ఫైర్ వాల్స్ అంటే తెలియదా అని ప్రశ్నించారు. ఐపీ అడ్రెస్స్ తెలిస్తే టెర్రరిస్ట్‌లు కూడా ప్రభుత్వ సిస్టంలను హ్యాక్ చేయొచ్చు అన్నమాట అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పరిధిలో వాడుతున్న కంప్యూటర్లకు ఎన్నింటికి భద్రత సర్టిఫికెట్లు ఉన్నాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ విషయంలో ఐటీ శాఖ లోపాలు ఉన్నాయని.. అందుకే సిట్ దర్యాప్తుతో మమ అనిపిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణ చేస్తే ఐటీ లోపాలు బయట పడతాయని భయంపట్టుకుందన్నారు. తీగ లాగితే ఐటీశాఖ డొంక కదిలే ప్రమాదం ఉందని.. కేటీఆర్‌ను కాపాడేందుకే సిట్ వేసుకున్నారని దుయ్యబట్టారు.
కేటీఆర్‌కు సవాల్...
‘‘మీకు దమ్ముంటే సీబీఐ విచారణ చేయించండి. టీఎస్‌పీఎస్సీలో వాడుతున్న కంప్యూటర్లకు ఆడిట్ సర్టిఫికెట్‌లు బయట పెట్టండి.కొండను తవ్వి ఎలకలను పట్టడం కాదు.. వెనుక ఉన్న తిమింగలాలు పట్టండి’’ అంటూ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. టీ సేవ్ తరుపున కేసీఆర్‌కు ఒక ప్రశ్నాపత్రం పంపుతున్నామని.. ఇందులో పది ప్రశ్నలు ఉన్నాయని.. వాటికి దమ్ముంటే కేసీఆర్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.