కల సాకారం అయ్యేనా..!?
ABN , First Publish Date - 2023-03-12T00:01:38+05:30 IST
రాష్ట్రప్రభుత్వం ప్రారంభిం చిన పథకాల లక్ష్యం నీరుగారుతోంది. ఆర్థికంగా వెనుకబడిన గిరిజన డ్రైవర్లకు యాజమాన్య (ఓనర్) హక్కు లభించేలా చేయూతనందించడానికి ప్రవేశపెట్టిన ట్రైకార్‌లో ‘డ్రైవర్ కం.. ఓనర్’ పథకం ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు.
ఆర్థికంగా వెనుకబడిన గిరిజన డ్రైవర్లను ఓనర్లుగా మార్చేదెన్నడో..!
జిల్లాలో మూలుగుతున్న 8,560 మంది దరఖాస్తులు
ట్రైకార్ పథకానికి అప్లై చేసుకుని నాలుగేళ్లు..
పట్టించుకోని సంబంధిత జిల్లా అధికారులు
నెహ్రూసెంటర్, మార్చి 11 : రాష్ట్రప్రభుత్వం ప్రారంభిం చిన పథకాల లక్ష్యం నీరుగారుతోంది. ఆర్థికంగా వెనుకబడిన గిరిజన డ్రైవర్లకు యాజమాన్య (ఓనర్) హక్కు లభించేలా చేయూతనందించడానికి ప్రవేశపెట్టిన ట్రైకార్‌లో ‘డ్రైవర్ కం.. ఓనర్’ పథకం ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. వృత్తినే నమ్ముకుని జీవిస్తూ వారిని ఆదుకోవాలనే సంకల్పంతో ఆరంభించిన సర్కారు నాలు గేళ్లుగా ముందుకు సాగడం లేదు. అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల్లో నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి కొనసాగుతోందని ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో ట్రైకార్ ద్వారా గిరిజన కార్ డ్రైవర్లకు డ్రైవర్ కం.. ఓనరు పథకం కింద 2019–20 ఆర్థిక సంవత్సరంలో వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న డ్రైవర్లు.. ఓనర్లు కావాలని ఆశతో 8,560 మంది దరఖాస్తులు చేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు అంటే నాలుగేళ్లుగా ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాసేలా కార్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయినా వారికలలు ఇప్పట్లో సాకారమయ్యేలా కన్పించ డం లేదు. చేసిన దరఖాస్తులు మూలన మూలుగుతున్నా యే తప్ప! వాటిపై స్పందన రావడం లేదు. దరఖాస్తుదారులు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయానికి పలుమార్లు కాళ్లు అరిగెలా తిరిగినా మంజూరు విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు.
ముందుకు పడని లబ్ధిదారుల ఎంపిక..
2019–20 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజన డ్రైవర్లను ఓనర్లు చేసేందుకు ట్రైకార్ ద్వారా డ్రైవర్ కం.. ఓనర్ పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లాలోని అర్హులైన గిరిజన కారు డ్రైవర్లు భారీగానే దరఖాస్తులు చేసుకున్నారు. సదరు ఫైలు మాత్రం ఏ కార ణం చేతనో కానీ ముందుకు కదలడం లేదు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కార్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. వృత్తినే నమ్ముకుని కార్లను అద్దెకు తీసుకుని ట్రావెల్స్ రూపంలో నడిపి వచ్చిన పైకంలో యాజమానికి కట్టడానికే కష్టమైన పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. ఇక ఇంటికి ఏం తీసుకువెళ్లి కుటుంబాలను పోషించుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ పథకం ఉందా..! లేదా? అనే విషయంలో అధికారులు ఏమి చెప్పకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవర్లు ఓనర్లు.. కానట్టేనా..!
ఎన్నో ఆశలతో డ్రైవర్లు ఓనర్లు కావాలని ప్రభుత్వం అందించే చేయూతను అందిపుచ్చుకోవాలని కోటి ఆశలతో ఎదురుచూసిన గిరిజన డ్రైవర్ల కల ఇప్పట్లో నేరవేరేటట్టు లేదు. ఈ పథకానికి 2017–18లో కొంతమంది గిరిజన డ్రైవర్లు దరఖాస్తు చేసుకున్నప్పటికి నామమాత్రంగానే లబ్ధిదారుల ఎంపిక చేపట్టి వారికి కార్లను అందించారు. ఇక 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి 8,560 మంది అప్లికేషన్‌లు మాత్రం మూల కు మూలుగుతున్నాయి. ఇప్పటికి దరఖాస్తులు చేసి నాలుగేళ్లు గడిచిన కనీసం లబ్ధిదారుల ఎంపిక చేపట్టకపోవడం పలు విమర్శలు దారితీస్తోం ది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గిరిజన సంక్షేమశాఖలో ట్రైకార్‌లో డ్రైవర్ కం.. ఓనర్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిని పారదర్శకంగా ఎంపిక చేసి సబ్సిడీపై కార్లను అందించి వారిని ఆర్థికాభివృద్ధికి చేయూతనందించి వారికల సాకారం చేయాలని కోరుతున్నారు. కోసమెరుపేమంటే సంబంధిత శాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తే ఈ పథకానికి ఏ సంవత్సరంలో ఎన్నిదరఖాస్తులు వచ్చాయనే విషయం చెప్పడానికి కూడా నిరాకరిస్తున్నారు.
డ్రైవర్ వృత్తినే నమ్ముకున్నా..
మాలోతు వెంకన్న,తట్టుపల్లి, చంధ్యాతండా, కురవి
జీవితంలో స్థిరపడాలని.. డ్రైవర్ వృత్తినే నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటు న్నా. ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో సొంతంగా కారు కొనలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ద్వారానైనా ట్రైకార్‌లో సబ్సిడీ ద్వారా కారు లభిస్తుందని నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇప్పటికి డ్రైవర్‌గానే ఉన్నాను.. ఇకనైనా అధికారులు స్పందించి ట్రైకార్ ద్వారా కారు అందించాలి.
నాలుగేళ్లుగా ఎదురుచూపు..
– తేజావత్ ప్రమోద్, కంచెర్లగూడెం, కురవి మండలం
ప్రభుత్వం గిరిజన నిరుద్యోగ డ్రైవర్లకు ట్రైకార్ ద్వారా అందిస్తున్న కారు వస్తుందేమోనని నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నా. పలుమార్లు గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంకు వెళ్లి ఎంపికలు ఎంత వరకు వచ్చాయని అధికారులను అడిగినప్పటికి వారు సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నారు. త్వరలోనే ట్రైకార్ ద్వారా కారును అందించాలి.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు
– ఎర్రయ్య, జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్, మహబూబాబాద్
ప్రభుత్వం నిరుద్యోగ గిరిజన డ్రైవర్లకు ట్రైకార్ ద్వారా డ్రైవర్ కం.. ఓనర్ పథకంలో భాగంగా దరఖాస్తుదారులను ఎంపిక చేయడానికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాం టి ఆదేశాలు రాలేదు. సర్కారు నుంచి ఆదేశాలు రాగానే 2019లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి, ఎంపిక చేస్తాం. అప్పటి వరకు దరఖాస్తుదారులు ఓపికపట్టాలి.