Bhadrachalam: భద్రాద్రి రామాలయం ఉపాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
ABN , First Publish Date - 2023-10-15T07:40:14+05:30 IST
భద్రాద్రి రామాలయం ఉపాలయం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
భద్రాచలం: భద్రాద్రి రామాలయం ఉపాలయం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఆదిలక్ష్మీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
కాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శరన్ననవరాత్రి ఉత్సవాలు ఐదు దశాబ్దాలుగా నిర్వహిస్తుండటం విశేషం. 1973లో ఈ ఉత్సవాలకు దేవస్థానం శ్రీకారం చుట్టగా 2023 నాటికి అర్దశతాబ్ధ పూర్తయ్యింది. 15నుంచి 23వరకు శరన్ననవరాత్రి మహోత్సవాలు నిర్వహించనుండగా 24న విజయదశమి సందర్భంగా నిజరూపలక్ష్మి అలంకారం, శ్రీరామాయణపారాయణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ సమయంలో సంక్షేప రామాయణ పూర్ణాహుతి, పట్టాభిషేకం, విజయోత్సవం, శమీపూజ, ఆయుధపూజ, శ్రీరామలీలా మహోత్సవం నిర్వహించనున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాలు పాంచరాత్రగమ శాసా్త్రనికి అనుగుణంగా వీరలక్ష్మి ఉత్సవాలుగా భక్తరామదాసు కాలం నాటినుంచి కొనసాగుతున్నాయి. అయితే కాలక్రమేణా భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేయాలనే సంక ల్పం 1973-74లో ప్రారంభమైంది. నాటినుంచి నేటి ఏటా ఆశ్వీజమాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారు రోజుకొక అలంకారంలో ఎనిమిది రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారు. వాటినే అష్టలక్ష్మీ అలంకారాలంటారు. ఉత్సవాల్లో భాగంగా దర్బారు సేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రామాయణ పారాయణం నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. రామాయణ పారాయణం పూర్తి చేసిన అనంతరం విజయదశమి రోజు స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ.