YS Sharmila: చంచల్‌గూడ జైలు నుంచి షర్మిల విడుదల
ABN , First Publish Date - 2023-04-25T15:48:54+05:30 IST
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు (Telangana HighCourt) ఆదేశాల మేరకు రూ.30 వేల పూచీకత్తుతో కూడిన రెండు షూరిటీలను షర్మిల కోర్టుకు సమర్పించారు. అనంతరం విడుదల ఆర్డర్‌తో షర్మిల తరపు న్యాయవాదులు, పార్టీ కార్యకర్తలు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. ఆపై విడుదల ఆర్డర్‌ను చంచల్‌గూడ జైలు అధికారులకు సమర్పించారు. ఆ తరువాత షర్మిలను జైలు అధికారులు విడుదల చేశారు. షర్మిల విడుదల నేపథ్యంలో చంచల్‌గూడ జైలుకు భారీగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. జైలు నుంచి విడుదలైన అనంతరం వైఎస్సార్టీపీ అధినేత్రి లోటస్‌పాండ్‌కు బయలుదేరి వెళ్లారు. నిన్నటి నుంచి జరిగిన పరిణామాలపై మరికాసేపట్లో షర్మిల మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులను కలిసేందుకు వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కారు వద్దకు వెళ్లిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వైఎస్సార్టీపీ అధినేత్రి.. ఓ ఎస్సై స్థాయి అధికారిపై చేయిచేసుకోగా, మరో మహిళా కానిస్టేబుల్‌ను చేత్తో నెట్టేశారు. దీంతో పోలీసులపై చేయి చేసుకున్న కారణంగా షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాంధీలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను కోర్టులో హాజరుపర్చగా.. వచ్చే నెల 8వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈరోజు ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణకు రాగా.. షర్మిలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులతో కూడిన బెయిల్‌ను షర్మిలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.30 వేలు, ఇద్దరి పూచీకత్తుతో షర్మిలకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని న్యాయస్థానం స్పష్టం చేసింది.