Share News

Chandrababu: కేంద్ర మంత్రి పదవులపై ఢిల్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:18 PM

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా చిట్ చాట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదని ఆయన చెప్పారు.

Chandrababu: కేంద్ర మంత్రి పదవులపై ఢిల్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Chandrababu and Modi

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా చిట్ చాట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదని ఆయన చెప్పారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వాజ్‌పేయి నేతృత్వంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి పదవులు ఆశించలేదని, అప్పుడు 7 మంత్రి పదవులు తీసుకోవాలని కోరినా అంగీకరించలేదని వెల్లడించారు. ఎన్డీఏ పార్టీలతో సత్సంబంధాల కోసమే స్పీకర్ పదవికి మాత్రం అంగీకరించానని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఎలాంటి పదవులు టీడీపీ నుంచి కోరలేదని, అయితే ఎన్డీఏ నుంచి ఆఫర్ చేసిన రెండు మంత్రి పదవులు మాత్రం తీసుకున్నామని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన మంత్రి పదవుల పట్ల సంతోషంగానే ఉన్నామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.


జగన్ పాలనతో అమరావతి ఆకర్షణ తగ్గింది

గత ఐదేళ్ల జగన్ పాలనతో అమరావతిపై ఉన్న ఆకర్షణ కొంతవరకు తగ్గిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతికి కోల్పోయిన ఆకర్షణను తిరిగి తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా పని కొనసాగుతోందని, 135 ప్రభుత్వ కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. అమరావతికి అవసరమైన ప్రాథమిక మౌలిక వసతులన్నీ కల్పిస్తామని, త్వరలోనే ఐకానిక్ బిల్డింగ్స్ సహా అన్ని కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేయబోతున్నామని తెలిపారు. వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నటువంటి భవనాలను తొలుత పూర్తి చేస్తామని, దశలవారీగా అమరావతిలో అన్ని నిర్మాణాలను త్వరితగతిన చేపడతామని సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.


కులగణన స్థానంలో నైపుణ్య గణన

రాష్ట్రంలో కులగణన స్థానంలో నైపుణ్య గణన చేపట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనిపై క్యాబినెట్లో చర్చించి ఆమోదించామని, త్వరలో అన్ని మార్గదర్శకాలను విడుదల చేయబోతున్నామని ఆయన చెప్పారు. మానవ వనరులను మూలధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించడమే లక్ష్యమన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో నెపుణ్యానికి అనుగుణంగా ఉపాధి కల్పిస్తామని వివరించారు. ప్రతి కుటుంబంలో నైపుణ్యాలను క్రోడీకరించి వాళ్ల శక్తి సామర్థ్యాలను పెట్టుబడిగా సంపద సృష్టిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దీనివల్ల ఎక్కడికో వెళ్లి ఒకరి కింద పని చేయడానికి అవసరం ఉండదని, ప్రతి కుటుంబం ఒక ఔత్సాహిక పారిశ్రామికులుగా రూపొందుతారని దీమా వ్యక్తం చేశారు. తద్వారా ప్రతి కుటుంబ తలసరి ఆదాయం పెరుగుతుందని, పీపీపీ మోడల్ స్థానంలో పీ4 విధానం తీసుకురావాలి అనుకుంటున్నామని చంద్రబాబు వివరించారు. సంపదలో అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్లు అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూత ఇచ్చేలా చేయడమే పీ4 లక్ష్యమని చంద్రబాబు వివరించారు.


రేవంత్ రెడ్డితో భేటీపై స్పందిస్తూ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలన్నదే తన విధానమని, ఇరు రాష్ట్రాలకు సమ న్యాయం చేయాలని, విభజన సమయంలో కూడా తాను అదే చెప్పానని అన్నారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డితో సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా సమస్యలు పరిష్కారం కావాలనే చర్చిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మళ్లీ జగన్ వస్తే ఎలా అని అన్ని వర్గాలు అడుగుతున్నాయని, అయితే డెవిల్‌ని (దెయ్యం) నియంత్రించామని, ఇకపై ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా జరిగిన నష్టం నుంచి బయటికి రావాలని, అందుకు అనుగుణంగా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సహకారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని ఆయన వివరించారు. దావోస్‌లో జరిగే పెట్టుబడుల సదస్సుకు తప్పకుండా హాజరవుతానని ఆయన ప్రకటించారు. దేశంలో ఏదైనా కొత్త విధానం తీసుకురావడానికి కమిటీకి నేతృత్వం వహిస్తారా అంటే... అది అంతా అప్పటి అవసరానికి అనుగుణంగానే ఉంటుందని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఎన్డీఏ నాయకత్వం నుంచి ప్రతిపాదన ఉంటే అప్పుడు ఆలోచిస్తానని ఆయన చెప్పారు.


దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనన్ని గొప్ప వనరులు: సీఎం

దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనన్ని గొప్ప వనరులు ఆంధ్రప్రదేశ్‌కి ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఆంధ్రప్రదేశ్ అంతా అనుసంధానమై ఉందని, ఒక్క గోదావరి నది నుంచి సుమారు 3000 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని ఆయన ప్రస్తావించారు. ఆ నీటిని వినియోగించుకోగలిగితే రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించవచ్చునని విశ్వాసం వ్యక్తం చేశారు. నదుల అనుసంధానం పూర్తిస్థాయిలో చేయగలిగితే గోదావరి నుంచే దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ నీటి సరఫరా చేయవచ్చునని అన్నారు. రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తామని, గత ఐదేళ్ల దుష్పరిణామాల వల్ల రాష్ట్రానికి పూడ్చలేని స్థాయిలో నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారని, అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను గ్లోబల్ లీడర్లుగా తయారు చేయడం కర్తవ్యంగా పెట్టుకున్నామని సీఎం వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

జగన్‌కు ప్రజాస్వామ్యం అంటే తెలుసా?

మేమంతా గర్వపడేలా వారు చేయాలని ఆకాంక్షిస్తున్నా...

For More AP News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 05:36 PM