ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శారదా పీఠానికి భూకేటాయింపులు రద్దు

ABN, Publish Date - Oct 24 , 2024 | 04:07 AM

విశాఖ శారదాపీఠానికి గత ప్రభుత్వం జరిపిన భూకేటాయింపులను రద్దుచేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. సంబంధిత జీవోలను రద్దుచేయాలని తీర్మానించింది. అలాగే మహిళలకు దీపావళి కానుక ప్రకటించింది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని

సంబంధిత జీవోల రద్దుకు కేబినెట్‌ ఆమోదం

మహిళలకు 3 ఉచిత సిలిండర్లకూ పచ్చజెండా

ఇసుకపై సీనరేజ్‌ తదితర పన్నుల రద్దు

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): విశాఖ శారదాపీఠానికి గత ప్రభుత్వం జరిపిన భూకేటాయింపులను రద్దుచేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. సంబంధిత జీవోలను రద్దుచేయాలని తీర్మానించింది. అలాగే మహిళలకు దీపావళి కానుక ప్రకటించింది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని ఎన్నిక ల ముందు ఇచ్చిన హామీని ఈ నెల 31 నుంచి అమ లు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఉచిత ఇసుకలో సీనరేజ్‌ తదితర పన్నుల రద్దు, ఆలయ పాలకమండళ్లలో సభ్యుల సంఖ్య పెంపు, బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణుల నియామకం, శారదాపీఠానికి భూకేటాయింపులు రద్దు తదితర నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్‌, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర వెల్లడించారు. దీపావళి(31వ తేదీ) నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అమలు కానుండగా.. దీనికి 3-4 రోజుల ముందే బుకింగ్‌ ప్రారంభించనున్నట్లు మనోహర్‌ తెలిపారు. సిలిండర్‌ ధరను డెలివరీ సమయంలో లబ్ధిదారులే చెల్లించాల్సి ఉంటుందని.. డెలివరీ అయిన 48 గంటల్లో ఆ డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభు త్వం జమ చేస్తుందని చెప్పారు. 31 నుంచి మార్చి నెలాఖరులోపు ఒక దఫా సిలిండర్‌ పొందవచ్చన్నా రు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 4 నెలలకు ఒక సిలిండర్‌ చొప్పున.. ఏప్రిల్‌ 1 నుంచి జూలై నెలాఖరు వరకు మొదటిది, ఆగస్టు 1 నుంచి నవంబరు నెలాఖ రు వరకు రెండోది, డిసెంబరు 1 నుంచి మార్చి నెలాఖరు వరకు మూడో సిలిండర్‌ పొందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఒక విడతలో సిలిండర్‌పై రాయి తీ కింద ప్రభుత్వంపై రూ.894.92 కోట్లు, మూడు విడతల్లో ఏడాదికి రూ.2,684 కోట్లు భారం పడుతుందన్నారు. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామన్నా రు. కార్డుల డిజైన్లు ఖరారు చేసిన వెంటనే మంజూ రు చేస్తామన్నారు. శారదాపీఠానికి తిరుమలలో గత ప్రభుత్వం 9 వేల చదరపు అడుగులు కేటాయించ గా.. పీఠం ఏకంగా 25 వేల చ.అడుగుల్లో నిర్మాణాలు చేసి అద్దెలకు ఇచ్చుకుంటోందని పార్థసారథి తెలిపా రు. ఇసుక పూర్తిగా ఉచితంగా అందించేలా కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని రవీంద్ర చెప్పారు. గత ప్రభుత్వంలో మెట్రిక్‌ టన్నుకు రూ.475 చొప్పున లెక్కాపత్రం లేకుండా ఇసుక విక్రయించారని.. కూటమి ప్రభుత్వం దీనికి స్వస్తి పలికిందన్నారు. ఎవరైనా సొం త వాహనం తెచ్చుకుని నదిలో ఇసుకను తీసుకెళ్లొచ్చ ని.. అయితే వెబ్‌సైట్‌ లో గ్రామ/వార్డు సచివాలయంలో సమాచారం కోసం నమోదు చేసుకోవాలని సూచించారు.


కేబినెట్‌ కీలక నిర్ణయాలివీ..

  • విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని శారదాపీఠానికి సర్వే నంబర్లు 102, 102/2, 103ల్లోని 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తూ జారీ చేసిన జీవోలు 343, 64, 47ల రద్దు.

  • ఇసుకపై సీనరేజ్‌ ఫీజు, డీఎంఎఫ్‌, ఎంఈఆర్‌ఐటీ మినహాయిస్తూ ఉచిత ఇసుక విధానం-2024లో సవరణలు. గ్రామ పంచాయతీల పరిధిలో సొంత అవసరాలకు ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అనుమతి. పట్టాభూములతోపాటు, డీకేజీ పట్టా భూ ముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతి.

  • జీవోలను అప్‌లోడ్‌ చేసేందుకు జీవోఐఆర్‌ వెబ్‌పోర్టల్‌ పునరుద్ధరణకు ఆమోదం.

  • రివర్స్‌ టెండరింగ్‌ రద్దు.. కేంద్రం సహా అన్ని రాష్ట్రా లు టెండర్ల విధానంలో కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) గైడ్‌ లైన్స్‌నే అనుసరిస్తున్నాయి. ఏపీలోనూ వీటినే పాటించాలని నిర్ణయం.

  • రూ.వంద కోట్లు దాటిన టెండర్లను పరిశీలించేందుకు గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన జ్యుడీషియల్‌ ప్రివ్యూ కూడా రద్దు.

  • దేవాలయ ట్రస్టు బోర్డుల్లో మరో ఇద్దరు సభ్యుల పెంపు. బ్రాహ్మణ సంఘం నుంచి ఒకరిని, నాయీ బ్రాహ్మణ సంఘం నుంచి ఇంకొకరిని ఎంపిక చేస్తూ రూపొందించిన బిల్లుకు ఆమోదం.

  • రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికిగాను వరి సేకరణ కోసం మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.1,800 కోట్ల మేర రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారెంటీ. అలాగే విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర సహకార బ్యాంకు నుంచి ఇప్పటికే పొందిన రూ.80 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ కొనసాగింపు.

  • చెవిటి, మూగ, కుష్టు వ్యాధిగ్రస్తులపై వివక్ష నిర్మూలన ముసాయిదా బిల్లుకు ఆమోదం.

  • విశాఖలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో 27 టీచింగ్‌ పోస్టులు, 56 నాన్‌ టీచింగ్‌ పోస్టుల మంజూరు. పదోన్నతులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ప్రతిపాదికన భర్తీ.

  • 50 పడకల మంగళగిరి ఏరియా ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడానికి రూ.52.22 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం. 73 అదనపు పోస్టుల మంజూరు.

వ్యవస్థలను నిర్వీర్యం చేసి నిందలా: అనిత

ఐదేళ్లు వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వారే నిందలు వేయడం హాస్యాస్పదమని హోం మంత్రి అనిత అన్నారు. డాక్టర్‌ సుధాకర్‌, ఓం ప్రతాప్‌, వరప్రసాద్‌లను వేధించినప్పుడు దళితులు గుర్తుకు రాలేదా అని మాజీ సీఎం జగన్‌ను ఆమె నిలదీశారు. విజయవాడ నడిబొడ్డున దళిత వికలాంగ మహిళపై మూడ్రోజుల పాటు అత్యాచారం జరిగినప్పుడు.. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పరామర్శకు వెళ్తే వాసిరెడ్డి పద్మతో కేసు పెట్టించలేదా? గతం మీరు మరచిపోయినా మేం మరచిపోం. ఆస్తి తగాదాలతో తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం’ అని మండిపడ్డారు. కాగా, ఇసుకను అక్రమంగా తవ్వినా.. అక్రమ రవాణాకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్టు ప్రయోగిస్తామని గనుల మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Updated Date - Oct 24 , 2024 | 04:07 AM