Jupally Krishna Rao: సంచలనాలకు మారుపేరు జూపల్లి.. ఆయన కెరియర్ ఎలా సాగిందంటే...

ABN , First Publish Date - 2023-04-10T19:41:35+05:30 IST

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)పై బీఆర్‌ఎస్‌ సస్పెన్షన్‌ వేటు రాజకీయవర్గాలను కుదిపేస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత

Jupally Krishna Rao: సంచలనాలకు మారుపేరు జూపల్లి.. ఆయన కెరియర్ ఎలా సాగిందంటే...

మహబూబ్‌నగర్‌: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)పై బీఆర్‌ఎస్‌ సస్పెన్షన్‌ వేటు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, ఆయనపై గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి బీరం హర్షవర్థన్‌రెడ్డి (Beeram Harshavardhan Reddy)ని బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నప్పటి నుంచి జూపల్లి క్రమంగా బీఆర్‌ఎస్‌కు దూరమవుతూ వచ్చారు. రెండువర్గాల నాయకులు, కార్యకర్తలు కలిసి ఉండలేక మొదలైన వైరం చివరకు జూపల్లి సస్పెన్షన్‌కు దారితీసింది. హర్షవర్థన్‌ను బీఆర్‌ఎస్‌ (BRS)లో చేర్చుకున్నప్పటి నుంచి అధిష్టానంపై తరచూ జూపల్లి అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అయితే ఆదివారం కొత్తగూడెంలో జరిగిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని, బీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై నేరుగా విమర్శలకు దిగడంతో వ్యవహారం పతాక స్థాయికి చేరింది. ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించిన బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం తాజాగా పొంగులేటి సహా జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

నలుగురు సీఎంల దగ్గర పనిచేసిన జూపల్లి

జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా (Mahbubnagar District)లో సంచలన రాజకీయాలకు పేరుగా నిలిచారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే అప్పట్లో విద్యుత్‌ సమస్యలపై ఉద్యమించి, జైలుకు వెళ్లారు. ఉమ్మడి జిల్లాలో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ అన్ని నియోజకవర్గాల్లో తన అనుచరవర్గాన్ని ఏర్పర్చుకున్నారు. తనవెంట నడిచినవారికి రాజకీయ ప్రాధాన్యం కల్పించడంతో పాటు ఇతర అవకాశాలిప్పిస్తూ తన పట్టును పెంచుకున్నారు. 2004లో అనూహ్యంగా పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని టీఆర్‌ఎస్‌కు కేటాయిస్తే, జూపల్లి స్వతంత్ర అభ్యర్థిగా విమానం గుర్తుపై పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అసోసియేట్‌ సభ్యునిగా కొనసాగారు. 2009లో తిరిగి కాంగ్రెస్‌ టిక్కెట్‌పై గెలుపొందిన జూపల్లి వైఎస్‌ఆర్‌, రోశయ్య మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి (Kiran Kumar Reddy) కేబినెట్‌లో జూపల్లికి ప్రాధాన్యం తగ్గించి దేవాదాయ, ధర్మాదాయ శాఖను ఇచ్చారు.

అయితే మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ (Telangana) ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ ఉమ్మడి జిల్లాలో పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర సమయంలో అప్పటి మరో మంత్రి డీకే అరుణకు, జూపల్లికి నడుమ తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగి రాష్ట్రస్థాయిలో చర్చకు దారితీసింది. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కృష్ణారావు టీఆర్‌ఎస్‌లో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. 2014లో సీఎం కేసీఆర్‌ (CM KCR) తొలి కేబినెట్‌లో మొదట భారీపరిశ్రమల శాఖ మంత్రిగా, ఆ తర్వాత పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఈయనపై గెలుపొందిన హర్షవర్థన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో అప్పటి నుంచి నియోజకవర్గంలో రెండువర్గాల మధ్య వర్గపోరు మొదలైంది.

జూపల్లి తదుపరి కార్యాచరణపై అందరి దృష్టి

సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన జూపల్లి కృష్ణారావు తదుపరి కార్యాచరణపై అందరి దృష్టి నెలకొన్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ అనుచరవర్గం, ముఖ్యనేతలతో సత్సంబంధాలు కలిగిన ఆయన ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ప్రధానంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్‌ (BJP Congress) నుంచి ఆయనకు ఆహ్వానాలున్నప్పటికీ ఏపార్టీలో చేరే అంశం తేల్చకపోవడంతో సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ ఉన్న ఆయన అనుచరులు ఇప్పుడు పార్టీ మారితే కూడా ఆయనతో కలిసి ఉంటారా? లేక ఆయన్ని వదిలి బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారా అనే అంశం తేలాల్సి ఉంది. మొత్తంగా జూపల్లిపై సస్పెన్షన్‌ వేటు, ఆయన తీసుకునే తదుపరి రాజకీయ కార్యాచరణ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కొత్త పరిణామాలకు దారితీయడం ఖాయమనే చర్చ సాగుతోంది.

Updated Date - 2023-04-10T20:22:41+05:30 IST