జీవితాలు చెల్లాచెదురు
ABN , First Publish Date - 2023-02-17T00:50:37+05:30 IST
డ్రైవర్ అతివేగం, నాలుగు కుటుంబాలను చెల్లాచెదురు చేసింది. ఇంటికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉంటూ జీవితాలను నెట్టుకొస్తున్న అతివల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
నలుగురిని మింగిన డ్రైవర్ నిర్లక్ష్యం
ఆటోను ఢీకొన్న ప్రైవేట్ బస్సు
మహిళా కార్మికులు మృతి
యాదాద్రిభువనగిరిలో ఘటన
చౌటుప్పల్ రూరల్, ఫిబ్రవరి 16 : డ్రైవర్ అతివేగం, నాలుగు కుటుంబాలను చెల్లాచెదురు చేసింది. ఇంటికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉంటూ జీవితాలను నెట్టుకొస్తున్న అతివల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం ఇండసి్ట్రయల్ పార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన నలుగురు మహిళల మృతితో దేవలమ్మనాగారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారం గ్రామానికి పలువురు మహిళలు దండుమల్కాపురం శివారులోని గ్రీన ఇండసీ్ట్రయల్ పార్క్‌లోని తేజస్ ఫుడ్, తెలుగు పచ్చళ్ల పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. రోజూమాదిరే గురువారం ఉదయం 8-30 నిమిషాలకు గ్రామం నుంచి బయలుదేరిన ఆటోను పరిశ్రమకు వంద మీటర్ల దూరంలో కంపెనీకి చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న మహిళా కూలీలంతా చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయారు. ప్రమాదంలో డాకోజి నాగలక్ష్మీ(30), వరకాంతం అనసూయ(55), సిలువేరు ధనలక్ష్మీ(35), దేవరపల్లి శిరీష(30) తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారై, నేరుగా చౌటుప్పల్ పోలీ్‌సస్టేషనకు వెళ్లి లొంగిపోయాడు. మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు.
మిన్నంటిన రోదనలు
హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నాగలక్ష్మీ, అనసూయ, ధనలక్ష్మి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి మృతదేహాలను చూసేందుకు తరలివచ్చిన బంధువులు, గ్రామస్థుల రోదనలతో ఆస్పత్రి ఆవరణ మారుమోగింది. కుటుంబ సభ్యుల రోదనలు చూసిన వారంతా కన్నీరు పెట్టుకున్నారు. మృతుల పిల్లలను చూసిన వారంతా కన్నీటిపర్యంతం అయ్యారు.
గ్రామంలో విషాదఛాయలు
గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు ఒకేసారి మృతి చెందడంతో దేవలమ్మనాగారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఎవరిని కదిలించినా, ఎక్కడ చూసినా విషాద వాతావరణం కనిపించింది. అందరితో కలివిడిగా ఉండే వ్యక్తులు మృత్యువాత పడటాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కుటుంబానికి చేదోడుగా
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నలుగురు మహిళలు నిరుపేద కుటుంబానికి చెందిన వారే. కుటుంబాలను నెట్టుకొచ్చేందుకు భర్తలకు ఆర్థికంగా చేదోడుగా ఉండేందుకు పచ్చళ్ల పరిశ్రమలో పనిచేస్తున్నారు. డాకోజీ నాగలక్ష్మి భర్త రమేష్ గ్రామంలో సెలూనషా్‌ప నిర్వహిస్తుండగా, అతడికి చేదోడుగా ఉండటానికి ఆమె పరిశ్రమకు వెళ్తుంది. వీరికి ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. వీరంతా పదేళ్లలోపు చిన్నారులే. సిలువేరు ధనలక్ష్మి భర్త భిక్షపతి బోర్‌వెల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. దేవరపల్లి శిరీష భర్త శేఖర్‌రెడ్డి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడాది క్యాన్సర్‌తో కుమార్తె మృతి చెందింది. కుమారుడు ఉన్నారు. అనసూయకు ముగ్గురు కుమారులు, కుమారుడు ఉన్నారు. అందరి పెళ్లిలు అయ్యాయి. భర్త రాంరెడ్డి వ్యవసాయం చేస్తున్నాడు.
శిరీష మృతదేహంతో కంపెనీ ఎదుట ఆందోళన
బ్రెయిన డెడ్‌తో మృతి చెందిన శిరీష మృతదేహంతో కం పెనీ ఎదుట బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిని శిరీష మృతదేహాన్ని నేరుగా కంపెనీ వద్దకు తీసుకువస్తుండగా పోలీసులు ఇండసీ్ట్రయల్ పార్క్ ఎదుట బారీకేడ్లను ఏర్పాటుచేశారు. పెద్దసంఖ్యలో వచ్చిన గ్రామస్థులు వాటిని తోసుకుని వెళ్లి కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి మొదలైన ఆందోళన రాత్రి ఎనిమిది గంటల వరకూ కొనసాగింది. గ్రామస్తుల ఆందోళనకు టీపీసీసీ కార్యదర్శి చల్లమల్ల కృష్ణారెడ్డి మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం
ఆందోళన చేస్తున్న మృతుల కుటుంబాల తరుపున ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కంపెనీ యజమాన్యంతో చర్చించారు. కంపెనీ తరుపున నాలుగు కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు అంగీకరింపజేయించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన విరమించారు. సుమారు ఆరు గంటల పాటు ఆందోళన కొనసాగింది. అదేవిధంగా మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో పాటు టీపీసీసీ కార్యదర్శి చల్లమల్ల కృష్ణారెడ్డి ఆర్థికసాయం ప్రకటించారు. కాగా పోస్టు మార్టం ఆలస్యంకావడంతో శుక్రవారం మృతులకు స్వగ్రా మంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు.