ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Collectorate: బాధితులంతా కలెక్టరేట్‌కే...!

ABN, Publish Date - Oct 01 , 2024 | 01:51 AM

క్షేత్ర స్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్‌, ఎంపీడీవోల వద్దకు సమస్యలున్న బాధితులు వెళ్లడం తగ్గించేశారు. తమ సమస్యలు చెప్పుకుంటే పరిష్కారమవుతాయనే నమ్మకాన్ని క్షేత్రస్థాయి అధికారులు కల్పించకపోవడంతో నేరుగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌ డే కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి బృందం సోమవారం జిల్లాలోని తహసీల్దార్‌ కార్యాలయాలను సందర్శించగా.. అర్జీదారులు కనిపించలేదు. కలెక్టరేట్‌ మాత్రం ప్రతి సోమవారం అర్జీదారులతో కిటకిటలాడుతోంది.

బాధితులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

అర్జీదారులకు నమ్మకం కల్పించడంలో మండలస్థాయి యంత్రాంగం విఫలం

పరిష్కరించకుండానే గ్రీవెన్స్‌ ఫైళ్లు క్లోజ్‌

చిత్తూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తహసీల్దార్‌ కార్యాలయాల్లో గ్రీవెన్స్‌ డే జరుగుతున్న తీరును సోమవారం ఆంధ్రజ్యోతి బృందం పరిశీలించింది. దాదాపు అన్ని కార్యాలయాల్లో తహసీల్దార్లు 10 నిమిషాలు అటుఇటుగా సమయానికి గ్రీవెన్స్‌ డేకి హాజరయ్యారు. తహసీల్దార్లు హాజరవ్వని చోట మాత్రం డిప్యూటీ తహసీల్దార్లు బాధ్యత తీసుకున్నారు. కొన్నిచోట్ల కిందిస్థాయి సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. అధికారులు సమయానికి వచ్చినా అర్జీదారులు మాత్రం తహసీల్దార్‌ కార్యాలయాల్లో కనిపించలేదు.జిల్లా కేంద్రంలో జరిగిన గ్రీవెన్స్‌ డే కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సుమారు 250మంది హాజరై, తమ గోడు చెప్పుకున్నారు. ఎన్నిసార్లు అర్జీలిచ్చినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు గోడువెళ్లబోసుకున్నారు.

క్షేత్రస్థాయి అధికారులను కమ్మిన నిర్లక్ష్యం

క్షేత్రస్థాయిలో బాధితులకు అండగా నిలవాల్సిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు సమస్యల్ని పట్టించుకుని పరిష్కరిస్తారన్న నమ్మకం కల్పించడంలో విఫలమవుతు న్నారు.కొత్తగా ఏర్పడిన పలమనేరు, కుప్పం, నగరి రెవెన్యూ డివిజన్లలో రికార్డులు పూర్తిస్థాయిలో మారక పోవడంతో సమస్యలు అధికంగా వస్తున్నాయి. దీనపై ఆర్డీవోలు చొరవ తీసుకోవడం లేదని చెబుతున్నారు.

అర్జీల పరిష్కారానికి ప్రత్యేక డెస్క్‌

కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీలను మండల అధికారులకు పంపిస్తే కొందరు సరిగా పట్టించుకోకపోవడంతో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రత్యేక డెస్క్‌ను ఏర్పా టు చేశారు. దీంట్లో పని చేసేందుకు ముగ్గురు డిజిటల్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇస్తున్నారు.వీరు రోజూ ర్యాండమ్‌గా 15మంది అర్జీదారులకు ఫోన్‌ చేసి.. వారి సమస్య నిజంగానే పరిష్కారమైందా.. లేదా.. అని అడిగి తెలుసుకుంటారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు జాయింట్‌ కలెక్టర్‌కు అందించి, సంబంధిత తహసీల్దార్లకు కూడా ఫార్వర్ట్‌ చేస్తారు.రెండు మూడు రోజుల్లో ఈ కొత్త విధానం ప్రారంభం కానుంది.

