Sharmila: బీఆర్ఎస్ దొంగలకే మళ్లీ తాళాలు కట్టబెట్టారంటూ కేసీఆర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-25T15:58:27+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) విమర్శలు గుప్పించారు.

Sharmila: బీఆర్ఎస్ దొంగలకే మళ్లీ తాళాలు కట్టబెట్టారంటూ కేసీఆర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) విమర్శలు గుప్పించారు. దళితబంధు పథకానికి ఎమ్మెల్యేలే రాబందులన్న కేసీఆర్‌..బీఆర్ఎస్ దొంగలకే మళ్లీ తాళాలు కట్టబెట్టారని షర్మిల మండిపడ్డారు. అర్హుల ఎంపిక బాధ్యత బీఆర్ఎస్ (BRS) బందిపొట్లకే మరోసారి ఇచ్చారని ఆరోపించారు. దళితబంధును 'కమీషన్లబంధు' అని చెప్పకనే చెప్పారని, దళితబంధు కమీషన్ల వ్యవహారం బయటపెడితే.. దొర అవినీతిపై ఎమ్మెల్యేలే తిరగబడతారని కేసీఆర్‌కు భయమని షర్మిల అన్నారు. గ్రామంలో కలెక్టర్ ఆధ్వర్యంలో అర్హుల ఎంపిక జరగాలని షర్మిల డిమాండ్ చేశారు.

కాగా.. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ ద్రోహి అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరుల కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, అమరుల ఆశయాలు గోదావరి పాలైతే.. స్వరాష్ట్ర సంపదంతా కేసీఆర్ పాలవుతోందని షర్మిల ఆరోపించారు. ఓటమి భయంతోనే అమరులపై కేసీఆర్‌ ప్రేమగా నటిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఏడాదిలోనే ప్రగతిభవన్ కోటలు కట్టుకున్న దొరకు.. అమరుల స్తూపం నిర్మించడానికి 9 ఏళ్లు పట్టిందా? అని షర్మిల ప్రశ్నించారు.

అమరుల ప్రాణత్యాగం వెలకట్టలేనిది అంటూ కుండపోతగా ప్రేమను కురిపించే పన్నాగం పన్నుతున్నాడని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 15 వందల మంది ప్రాణాలు కోల్పోతే.. వారి పేర్లు కూడా తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కారు ఇది అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు, ఉద్యోగం, భూమి ఇస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు. అమరుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖిస్తానని చెప్పి.. కుటుంబాన్ని బంగారం చేసుకున్నడే తప్ప వారి పేర్లు ఎక్కడా చెక్కలేదన్నారు.

Updated Date - 2023-06-25T16:01:01+05:30 IST