జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ పల్లెలు

ABN , First Publish Date - 2023-04-08T02:46:00+05:30 IST

జాతీయ పంచాయతీరాజ్‌ అవార్డులు దక్కించుకొని తెలంగాణ పల్లెలు మరోసారి దేశంలోనే అగ్రగామిగా నిలిచాయి.

జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ పల్లెలు

8 గ్రామ పంచాయతీలకు అవార్డులు

మరో 5 కేటగిరీల్లోనూ పురస్కారాలు

హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌

జాతీయ పంచాయతీరాజ్‌ అవార్డులు దక్కించుకొని తెలంగాణ పల్లెలు మరోసారి దేశంలోనే అగ్రగామిగా నిలిచాయి. కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ 8 విభాగాల్లో ప్రకటించిన 27 దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌-2023 పురస్కారాల్లో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు 8 అవార్డులు దక్కించుకున్నాయి. ఇందులో నాలుగు పంచాయతీలు దేశంలోనే మొదటి, రెండో స్థానాలు దక్కించుకోవడం విశేషం. అదేవిధంగా మరో 5 కేటగిరీల్లోనూ మన రాష్ట్రానికి కేంద్రం అవార్డులను ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక సలహాదారు బిజయ కుమార్‌ బెహ్రా ఓ లేఖ ద్వారా వివరాలను వెల్లడించారు. ఈ అవార్డులను ఈ నెల 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. 8 కేటగిరీల్లో అవార్డులు దక్కించుకున్న పంచాయతీలు ఇవే.. ఆరోగ్య పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్‌ మొదటి స్థానం, జలసమృద్ధ పంచాయతీ విభాగంలో జనగామ జిల్లా లింగాల ఘనపూర్‌ మండలం నెల్లుట్లకు మొదటి స్థానం, సామాజిక భద్రత పంచాయతీగా మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం కొనగట్టు పల్లికి మొదటి స్థానం, మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఏపూరు మొదటిస్థానంలో నిలిచాయి. ఈ గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జి. జగదీష్‌ రెడ్డి దత్తత తీసుకున్నారు. ఈ పంచాయతీకి అవార్డుతోపాటు రూ. 50 లక్షలు నగదు అందజేస్తారు. పేదరిక రహిత, జీవనోపాధి మెరుగు పంచాయతీ విభాగం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్‌దొడ్డికి రెండో స్థానం, సుపరిపాలన పంచాయతీ విభాగంలో వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం చీమల్దరి గ్రామానికి రెండో స్థానం దక్కింది. పరిశుభ్ర పంచాయతీగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ మూడోస్థానం, మౌలిక సదుపాయాల్లో స్వయంసమృద్ధిగల పంచాయతీగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్‌ మూడోస్థానం దక్కించుకున్నాయి. తెలంగాణలోనే తొలి కేజీ టు పీజీ విద్యాసంస్థల సముదాయం ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం.

అదేవిధంగా కేంద్రం ప్రకటించిన మరో అయిదు నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌-2023 పురస్కారాల కేటగిరీల్లో.. ఉత్తమ బ్లాక్‌(మండల) పంచాయతీ అవార్డు కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌కు, ఉత్తమ జిల్లా పరిషత్‌ విభాగంలో ములుగు జిల్లాకు, స్పెషల్‌ కేటగిరీ అవార్డుల్లో గ్రామ ఊర్జా స్వరాజ్‌ విశేష్‌ పంచాయత్‌ పురస్కార్‌ విభాగంలో ఆదిలాబాద్‌ జిల్లా ముఖరా కె. గ్రామానికి, కార్బన్‌ న్యూట్రల్‌ విశేష్‌ పంచాయతీ పురస్కార్‌ విభాగంలో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం, నాన్‌ ఫైనాన్షియల్‌ ఇన్సెంటివ్‌ సర్టిఫికెట్ల విభాగంలో గ్రామ ఊర్జా స్వరాజ్‌ విశేష్‌ పంచాయత్‌ పురస్కార్‌కు సిద్దిపేట జిల్లా మార్కూక్‌ ఎర్రవెల్లి ఎంపికైంది. ములుగు జిల్లాలోని పంచాయతీల్లో ఉపాధి హామీ, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, స్వచ్ఛభారత్‌ తదితర 9 విభాగాల్లో సాధించిన ప్రగతికి ఆ జిల్లాకు అవార్డు ఇచ్చారు. అవార్డు కింద రూ. 3 కోట్ల ప్రోత్సాహక నిధులను కేంద్రం జిల్లాకు ఇవ్వనుంది. రాష్ట్రంలో 8 పంచాయతీలకు అవార్డులు దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

పల్లెప్రగతితో రూపురేఖలు మారాయి : కేటీఆర్‌

జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం ఉత్తమంగా నిలిచి మరోసారి మెరిసిందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఉత్తమ గ్రామ పంచాయతీలు, 100 శాతం ఓడీఎ్‌ఫలోనూ తెలంగాణ పల్లెలు నంబర్‌ వన్‌గా నిలిచాయని పేర్కొన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ విజన్‌ వల్లే సాధ్యమైందని, పల్లె ప్రగతి కార్యక్రమం వల్లనే గ్రామాల రూపు రేఖలు మారాయన్నారు.

హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీ్‌షరావు

గ్రామ పంచాయతీలకు కేంద్రం ప్రకటించిన 27 అవార్డుల్లో రాష్ట్రానికి 8 దక్కడం విశేషమని.. అవి కూడా అగ్రస్థానంలో నిలవడం గ్రామీణావృద్ధిపై సీఎం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీ్‌షరావు పేర్కొన్నారు. ఈమేరకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.

కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్‌ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం వల్లనే జాతీయ స్థాయిలో 13 అవార్డులు దక్కాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పురస్కారాలకు ఎంపికైన ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, గ్రామస్థాయి ఉద్యోగులను అభినందించారు.

Updated Date - 2023-04-08T02:46:00+05:30 IST