గొలుసు దొంగల అరెస్టు
ABN , Publish Date - Nov 18 , 2024 | 01:11 AM
రూ. 30 లక్షల నగలు, మోటర్‌సైకిళ్ల స్వాధీనం
పలమనేరు, నవంబరు17 (ఆంధ్రజ్యోతి) : కొంతకాలంగా ఒంటరి మహిళలకు కునుకు లేకుండా చేస్తున్న చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారు.ఇటీవల గొలుసు దొంగతనాలు బాగా పెరిగిన విషయం తెలిసిందే.మహిళలకు బయటికెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో 8మంది చైన్ స్నాచర్లను అరెస్టు చేసి రూ. 30 లక్షలకు పైగా విలువ చేసే బంగారు నగలు, మోటరు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు.పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ మణికంఠ వివరాలను వెల్లడించారు. పుంగనూరులో ఈనెల 1వతేది ఓ మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లారు.పుంగనూరు ఆర్టీసీ డిపోలో పనిచేసే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి బుక్యాప్రసాద్‌నాయక్ ఈనెల 15వతేది పుంగనూరు మినీ బైపాస్ రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ మెడలోనుంచి చైన్ లాక్కెళ్తుండగా స్థానికులతో కలిసి పుంగనూరు సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ లోకేష్ వెంబడించారు.అతడిని అరెస్టుచేసి రూ. 6.50 లక్షల విలువైన 69 గ్రాముల మూడు బంగారు చైన్లు, ఒక మోటరు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.లోన్ యాప్‌లో రుణాలు తీసుకొని చెల్లించలేక ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. కొద్ది రోజులుగా చౌడేపల్లి, గంగవరం, కురబలకోట, రామసముద్రం, పలమనేరు, శాంతిపురం, బైరెడ్డిపల్లి మండలాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలో బంగారు గొలుసులను లాక్కెళ్లిన ఏడుగురిని అరెస్టు చేసి చైన్లను స్వాధీనం చేసుకున్నారు.అన్నమయ్యజిల్లా తంబళ్లపల్లి మండలం ఏటిగడ్డపల్లికి చెందిన ముద్దం చంద్రశేఖర్(32), హరికృష్ణ(24), మదనపల్లెకు చెందిన దాసరి నాగరాజు అలియాస్ నాగ (38), ఎల్. భాస్కర్(37),కె. పవన్‌కుమార్(27) బి.కొత్తకోటకు చెందిన పి.బావాజాన్ (35), చౌడేపల్లి మండలం మడుకూరుకు చెందిన గుంతలపేట లక్ష్మీపతి అలియాస్ చంటి(30) అరెస్టు అయిన వారిలో వున్నారు. వీరి వద్ద చోరీ చేసిన 332 గ్రాములు బంగారు ఆభరాణాలు, దొంగతనాలకు ఉపయోగించిన మూడు మోటరు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు.డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో చైన్‌స్నాచర్స్‌ను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఏఎ్‌సఐ శ్రీనివాసులు నాయుడు, కానిస్టేబుళ్లు అల్లావుద్దీన్, శశిధర్, బాలాజి, రెడ్డెప్ప, వెంకటరమణ, ఎల్లప్పలకు రివార్డులను ఎస్పీ అందజేశారు.అలాగే గొలుసులను పోగొట్టుకున్న బైరెడ్డిపల్లి మండలం రామసముద్రం గ్రామానికి చెందిన అలివేలుతో పాటు మరో ఇద్దరు మహిళలకు బంగారు చైన్లను ఎస్పీ మణికంఠ అందజేశారు.