నిర్లక్ష్యం నిండిన 26 మందికి షోకాజ్‌

బాధితులకు నమ్మకం కల్పించడంలో విఫలమవడం అనే విషయాన్ని పక్కనపెడితే.. చివరికి కలెక్టరేట్‌ నుంచి సిఫార్సు చేసిన అర్జీలను కూడా మండలస్థాయిలో సరిగా పరిష్కరించడం లేదు. క్షేత్ర స్థాయిలో సమస్యను విచారించి, పరిష్కరించి ఆ ఫైల్‌ను క్లోజ్‌ చేయాల్సి ఉంది. విచారించకుండా కొందరు, తప్పుడు సమాచారంతో మరికొందరు ఫైళ్లను క్లోజ్‌ చేసేస్తున్నారు. దీన్ని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తీవ్రంగా పరిగణించి.. సోమవారం 26మంది మండలస్థాయి అధికారులకు షోకాజ్‌ నోటీసులు పంపించారు. వారిలో బంగారుపాళ్యం, పూతలపట్టు, శాంతిపురం, వెదురుకుప్పం, పెద్దపంజాణి తహసీల్దార్లు.. చిత్తూరు వన్‌ టౌన్‌ సీఐ, బైరెడ్డిపల్లె, రాళ్లబుదుగూరు, సోమల, తవణంపల్లె, వెదురుకుప్పం ఎస్‌ఐలు, రామకుప్పం, ఐరాల విద్యుత్తు శాఖ ఏఈలు.. బంగారుపాళ్యం ఏపీఎం, జిల్లా పరిశ్రమల సంస్థ జీఎం, సోమల మండలంలోని పెద్దఉప్పరపల్లె పంచాయతీ కార్యదర్శి తదితరులున్నారు.


మూడు నెలల్లో 7843 అర్జీలు

కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కలెక్టరేట్‌లో ప్రతి వారం, కుప్పంలో పక్షం రోజులకు ఓసారి నిర్వహించే గ్రీవెన్స్‌ డే కార్యక్రమాల్లో 7843 అర్జీలు వచ్చాయి. వీటిలో అధికారుల లెక్కల ప్రకారం 5553 పరిష్కారమయ్యాయి. 2252 అర్జీలు పెండింగులో ఉన్నాయి. మిగిలినవి ప్రోగ్రె్‌సలో ఉన్నాయి. వచ్చిన అర్జీల్లో సగానికిపైగా (4357) రెవెన్యూ సంబంధిత అర్జీలే వచ్చాయి. పోలీసు 746, సర్వే సెటిల్‌మెంట్స్‌ 447, మున్సిపల్‌ 229, వెలుగు (సెర్ప్‌) 229, హౌసింగ్‌ 214... ఇలా అర్జీలు అందాయి.

తహసీల్దార్లు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్‌

ప్రజలందించే అర్జీల పరిష్కారంలో క్షేత్ర స్థాయి అధికారులు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. చిన్న సమస్య ఉన్నా ప్రజలు నేరుగా కలెక్టరేట్‌కు వస్తున్నారు. తహసీల్దార్లు సక్రమంగా పనిచేసి వారి సమస్యల్ని అక్కడే పరిష్కరిస్తే ఇలా రావాల్సిన అవసరం ఉండదు. గ్రీవెన్స్‌ డే అర్జీలను పరిష్కరించకపోయినా, తప్పుడు సమాచారంతో క్లోజ్‌ చేసినా ఇక నుంచి తీవ్ర చర్యలుంటాయి. అందుకే సోమవారం ఒక్కరోజే 26 మంది అధికారులకు షోకాజ్‌ నోటీసులిచ్చాం.అర్జీల ప్రోగ్రెస్‌ తెలుసుకోవడం కోసం ఇక నుంచి ప్రత్యేక డెస్క్‌ ఏర్పాటుచేసి ఫాలోఅప్‌ చేస్తాం.

Updated Date - Oct 01 , 2024 | 01:51 AM