Share News

FARMERS: ఐదేళ్లు.. అన్యాయమైపోయాం..

ABN , Publish Date - Jun 16 , 2024 | 12:07 AM

వర్షాభావం, అకాల వర్షాలతో పంట నష్టపోయిన కరువు రైతులను ఆదుకోవడంలో వైసీపీ పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. గత ఐదేళ్లల్లో పంటనష్టం జరిగిన సమయాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు కనీసం పొలాలకు వెళ్లి పంటను పరిశీలించి, రైతులకు భరోసానిచ్చిన దాఖలాలు లేవనే చెప్పాలి. జిల్లాలోని కొందరు రైతులకు అరకొరగా పంట నష్టపరిహారం అందించి చేతులు దులుపుకున్నారు. టీడీపీ హయాంలో పంటనష్టపోయిన ప్రతి రైతుకు ఇనపుట్‌ సబ్సిడీ అందించి ఆదుకున్నారు. గతంలో టీడీపీ హయాంలో జిల్లా రైతాంగానికి రూ.1628 కోట్లు ...

FARMERS: ఐదేళ్లు.. అన్యాయమైపోయాం..

వైసీపీ పాలనపై రైతుల పెదవి విరుపు

పంట నష్టపోయినా ఆదుకోలేదని ఆవేదన

టీడీపీ హయాంలో రూ.1628 కోట్ల ఇనపుట్‌ సబ్సిడీ

వైసీపీ పాలనలో రూ.233.74 కోట్లతో సరి

ఇక అంతా మంచే జరుగుతుందని రైతుల విశ్వాసం

అనంతపురం అర్బన/అనంతపురం రూరల్‌, జూన 15: వర్షాభావం, అకాల వర్షాలతో పంట నష్టపోయిన కరువు రైతులను ఆదుకోవడంలో వైసీపీ పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. గత ఐదేళ్లల్లో పంటనష్టం జరిగిన సమయాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు కనీసం పొలాలకు వెళ్లి పంటను పరిశీలించి, రైతులకు భరోసానిచ్చిన దాఖలాలు లేవనే చెప్పాలి. జిల్లాలోని కొందరు రైతులకు అరకొరగా పంట నష్టపరిహారం అందించి చేతులు దులుపుకున్నారు. టీడీపీ హయాంలో పంటనష్టపోయిన ప్రతి రైతుకు ఇనపుట్‌ సబ్సిడీ అందించి ఆదుకున్నారు. గతంలో టీడీపీ హయాంలో జిల్లా రైతాంగానికి రూ.1628 కోట్లు ఇనపుట్‌ సబ్సిడీని మంజూరు చేశారు. వైసీపీ పాలనలో ఉమ్మడి జిల్లాలో రూ.234.74 కోట్ల ఇనపుట్‌ సబ్సిడీతోనే సరిపెట్టారు. దీన్ని బట్టే పంటనష్టపోయి రైతులను ఆదుకోవడంలో జగన విఫలమయ్యారని అర్థమవుతోంది. ఖరీఫ్‌, రబీ


సీజన్లల్లో పంటనష్టపోయిన రైతుల తరఫున ఇన్సూరెన్స కంపెనీకి ప్రీమియం డబ్బులు చెల్లించి ఉచితంగా పంటల బీమా అందించడంలోనూ నిర్లక్ష్యం వహించారు. తద్వారా జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. టీడీపీ అధికారంలోకి రాగానే కరువు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, కరువు రైతులను రాజును చేసే బాధ్యత తమదని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది ఒక్కో రైతుకు రూ.20వేలు ఆర్థిక సాయం అందించడంతోపాటు పంట నష్టపోయిన రైతులందరికీ పంటనష్టపరిహారం, ఇన్సూరెన్స అందించి ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో రైతులకు మంచి రోజులు రానున్నాయని ఆ వర్గాలు భావిస్తున్నాయి.

బటన నొక్కిన ప్రతిసారీ ఆలస్యంగానే జమ

జగన బటన నొక్కిన ప్రతిసారి ఆలస్యంగానే అరకొరగా అందించే పరిహారం జమ చేస్తూ వచ్చారు. పంటనష్టం జరిగిన సీజన ముగిసిన వెంటనే ఇనపుట్‌ సబ్సిడీ అందించి ఆదుకుంటామని వైసీపీ పాలకులు చెప్పుకున్నారు. కానీ, పంటనష్టపరిహారం అందించడంలో ప్రతి ఏడాది ప్రభుత్వం జాప్యం చేసింది. 2023-24 సంవత్సరం ఖరీఫ్‌ పంట నష్టపరిహారాన్ని విడుదల చేయడంలోనూ తీవ్ర జాప్యం చేశారు. తీరా ఎన్నికల కోడ్‌కు ముందు ఈ ఏడాది మార్చి 6న 2023-24 ఖరీఫ్‌ సీజనలో జిల్లాలోని 28 మండలాల్లో 1.69 లక్షల మంది రైతులకు


