Chilli Farmer : విత్తును మింగిన వాన
ABN, Publish Date - Sep 11 , 2024 | 12:16 AM
మిర్చి పంటతో ఒక ఏడాది భారీగా నష్టపోయారు. ఆ భయంతో ఇంకొక్కసారి దాని జోలికి పోకూడదని అనుకున్నారు. కానీ ఈసారి కలిసొస్తుందేమో అనుకుని మళ్లీ అదే పంట వేశారు. వర్షాలు వెంటాడటంతో విత్తనం మొలకెత్తలేదు. ఒకటోసారి.. రెండోసారి ఇదే అనుభవం. తాజాగా మూడోసారి విత్తనం వేశారు. ఈ క్రమంలో రూ.లక్షలు నష్టపోయారు. గుంతకల్లు మండలం జి.కొట్టాల రైతులను వెంటాడుతున్న కష్టాలు ఇవి. పక్షం రోజులు తెరిపి ...
భారీగా నష్టపోయిన మిర్చి రైతులు
రెండుసార్లు దున్నేసి.. మూడోసారి విత్తనం
తెరిపి ఇవ్వకుంటే ఇదీ కష్టమే అంటున్న రైతు
గత ఏడాది వెంటాడిన తెగుళ్లు.. ధరాఘాతం
గుంతకల్లు, సెప్టెంబరు 10: మిర్చి పంటతో ఒక ఏడాది భారీగా నష్టపోయారు. ఆ భయంతో ఇంకొక్కసారి దాని జోలికి పోకూడదని అనుకున్నారు. కానీ ఈసారి కలిసొస్తుందేమో అనుకుని మళ్లీ అదే పంట వేశారు. వర్షాలు వెంటాడటంతో విత్తనం మొలకెత్తలేదు. ఒకటోసారి.. రెండోసారి ఇదే అనుభవం. తాజాగా మూడోసారి విత్తనం వేశారు. ఈ క్రమంలో రూ.లక్షలు నష్టపోయారు. గుంతకల్లు మండలం జి.కొట్టాల రైతులను వెంటాడుతున్న కష్టాలు ఇవి. పక్షం రోజులు తెరిపి ఇస్తే.. మూడోసారైనా మొలకలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. నల్లి పోటు కారణంగా గత ఏడాది మిర్చి రైతులు భారీగా నష్టపోయారు. పురుగు మందులు పనిచేయక దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. ఇది చాలదన్నట్లు ధరలు సగానికి సగం పతనమయ్యాయి. నాణ్యమైన మిర్చి క్వింటం ధర రూ.60 వేలు ఉంటుంది.
కానీ గత ఏడాది రూ.30 వేలకు పడిపోయింది. దీంతో దిగుబడులను కోల్డు స్టోరేజీలకు తరలించారు. ఏడాది గడిచినా ధరలు పెరగకపోగా.. రూ.20 వేలకు పడిపోయాయి. నిల్వ ఉంచినా ప్రయోజనం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది దిగుబడులు వచ్చేలోపు కనీసం రూ.30 వేలు పలికినా అమ్మేస్తామని రైతులు అంటున్నారు.
వెంటాడుతున్న వానలు
గత ఏడాది అనుభవంతో నల్లరేగడి రైతులు ఈసారి మిర్చి జోలికి వెళ్లలేదు. జి.కొట్టాల, పెంచలపాడు, కొనకొండ్ల, గుంతకల్లు, గడేకల్లు, కర్నూలు జిల్లా సరిహద్దు రైతులు 60 శాతం మంది మిర్చి పంటను పక్కనపెట్టి కంది వైపు మొగ్గారు. కానీ మిగిలినవారు ‘ఇంకొక్క ఛాన్స’ అనుకుని ఊబిలోకి దిగినంతపని చేశారు. సుమారు 1100 ఎకరాల్లో నెల కిందట మిరప విత్తనం వేశారు. అది మొదలు వదలకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఒక్క గింజ కూడా మొలకెత్తలేదు. దీంతో రెండు వారాల క్రితం మరోమారు భూమిని చదనుచేసి రెండోసారి విత్తనం వేశారు. మరోమారు అదే అనుభవం ఎదురైంది. తాజగా మూడోసారి విత్తనం వేశారు. వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఏం చేయాలో తోచడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ మొలిచినా.. వర్షాలకు కలుపు మొక్కలు భారీ స్థాయిలో వచ్చాయి. వాటిని తొలగించాలంటే కూలీల ఖర్చు తడిసి మోపెడవుతుందని అంటున్నారు. విత్తనం వేస్తే పంట సమయానికి రాదని భావించి.. కొందరు నర్సరీలలో నారను తెచ్చి నాటుకోవాలని భావిస్తున్నారు. కానీ నారుకు తెగుళ్ల బెడద ఉంటుందని సందేహిస్తున్నారు. మొత్తంగా మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
పడిపోయిన కౌలు రేట్లు
మిర్చి పంట ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా నల్లరేగడి భూములను కౌలుకు అడిగేవారు లేకుండాపోయారు. గత సంవత్సరం ఎకరానికి రూ.50 వేలదాకా ఉన్న కౌలు ఈ ఏడాది రూ.30 వేలకు పడిపోయింది. హంద్రీనీవా కాలువ పక్కన పొలాను కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేసే గుంటూరు జిల్లా రైతులు ఇక లాభం లేదనుకుని స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్థానిక రైతులు కూడా కౌలు ఆలోచన చేయడం లేదు. ఈ ఏడాది రూ.30 వేల ప్రకారం కౌలుకు తీసుకున్న కొందరు.. విత్తనం మొలకెత్తక నష్టపోయామని, కౌలు మరింత తగ్గించాలని పెద్దమనుషుల పంచాయితీలు నిర్వహించారు. వారి పరిస్థితిని అర్థం చేసుకుని కొందరు భూ యజమానులు కౌలును రూ.20 వేలకు తగ్గించుకున్నారు. మరికొందరు రైతులు రాజీపడ్డారు. మరి కొందరు కౌలు అడ్వాన్సులు తిరిగి ఇచ్చేసి.. సొంతంగా పప్పుశనగను సాగుచేయడానికి సిద్ధమౌతున్నారు.
