ORR Lease : వివరాలు ఇవ్వరు.. మాట్లాడొద్దంటారు!
ABN, First Publish Date - 2023-07-27T01:20:14+05:30
నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్) లీజు వ్యవహారంపై వివరాలు ఇవ్వాలని తాము ఆర్టీఐ దరఖాస్తు చేస్తే అధికారులు సరిగా స్పందించడం లేదని, ఆ వివరాలు ఇచ్చేలా వారికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
ఓఆర్‌ఆర్ లీజుపై ఆర్టీఐ దరఖాస్తు చేస్తే సమాచారం ఇవ్వడం లేదు
పైగా, నేను మాట్లాడకూడదంటూ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు
30 ఏళ్ల లీజు.. నిబంధనలకు విరుద్ధం
హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్
సహాయక చర్యల్లో సర్కార్ విఫలం
ప్రజల ఇబ్బందులపై సమీక్షలు చేయరా?
రేపు జీహెచ్‌ఎంసీ ఆఫీసు ముట్టడి: రేవంత్
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్) లీజు వ్యవహారంపై వివరాలు ఇవ్వాలని తాము ఆర్టీఐ దరఖాస్తు చేస్తే అధికారులు సరిగా స్పందించడం లేదని, ఆ వివరాలు ఇచ్చేలా వారికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండీని ప్రతివాదులుగా చేర్చారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిబంధనల ప్రకారం లీజు కాలం 20 ఏళ్లకు మించకూడదని.. ఓఆర్‌ఆర్‌ను మాత్రం ప్రభుత్వం టోల్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (టీవోటీ) ప్రాతిపదికన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కు 30 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా రాయితీ విలువ (మూల ధర) ఎంత అనేది వెల్లడించకుండా రూ.7,380 కోట్లకే లీజు ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఒప్పందానికి సంబంధించిన మూల ధర అంచనా, ఆర్థిక విశ్లేషణ, ఫీజిబిలిటీ రిపోర్ట్, ఖర్చుల అంచనా వంటి సేవలకు గతంలో క్రిసిల్ వంటి ప్రముఖ సంస్థను ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ నియమించుకున్నాయని.. క్రిసిల్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ.. మళ్లీ అదే సేవల కోసం మజార్స్ అడ్వైజరీ అనే సంస్థను నియమించుకున్నాయని తెలిపారు. మజార్స్ అడ్వైజరీ సంస్థ కేవలంఒక్క నెలలోనే నివేదిక సమర్పించిందని.. ఆ నివేదికను పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదని పేర్కొన్నారు. మొత్తం బిడ్డింగ్ ప్రక్రియ సమాచారం ఇవ్వాలని.. మే 1న తాను ఆర్టీఐ కింద దరఖాస్తు చేశానని.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు సచివాలయానికి వెళ్లగా పోలీసులు తనను అడ్డుకున్నారని తెలిపారు. మే 23న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీ నుంచి సమాధానం వచ్చిందని.. అందులో తాను అడిగిన వివరాలు కాకుండా ఒప్పందం చెల్లింపుల గురించి సమాచారం ఇచ్చారని, మిగతా సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. లావాదేవీల అడ్వైజర్స్ నివేదిక, మంత్రివర్గ నిర్ణయం, గత ఆర్థిక సంవత్సరాల్లో ఓఆర్‌ఆర్‌కు లభించిన ఆదాయం వివరాలు కోరుతూ జూన్ 14న మళ్లీ ఆర్టీఐ దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఒప్పందం పారదర్శకంగా జరిగిందా? లేదా? అనే అంశానికి సంబంధించి ఇది కీలక సమాచారమని.. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఈ సమాచారం తెలియాల్సిన అవసరం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు.
పరువునష్టం పేరుతో నోరు నొక్కారు!
ఓవైపు తాను దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తు పెండింగ్‌లో ఉండగానే.. మరోవైపు, తాను పరువునష్టం కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్నానని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో హెచ్‌ఎండీఏ కేసు దాఖలు చేసిందని.. ఈ వ్యవహారంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఎక్స్‌పార్టీ గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారని రేవంత్ పేర్కొన్నారు. తన ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇవ్వకుండా, తన స్వేచ్ఛను హరించేలా గ్యాగ్ ఆర్డర్ తెచ్చారని ఆరోపించారు. తాను రెండోసారి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తు గడువు 30 రోజులు పూర్తయినా సమాచారం రాలేదని.. రాష్ట్ర సమాచార కమిషన్‌లో చీఫ్ కమిషనర్, కమిషనర్ పదవులు ఖాళీగా ఉండటంతో మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయిస్తున్నానని పేర్కొన్నారు. ఆర్టీఐ దరఖాస్తుకు సమాచారం ఇవ్వకపోవడం అక్రమమని ప్రకటించడంతోపాటు, ఓఆర్‌ఆర్ లీజుకు సంబంధించి జూన్ 14న తాను కోరిన పూర్తి సమాచారం ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఈ పిటిషన్ త్వరలో హైకోర్టు ఎదుట విచారణకు రానున్నది.
Updated Date - 2023-07-27T01:20:14+05:30 IST