Pandameru : ముంపు పాపం వైసీపీదే..!
ABN, Publish Date - Oct 24 , 2024 | 11:48 PM
నగర శివారులో వరద బీభత్సానికి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. వంకలు, వాగుల నిర్వాహణను ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ఉప్పరపల్లిలోని కాలనీల ముంపునకు ఇదే కారణమని బాధితులు అంటున్నారు. ఐదేళ్లలో పండమేరు వంకలో ఒక్కసారి కూడా జంగిల్ క్లియరెన్స చేపట్టలేదు.
ఐదేళ్లు పూడిక తీయించని ప్రభుత్వం
పండమేరులో భారీగా ముళ్ల పొదలు
వంక పొడవునా ఆక్రమణలు.. గుడిసెలు
చిన్నపాటి వర్షానికే కాలనీలలోకి నీరు
అనంతపురం రూరల్, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): నగర శివారులో వరద బీభత్సానికి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. వంకలు, వాగుల నిర్వాహణను ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ఉప్పరపల్లిలోని కాలనీల ముంపునకు ఇదే కారణమని బాధితులు అంటున్నారు. ఐదేళ్లలో పండమేరు వంకలో ఒక్కసారి కూడా జంగిల్ క్లియరెన్స చేపట్టలేదు. వంకలో ఎటు చూసినా ముళ్ల పొదలే కనిపిస్తున్నాయి. వంక పొడవునా మట్టి పేరుకుపోయింది. పూడిక చేరడంతో మోస్తరు వర్షం కురిసినా కాలనీలోకి నీరు
చేరుతోంది.
టీడీపీ హయాంలో..
టీడీపీ ప్రభుత్వం 2015-16లో అప్పటి స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో జంగిల్ క్లియరెన్స నిర్వహించింది. రాప్తాడు సమీపంలోని హైవే నుంచి ఉప్పరపల్లి వరకు ముళ్ల పొదలను తొలగించారు. ఆ తరువాత పనులు చేసిందే లేదు. వైసీపీ ప్రజాప్రతినిధులు ఆ వైపు తొగించిచూన పాపాన పోలేదు. వంక ప్రాంతంలో మట్టి తవ్వకాలతో నీరు సాఫీగా ముందుకు వెళ్లడంలేదు. ఫలితంగా జగనన్న కాలనీ, ఇందిరమ్మ కాలనీ, గురుదాస్ కాలనీ ముంపునకు గురవుతున్నాయి. రెండేళ్ల క్రితం వర్షాలకు జగనన్న కాలనీ, ఇందిరమ్మ కాలనీ నీట మునిగాయి. తాజాగా అదే పరిస్థితి ఏర్పడింది.
భారీగా ఆక్రమణలు
కాలనీల ముంపునకు ఆక్రమణలు మరో కారణం. వంక పొడవుగా ఆక్రమణలు కనిపిస్తున్నాయి. కుల సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలవారు పేదల ముసుగులో ఇష్టారాజ్యంగా వంకను ఆక్రమించారు. గుడిసెలు వేయించడంతో వంక కుచించుకుపోయింది. పండమేరులో ప్రవాహానికి ఇవన్నీ అడ్డంకిగా మారాయి. ఇప్పటికైనా వంకలో ఆక్రమణలు తొలగించాలని, పూడిక, ముళ్ల పొదలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
పూడిక తీయాలి..
పడమేరు వంకలో పూడిక తీస్తే కాలనీలోకి నీరు రాకుండా ఉంటుంది. ఎప్పుడు వర్షం కురిసినా కాలనీ మునుగుతోంది. కాలనీలో ఉంటున్నవాళ్లం సొంతంగా వంకను శుభ్రం చేసుకుంటున్నాం. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. వంక పొడవునా మట్టితీత పనులు చేపట్టాలి.
- బొమ్మన్న, జగనన్న కాలనీ
పట్టించుకోని వైసీపీ
పడమేరు వంకలో పూడిక తొలగిస్తే కాలనీల్లోకి వరద నీరు చేరదు. టీడీపీ హయాంలో వంకలో జంగిల్ క్లియరెన్స పనులు జరిగాయి. అప్పటి ప్రజాప్రతినిధులు పరిటాల సునీత, ప్రభాకర్ చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని పనులు చేయించారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారికూడా పనులు చేయించలేదు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గ్రామ సమీపంలోని వంక పొడవునా ఆక్రమణలు జరిగాయి. వైసీపీ నాయకులు అడ్డదిడ్డంగా ఆక్రమించి సొమ్ము చేసుకున్నారు. వాటిని తొలగించినా ప్రయోజనం ఉంటుంది.
- శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకుడు, ఉప్పరపల్లి
వరద నష్టం రూ.3.25 కోట్లు: కలెక్టర్
అనంతపురం టౌన, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): వరదలకు జిల్లా వ్యాప్తంగా రూ.3.25 కోట్ల నష్టం జరిగిందని కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. 17 మండలాల పరిధిలోని 42 గ్రామాలలో వరద ప్రభావం కనిపించిందని అన్నారు. వ్యవసాయశాఖ పరిధిలో 481 మంది రైతులకు సంబంధించి 456.92 హెక్టార్లలో రూ.2.66 కోట్ల పంట నష్టం జరిగిందని, 68.20 హెక్టార్లలో ఉద్యాన పంటలకు రూ73.19 లక్షల నష్టం జరిగిందని తెలిపారు. 40 ఇళ్లకు సంబంధించి రూ.4 లక్షలు, పశు నష్టం రూ.30 వేలు, గొర్రెలు, మేకల నష్టం రూ.10 లక్షలు జరిగినట్లు అంచనా వేశామని తెలిపారు. రూరల్ మండలంలో వరద గురించి తెల్లవారు జామున 3 గంటల సమయంలో స్థానికుల నుంచి సమాచారం రాగానే రెవెన్యూ, పోలీసు అధికారులను అప్రమత్తం చేశామని, 110 కుటుంబాలను కాపాడామని తెలిపారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1995 మందికి వసతి, భోజనం కల్పించామని తెలిపారు. 361 మందికి పైగా బాధితులకు నిత్యావసరాలు, బియ్యం అందజేశామని తెలిపారు. వాతావరణ శాఖతో ఎప్పటికపుడు మాట్లాడుతూ ప్రాణ నష్టం జరగకుండా చూశామని అన్నారు. ఈ నెల 26న ఇళ్ల ముంపు బాధితులకు పరిహారం ఇస్తామని తెలిపారు. పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి పంపించామని, పరిహారం వచ్చిన వెంటనే ఇస్తామని తెలిపారు.
ఆక్రమణలపై సర్వే
జిల్లాలో వాగులు, వంక స్థలాల ఆక్రమణలపై త్వరలో సర్వే నిర్వహించి.. తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. నడిమివంక, మరువ వంక పైభాగాన ఉపాధి పథకం కింద నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ వసంతబాబు, డీపీఎం ఆనంద్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ యోగీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 24 , 2024 | 11:48 PM