సంబంధించి 1.79 లక్షల హెక్టార్లల్లో నష్టానికి రూ.251.2 కోట్ల పంటనష్టపరిహారాన్ని జగన బటన నొక్కి విడుదల చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులోగా పరిహారం జమచేస్తారని రైతులు ఆశించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఎన్నికల పోలింగ్‌ తర్వాత పరిహారం రైతుల ఖాతాలకు జమకావడం మొదలైంది. ఇప్పటి దాకా ఎంత మంది రైతులకు పరిహారం అందిందో..? తెలియని దుస్థితి నెలకొంది. జిల్లా వ్యవసాయ ఉన్నతాధికారులకు పరిహారం జమ వివరాలు తెలియకుండా మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం దోబూచులాడటం గమనార్హం.

ఒక్క రూపాయి కూడా రాలేదు

వైసీపీ పాలనలో ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదు. ప్రతి ఏడాది ఐదెకరాల్లో వేరుశనగ పంట సాగు చేస్తున్నా. వానలు సరిగా పడకపోవడంతో పంట చేతికి అందక నష్టపోతూ వచ్చా. పంటనష్టపరిహారం జాబితాలో నా పేరున్నా వైసీపీ నాయకుల ఒత్తిళ్లతో పరిహారం రాకుండా చేశారు. పంటనష్టపరిహారం పంపిణీలోనూ రాజకీయం చేయడం దుర్మార్గం. టీడీపీ అధికారంలోకి రావడంతో రైతుల కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నాం. కరువు రైతులను ఆదుకునేలా చంద్రబాబు చొరవ చూపుతారన్న నమ్మకం ఉంది.

- బ్యాళ్ల లక్ష్మీనారాయణ, రైతు, తాటిచెర్ల, అనంతపురం మండలం


వైసీపీ హయాంలో తీరని అన్యాయం

వైసీపీ పాలనలో కరువు జిల్లా రైతులకు తీరని అన్యాయం చేశారు. పంటనష్టపోయిన రైతులకు ఇనపుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడం దారుణం. ఐదేళ్లల్లో అరకొరగా ఇనపుట్‌ సబ్సిడీ అందించి చేతులుదులుపుకుంది. 2023-24 ఖరీఫ్‌ ఇనపుట్‌ సబ్సిడీని ఎన్నికల కోడ్‌ ముందు హడావుడిగా సీఎం జగన బటన నొక్కి విడుదల చేసినట్లు గొప్పలు చెప్పారు. ఇప్పటి దాకా ఎంత మంది రైతులకు పరిహారం జమఅయ్యిందో ఎవరికీ తెలియడం లేదు. టీడీపీ హయాంలోనైనా కరువు రైతులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

- తరిమెల నాగరాజు, జిల్లా అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం

ఐదేళ్లల్లో ఒక్కసారే పరిహారం

వైసీపీ పాలనలో కరువు రైతులకు ఒరిగిందేమి లేదు. నాకు 6.28 ఎకరాల పొలం ఉంది. ప్రతి ఏడాది ఖరీ్‌ఫలో వేరుశనగతోపాటు ఇతర రకాల పంటలు సాగు చేస్తున్నా. వర్షాలు సరిగా పడకపోవడంతో వరుసగా నష్టం వచ్చింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి మాత్రమే పంటనష్టపరిహారం పడింది. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు రోజు ఖాతాలో జమైంది.

- శ్రీనివాసులు, రైతు, చిన్నమట్లగొంది. శింగనమల మండలం


రైతును నట్టేటముంచాడు

కరువు రైతును జగన నట్టేట ముంచాడు. వైసీపీ పాలనలో జిల్లా రైతాంగానికి ఒరిగిందేమిలేదు. ప్రతి ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్లల్లో పంటనష్టపోయిన రైతులకు ఇనపుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స అందించి ఆదుకోవడంలో విఫలమయ్యాడు. రైతులను రాజును చేస్తామని ఆర్భాటంగా మాట్లాడటం తప్పా క్షేత్ర స్థాయిలో జగనరెడ్డి చేసింది శూన్యం. రైతుల తరఫున ప్రభుత్వమే ఇన్సూరెన్స ప్రిమీయం చెల్లించి ఉచితంగా పంటల బీమా అందజేస్తామని ప్రకటించడంతోనే సరిపెట్టారు. డబ్బులు కట్టకపోవడంతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు.

- మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి, రైతు సంఘం


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 16 , 2024 | 12:07 AM