Minister Harish Rao: ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-08T18:17:43+05:30 IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై తెలంగాణ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) విమర్శలు గుప్పించారు.

Minister Harish Rao: ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై తెలంగాణ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) విమర్శలు గుప్పించారు. కడుపులోని విషం కక్కేందుకే మోదీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. ప్రధాని ప్రసంగం మొత్తం సత్యదూరమని, ఆసరా పెన్షన్లు, రైతుబంధు వంటివి లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అవుతున్నాయని, తనవల్లే డిబిటి మొదలైనట్లు మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారని హరీష్‌రావు మండిపడ్డారు. రైతుబంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యిందని, రైతుబంధుతో పోలిస్తే పీఎం కిసాన్ సాయం ఎంత? అని హరీష్‌రావు ప్రశ్నించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం లేదని ప్రధాని మోదీ అనడం హాస్యాస్పదంగా ఉందని ట్విట్టర్‌లో మంత్రి హరీష్‌రావు అన్నారు. నిజానికి ఈ పరిస్థితి రివర్స్‌గా ఉందని ట్విట్టర్‌లో మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా.. పదో తరగతి పరీక్షపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రధాన కుట్రదారుడు, సూత్రధారి అని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పేపర్‌ లీకేజీలో సంజయ్‌ అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీని రాజకీయంగా ఎదుర్కొలేని బీజేపీ పసిపిల్లలతో క్షుద్ర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. భవిష్యత్‌ తరాలకు బీజేపీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నదని నిలదీశారు. సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ను కలిసి కోరతామని హరీశ్‌రావు వెల్లడించారు. తాండూరులో పేపర్‌ లీకేజీకి పాల్పడిన ఉపాధ్యాయుడు బీజేపీ అనుబంధమైన ఉపాధ్యాయ సంఘంలో పనిచేస్తున్నాడని, వరంగల్‌లో అరెస్టు అయిన ప్రశాంత్‌కు బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేతలతో సంబంధాలున్నాయని ఆరోపించారు.

ఈ సందర్భంగా బీజేపీ నేతలతో ఉన్న ప్రశాంత్‌ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. టెన్త్‌ హిందీ ప్రశ్నపత్రాన్ని బీజేపీ కార్యకర్త.. సంజయ్‌కు వాట్సాప్ లో పంపించడం, సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిందితుడు ప్రశాంత్‌ 142 సార్లు సంజయ్‌తో మాట్లాడింది నిజమో కాదో చెప్పాలన్నారు. ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం లేకుంటే నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచిపెట్టారని నిలదీశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనసాగుతున్న గూండాగిరిని తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ లో పంపితే తప్పేంటని సమర్థించడం సిగ్గుచేటన్నారు. సంజయ్‌ చర్యలకు బీజేపీ అధిష్టానం మద్దతు ఉండొచ్చని హరీష్ రావు అనుమానం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-08T18:19:04+05:30 IST