Share News

NAMINATED POSTS: నామినేటెడ్‌ న్యాయం!

ABN , Publish Date - Jul 19 , 2024 | 11:52 PM

టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నామినేటెడ్‌ పదవుల పంపకానికి అధినాయకత్వాలు సిద్ధమయ్యాయి. శ్రమ జీవులు, పోరాటాల వీరులకు న్యాయం జరిగే రోజులు వచ్చాయి. జాబితాల రూపలకల్పన ప్రక్రియ మొదలైంది. వైసీపీ హయాంలో ఎవరెవరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు..? పార్టీ కోసం ఎంతగా కష్టపడ్డారు..? ఎన్ని కేసులను భరిస్తున్నారు..? శ్రేణులకు ఏ స్థాయిలో ఉండగా నిలిచారు..? ఎలాంటి త్యాగాలు చేశారు..? ఈ ప్రశ్నలకు జవాబులే ప్రాతిపదికగా జాబితాలు తయారవుతున్నాయి. అందులో తమ పేరు ఉండాలని, కుర్చీ తమకే దక్కాలని ఆశావహులు ప్రయత్నాలను ప్రారంభించారు. ...

NAMINATED POSTS: నామినేటెడ్‌ న్యాయం!

పోరాటాల వీరులకు ప్రాధాన్యం

ఒక్కో నియోజకవర్గం నుంచి 20 పేర్లు

వేర్వేరుగా ఎంపీ, ఎమ్మెల్యే,

జిల్లా అధ్యక్షుడి జాబితాలు

యువనేత, మంత్రి లోకేశ

నిఘా బృందం మరో జాబితా

నాలుగింటి వడపోత

తరువాత.. నియామక ప్రక్రియ

ఆశావహుల్లో హుషారు.. ముమ్మరంగా ప్రయత్నాలు

టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నామినేటెడ్‌ పదవుల పంపకానికి అధినాయకత్వాలు సిద్ధమయ్యాయి. శ్రమ జీవులు, పోరాటాల వీరులకు న్యాయం జరిగే రోజులు వచ్చాయి. జాబితాల రూపలకల్పన ప్రక్రియ మొదలైంది. వైసీపీ హయాంలో ఎవరెవరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు..? పార్టీ కోసం ఎంతగా కష్టపడ్డారు..? ఎన్ని కేసులను భరిస్తున్నారు..? శ్రేణులకు ఏ స్థాయిలో ఉండగా నిలిచారు..? ఎలాంటి త్యాగాలు చేశారు..? ఈ ప్రశ్నలకు జవాబులే ప్రాతిపదికగా జాబితాలు తయారవుతున్నాయి. అందులో తమ పేరు ఉండాలని, కుర్చీ తమకే దక్కాలని ఆశావహులు ప్రయత్నాలను ప్రారంభించారు.

అనంతపురం, జూలై 19(ఆంధ్రజ్యోతి): నామినేటెడ్‌ పదవుల పంపకానికి కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నామినేటెడ్‌ పదవులు దక్కించుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మూడు పార్టీల అధినాయకత్వాల ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా నామినేటెడ్‌ పదవులకు అర్హులను ఎంపిక చేసే విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు ఆచితూచి అడుగు వేయాల్సి వస్తోంది. పార్టీ కోసం పనిచేసినవారికి, మరీ ముఖ్యంగా వైసీపీ పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచినవారికి, ఈ క్రమంలో ఆర్థికంగా, రాజకీయంగా, కేసులపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నవారికి పెద్దపీట వేయాలని మూడు పార్టీలు భావిస్తున్నాయి. ఆ దిశగా ఇప్పటికే స్పష్టమైన సంకేతాలను పంపినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో బాధిత వర్గాలను నామినేటెడ్‌ పదవులతో సంతృప్తిపరచాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.


వేర్వేరు జాబితాలు..

వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో అనేక రకాలుగా ఇబ్బందులు పడిన నాయకులకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని యువగళం సారథి నారా లోకేశ భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లాలో పాదయాత్ర చేసిన సమయంలో వైసీపీ దౌర్జన్యాలు, అరాచకాలకు బెదరకుండా పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపినవారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో యువనేత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడి ద్వారా నామినేటెడ్‌ పదవులకు వేర్వేరు జాబితాలు తయారు చేయించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ పని మొదలైనట్లు తెలిసింది. ఈ మూడు జాబితాలకు తోడు నారా లోకేశ నేతృత్వంలోని నిఘా బృందం ఇచ్చే జాబితా కీలకంగా మారే అవకాశం ఉంది. జాబితాల వడపోత తరువాత నామినేటెడ్‌ పోస్టుల పంపకాలు జరుగుతాయని తెలిసింది. ముందుగా రాష్ట్రస్థాయి చైర్మన పోస్టులు, తరువాత జిల్లాస్థాయి పోస్టులను భర్తీ చేస్తారని పార్టీ ముఖ్యుల ద్వారా తెలిసింది.

నియోజకవర్గానికి 20 పేర్లు..

నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసే క్రమంలో ఒక్కో నియోజకవర్గం నుంచి 20 మంది పేర్లను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆ బాధ్యతలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అధినాయకత్వం అప్పగించినట్లు తెలిసింది. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులతో పాటు.. వైసీపీ అరాచక పాలనలో అక్రమ కేసులతో ఇబ్బందిపడిన, ఆర్థికంగా నష్టపోయిన నాయకులను గుర్తించి.. జాబితా తయారు చేయాలని పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎమ్మెల్యేలు ఆచితూచి జాబితాను తయారు చేస్తున్నారని సమాచారం. ఎంపీలు సైతం అదే పనిలో ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి నుంచి ప్రత్యేకంగా జాబితాను తయారు చేయిస్తున్నారని తెలిసింది. మంత్రి నారా లోకేశ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిఘా బృందం కూడా జాబితాలను రూపొందిస్తోంది. పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న ముఖ్య నాయకులు, ఇదివరకు ఎలాంటి నామినేటెడ్‌ పదవులు దక్కని నాయకులు, వైసీపీ బాధితలుఉ, టీడీపీ అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్న నాయకులను పరిగణలోకి తీసుకుంటున్నారు. వైసీపీ పాలనలో పదుల సంఖ్యలో కేసులు నమోదైనా.. పచ్చజెండాను వీడని వారికి నామినేటెడ్‌ పదవులు ఇచ్చి న్యాయం చేయాలని నారా లోకేశ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆశీస్సుల కోసం..

వైసీపీ అరాచక పాలనలో ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి.. టీడీపీని అఽధికారంలోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేసిన నాయకులు తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. నామినేటెడ్‌ పదవులు ఆశించే నాయకులు ఎమ్మెల్యేల ఆశీస్సుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలోనూ కొందరు నేతల అభయ హస్తం కోసం ప్రయత్నిస్తున్నారు. పార్టీలోని వివిధ సామాజికవర్గాల ముఖ్య నాయకులను కొందరు ప్రసన్నం చేసుకుంటున్నారు. జిల్లాలో ముఖ్య నేతల ఆశీస్సులు అందకపోయినా.. కొందరు నేరుగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద కు, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, మంత్రి నారా లోకేశ వద్దకు నేరుగా వెళుతున్నారు. నామినేటెడ్‌ పదవుల కోసం బయోడేటాలను సమర్పిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా అహుడా, ఏడీసీసీ, ఏపీఐఐసీ, ఆగ్రోస్‌, ఆర్టీసీ రీజినల్‌ చైర్మన పదవులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన పదవుల కోసం పోటీ పడుతున్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయంలో సామాజికవర్గాల వారీగా సమన్యాయం చేయాలనే యోచనలో పార్టీ అధినాయకత్వం ఉంది. ఈ నేపథ్యంలో పదవులు ఎవరిని వరిస్తాయోనన్న చర్చ జరుగుతోంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 19 , 2024 | 11:52 PM