హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
ABN , First Publish Date - 2023-03-05T23:39:39+05:30 IST
డాక్టర్ ప్రీతి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ప్రజా సంఘాల నాయకులతో కలిసి హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తాం..
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
కాళోజీ జంక్షన్, మార్చి 5 : డాక్టర్ ప్రీతి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ప్రజా సంఘాల నాయకులతో కలిసి హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రీతి మృతిపై ఆమె తల్లిదండ్రులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రీతి తన తల్లితో సెల్ ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలను వింటే ఆమెకు ర్యాగింగ్, వేధింపులను ఎదుర్కొనే సత్తా, ధైర్యం ఉందని విధితమవుతోందని అన్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అన్నారు. తనకు తాను మత్తు ఇంజక్షన్ తీసుకుంటే అది ఆత్మహత్యే అవుతుందని, ఇతరులు బలవంతంగా ఎక్కిస్తే హత్య అవుతుందని ఆయన వివరించారు. ఆమెది ఆత్మహత్య అని ఎలా నిర్ధారించారని, ఇంజక్షన్ సిరంజిపై వేలిముద్రలు ఎవరివి ఉన్నాయనేది సాంకేతికంగా పరిశీలించకుండా ఆత్మహత్యగా ఎలా నిర్ధారించారని మంద కృష్ణ ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడి వల్ల ఆత్మహత్య కేసు నమోదు చేశారని నిలదీశారు.
ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యంత కీలకమైన వార్డులో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఏంటని అనుమానం వ్యక్తం చేశారు. స్వతంత్ర న్యాయ విచారణ జరిపితే ఏ జరిగింది? ఎవరి వల్ల జరిగిందనేది తేలుతుందన్నారు. హైకోర్టు జడ్జితో విచారణకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని, హత్య కేసు నమోదు చేయడానికి అభ్యంతరం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం దోషులను కాపాడుతోందని ఆరోపించారు. సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని ప్రీతి ఫిర్యాదు చేసినప్పుడు కేఎంసీ ప్రిన్సిపాల్, హెచ్‌వోడీలు ఎందుకు తగు చర్యలు చేపట్టలేదని అన్నారు. అప్పుడే చర్య తీసుకుంటే ప్రీతి మృతి చెందేది కాదుకదా అని అన్నారు. ఏ తప్పు చేయకుంటే హెచ్‌వోడీని ఎందుకు బదిలీ చేశారని, అది కంటి తుడుపు చర్య మాత్రమేనని అన్నారు.
ర్యాగింగ్ జరిగిందని స్వయంగా పోలీసు కమిషనరే నిర్ధారించారు కదా అని మంద కృష్ణ అన్నారు. ప్రీతి మృతికి కేఎంసీ ప్రిన్సిపాల్, హెచ్‌వోడీ, ఎంజీఎం సూపరింటెండెంట్ బాధ్యులవుతారని, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా టి ్వట్టర్‌లో స్పందించే మంత్రి కేటీఆర్.. గిరిజన బిడ్డ విషయంలో ఎందుకు స్పందించడం లేదని అన్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అన్ని ప్రజా, సామాజిక సంఘాలతో కలిసి ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై గవర్నర్, హోం మినిస్టర్, డీజీపీ, మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌కు విన్నవించుకుంటామని మంద కృష్ణ వివరించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుండగా తాము అంతటా నిరసన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తీగల ప్రదీ్‌పగౌడ్, మంద కుమార్ మాదిగ, జాటోత్ కిషన్‌నాయక్, కొమ్ముల బాబు, నెహ్రూ చంద్‌నాయక్, సమ్మయ్య రాథోడ్, జన్ను భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.