ఎప్పుడూ ఇలా జరగలేదు..
ఈ సీజనలో ఒకసారికాదు, రెండుసార్లు కాదు.. ఏకంగా మూడుసార్లు మిర్చిని సాగుచేశాము. వర్షాల కారణంగా మొలకలు రాకపోవడం, పంటలను తొలగించడం గతంలో ఎన్నడూ జరగలేదు. మొలకలు వచ్చినా.. వర్షాల కారణంగా మునుముందు తెగుళ్ల బెడద తప్పేలా లేదు. ఇక మిర్చి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం.
- ఓబుళనాయుడు, జి.కొట్టాల
మూడోసారి విత్తనం వేశాను..
నాకున్న 13 ఎకరాల్లో ఈ సంవత్సరం రెండుసార్లు మిర్చి విత్తనం వేశారు. వర్షాల కారణంగా మొలకలు రాలేదు. మూడోసారి విత్తాక మొలకలు వస్తున్న తరుణంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. పరిస్థితి ఎలా మారుతుందో తెలియడం లేదు. పంట నిలవకపోతే ఈసారి భారీ నష్టాలు తప్పవు. అప్పులే మిగులుతాయి.
- ధనుంజయ, జి.కొట్టాల
ఎకరాకు రూ.లక్ష నష్టం..
నాకు 14 ఎకరాల పొలం ఉంది. ఇందులో నాలుగు ఎకరాలలో కంది, రెండు ఎకరాల్లో మిర్చిని రెండుసార్లు సాగుచేశాను. మిగిలిన భూమిని రూ.30 వేలతో కౌలుకు ఇచ్చాను. కిందటిసారి కౌలు ధర రూ.55 వేలు ఉన్నింది. ఈసారి సగానికి పడిపోయింది. మిర్చి మొలక రాని కారణంగా ఎకరాకు రూ.లక్ష చొప్పున నష్టపోయాను. ఇంకోసారి విత్తనం వేశాను. వర్షాలు ఆగకపోతే వైరస్ సోకుతుంది. తెగుళ్ల బెడదను తట్టుకుని పంట నిలబటం కష్టంగా మారుతుంది.
- సుబ్బయ్య, జి.కొట్టాల
గోడౌనలో ఉంచా..
కిందటి సంవత్సరం మిర్చి దిగుబడి వచ్చే సమయానికి రూ.60 వేలు ఉన్న ధర రూ.30 వేలకు పడిపోయింది. రేటు వస్తుందని కోల్డు స్టోరేజీలో పెట్టాను. కానీ ధర మరింత తగ్గి రూ.18 వేలకు చేరింది. కనీసం రూ.30 వేల ధర వచ్చినా వచ్చే నెలలో అమ్మేస్తాను. మిర్చితో భారీగా నష్టపోయాను. ఈసారి పప్పుశనగ వేయాలనుకుంటున్నాను.
- రామకృష్ణారెడ్డి, జి.కొట్టాల
మిర్చి పంటను వేయలేదు
గత ఏడాది ఆరు ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. ధర లేక రూ.2 లక్షల నష్టం వచ్చింది. అందుకే ఈసారి మిర్చి జోలికి వెళ్లలేదు. ఈ నెలాఖరులో పప్పుశనగ పంట పెడతాను. ఈ సంవత్సరం మిర్చి పెట్టి చేతులు కాల్చుకున్న రైతులను చూస్తే పంట పెట్టకపోవడమే మంచిదైందని అర్థమైంది నాకు.
- లక్ష్మణమూర్తి, జి.కొట్టాల
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 11 , 2024 | 12:16 AM