Jupally Krishna Rao: సందిగ్ధంలో జూపల్లి
ABN, First Publish Date - 2023-04-13T19:09:58+05:30
బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) రాజకీయంగా సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
నాగర్‌కర్నూల్: బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) రాజకీయంగా సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తమ పార్టీలో చేరితే సముచితమైన స్థానం కల్పిస్తామని కాంగ్రెస్, బీజేపీ (Congress, BJP)ల నుంచి ఆఫర్లు రావడంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఉప్పు నిప్పులా ఉండే జూపల్లి కృష్ణారావుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) స్వయంగా ఫోన్ చేసి బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Former MP Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావులతో సహా దాదాపు పది మంది క్రియాశీల నేతలు తమ పార్టీలో చేరితే తెలంగాణలో మరింత బలోపేతమవుతామని భావిస్తున్న బీజేపీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) కాంగ్రెస్ కూడా కార్యాచరణకు పదును పెట్టింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే ఖమ్మం, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును సునాయాసం చేసుకోవచ్చునని ఈ ప్రభావం తెలంగాణ అంతటా ఉంటుందనే భావనలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు 8 నెలల నుంచి కాంగ్రెస్ అధిష్టానం, జూపల్లి కృష్ణారావుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.
జూపల్లి కృష్ణారావు అనుచరులు కూడా ఆయన బీజేపీలో కంటే కాంగ్రెస్‌లో చేరితేనే బాగుంటుందనే భావనను అంతరంగిక సమావేశంలో తెలియజేశారని సమాచారం. కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టిపట్టు ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 స్థానాలుండగా కేవలం కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి గెలుపొందడం ఇందుకు నిదర్శనమని కూడా జూపల్లి ప్రధాన అనుచరులు ఊటంకిస్తున్నారు. బీఆర్‌ఎస్ (BRS), కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ జరిగితే తిరిగి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం ఖాయమనే వాదనను కూడా తెరమీదకు తెస్తున్నారు. అయితే ఏ పార్టీలో చేరాలన్న విషయంలో జూపల్లి కృష్ణారావు మే నెల మొదటి లేదా రెండవ వారంలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు తన క్యాడర్‌కు జూపల్లి సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు సస్పెండ్ కావడంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి (Beeram Harshavardhan Reddy) తన దూకుడును పెంచారు. నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలకు పదును పెట్టడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ద్వారా జనానికి చేరువయ్యేందుకు కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు.
Updated Date - 2023-04-13T19:09:58+05:30 IST