Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:46 PM
సత్యసాయి జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కస్టమర్లను ఓ గోల్డ్ లోన్ సంస్థ భారీగా మోసం చేసింది. మోసపోయిన బాధితులు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
సత్యసాయి జిల్లా: ఏదైనా అవసరం వచ్చినపుడు ఆర్థికంగా పెద్ద రుణభారం పడకుండా ఉండేందుకు బ్యాంక్ రుణాలు సహకరిస్తాయి. చిన్నా పెద్ద మొత్తాల్లో ఆర్థికపరమైన భరోసాను బ్యాంకులు కల్పిస్తాయి. అయితే ఇందులో గోల్డ్ మీద ఇచ్చే గోల్డ్ లోన్ మంచిదా లేక వ్యక్తిగతంగా ఇస్తున్న రుణాలు మంచివా అనేది వాటి మొత్తాన్ని బట్టి ఉంటుంది. పెద్ద మొత్తంలో ఒకసారే పొదుపు చేయలేం కనుక చిన్నగా బ్యాంక్‌లలో పొదుపు చేస్తూ ఉంటాం. అదే ఒకేసారి పెద్ద మొత్తంలో రుణం కావాలంటే ఆస్తి తనఖా ద్వారా తీసుకుంటాం. అదే బంగారాన్ని కుదవ పెట్టి తెచ్చే రుణం ఆర్థిక అవసరాలకు సరిపోతే చాలనుకుంటాం. దీనికోసం తక్కువ వడ్డీ కలిగిన బ్యాంక్‌లనే ఆశ్రయిస్తాం. అయితే కస్టమర్లను గోల్డ్ లోన్స్ పేరిట కొన్ని సంస్థలు బురిడి కొట్టిస్తున్నాయి. దీంతో కస్టమర్లు భారీ స్థాయిలో మోసపోతున్నారు. సత్యసాయి జిల్లాలో ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మడకశిర పట్టణంలోని ఓగోల్డ్ లోన్ సంస్థలో చోటుచేసుకున్న గోల్‌మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సదరు సంస్థలో బంగారం తాకట్టుపెట్టి అప్పులు తీసుకున్న కస్టమర్లు భారీగా మోసపోయారు. కొంత మంది కస్టమర్లు బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. అసలు రుణం కంటే మూడురెట్లు ఎక్కువగా వడ్డీ తీసుకుంటున్నారని కస్టమర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎక్కువ వడ్డీలు వసూలు చేశారంటూ ఆందోళనకు దిగారు. దీంతో కస్టమర్లు గోల్డ్ లోన్ కార్యాలయానికి తాళం వేసి న్యాయం చేయాలని భైఠాయించారు. గోల్డ్ లోన్ ప్రతినిధులకు, కస్టమర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటికే భారీగా నగదు చెల్లించిన ఇంకా డబ్బులు కట్టాలని సదరు సంస్థ నిర్వాహకులు చెప్పడంతో కస్టమర్లకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. గోల్డ్ లోన్‌లో పెట్టేటప్పుడు ఒక రూల్ చెప్పి.. ఇప్పుడు మరో రూల్ పాస్ చేస్తున్నారని అన్నారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ.. గోల్డ్ తిరిగి ఇవ్వట్లేదని, గోల్డ్ లోన్ ప్రతినిధులు ఇబ్బందులు పెడుతున్నారంటూ కస్టమర్లు వాపోతున్నారు. పోలీసులు విచారణ చేసి.. తాకట్టులో ఉన్న తమ బంగారం విడిపించాలని కోరుతున్నారు. గతంలో ఇదే సంస్థలో పని చేసిన మేనేజర్ డబ్బులు గోల్ మాల్ చేసి, కస్టమర్లను ఇబ్బందులు పాలు చేసి పరారయ్యాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
బంగారంపై రుణాలు జాగ్రత్త
బంగారంపై రుణాలు తీసుకునే పరిస్థితిలో నిధులను ఏర్పాటు చేయడానికి.. ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగించబడతాయి, అవి చాలా అంశాల్లో విభిన్నంగా ఉంటాయి. మంచి సంస్థల్లో బంగారంపైన రుణం తీసుకోవడం ఉత్తమం.
గోల్డ్ లోన్
బంగారంపైన రుణం కోసం బంగారు ఆస్తులను తనఖా పెట్టి రుణం తీసుకోవాలి. దీనికోసం ముందుగా తనఖా పెట్టిన బంగారం విలువను అంచనా వేస్తారు. ఆ బంగారంపై రుణాన్ని అందిస్తారు. మంజూరు చేయబడిన బంగారు రుణం మొత్తం సాధారణంగా రుణగ్రహీత తాకట్టు పెట్టిన బంగారం విలువలో కొంత శాతంగా ఉంటుంది. అందిన రుణానికి నెలవారీ వాయిదాల రూపంలో రుణాన్ని కొద్ది కొద్దిగా తీరుస్తారు. చివరిగా రుణం తీరిన తర్వాత డిపాజిట్ చేసిన బంగారాన్ని రుణగ్రహీతకు తిరిగి ఇవ్వాలి కానీ కొన్ని గోల్డ్ లోన్ సంస్థలు కస్టమర్లను భారీగా మోసం చేస్తున్నాయి. గోల్డ్ లోన్ అర్హతకు షరతులు లేవు. తాకట్టుగా డిపాజిట్ చేసిన బంగారం, ఆస్తులు ఉంటే రుణం కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. అయినప్పటికీ రుణం కోసం ఉంచబోయే వాటి మీద పూర్తి తనిఖీ చేయాలి.
రుణ కాలపరిమితి
రుణాన్ని తిరిగి చెల్లించడానికి రుణదాత రుణగ్రహీతకు ఇచ్చే మొత్తం సమయాన్ని రుణ కాలవ్యవధి అంటారు. బంగారు రుణాలు 7 రోజుల నుంచి 3 సంవత్సరాల మధ్య తక్కువ రుణ చెల్లింపు వ్యవధిని కలిగి ఉంటాయి.
లాభాలు, నష్టాలు..
గోల్డ్ లోన్ పోలికలో ప్రతి ఒక్కరికీ లాభాలు, నష్టాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా ఇంటిలో గణనీయమైన బంగారు ఆస్తులు ఉంటే త్వరలో రుణాన్ని తిరిగి చెల్లిస్తారనే నమ్మకంతో ఉన్నట్లయితే బంగారు రుణాన్ని తీసుకోవడం ఉత్తమ ఎంపిక.
Updated Date - Nov 16 , 2024 | 12:54 PM