ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PGRS: మారింది పేరే..

ABN, Publish Date - Oct 01 , 2024 | 02:32 AM

గత ప్రభుత్వం ‘స్పందన’ పేరిట అమలు చేసిన ఫిర్యాదుల దినాన్ని.. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పేరు మార్చింది. అయితే మారింది కార్యక్రమం పేరే తప్ప అందులో పాల్గొనే అధికారులు, ఉద్యోగుల తీరు కాదని చెబుతున్నారు బాధితులు.

ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ జనం ప్రదక్షిణలు

‘ఫిర్యాదుల దినం’ అమలు అధ్వానం

తిరుపతి, ఆంధ్రజ్యోతి : గత ప్రభుత్వం ‘స్పందన’ పేరిట అమలు చేసిన ఫిర్యాదుల దినాన్ని.. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పేరు మార్చింది. అయితే మారింది కార్యక్రమం పేరే తప్ప అందులో పాల్గొనే అధికారులు, ఉద్యోగుల తీరు కాదని చెబుతున్నారు బాధితులు. సోమవారం ఫిర్యాదుల దినాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌ తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్‌లో అధికారులు, ఉద్యోగుల హాజరు, సమయ పాలన వంటి అంశాలతో పాటు ప్రధానంగా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. ఆ సందర్భంగా కొత్త ప్రభుత్వంలోనూ ఫిర్యాదుల దినం అమలు అధ్వానంగా ఉందని వెల్లడైంది. దీనికి కొందరు అర్జీదారుల ఆవేదనలే నిదర్శనం.

మూడేళ్లుగా కొడుకు పేరిట మారని భూమి

ఈ బడుగు రైతు పేరు కర్లపూడి రమణయ్య. కోట మండలం కర్లపూడి స్వగ్రామం. ఇతడి తండ్రి ఊసయ్య పేరిట ప్రభుత్వం గతంలో రెండున్నరెకరాల భూమి కేటాయించింది. తండ్రి మరణించడంతో రికార్డుల్లో తన పేరు నమోదు చేయించుకునేందుకు మూడేళ్ళుగా ఈయన అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈయన్ను పట్టించుకుని.. సమస్యను పరిష్కరించే తీరిక రెవెన్యూ అధికారులకు లేకపోతోంది.

ఆన్‌లైన్‌లో పేరు నమోదుకు..

ఈయన పేరు కడివేటి లింగస్వామి. చిల్లకూరు మండలం పొన్నవోలు. ఈయన పేరిట 1.45 ఎకరాలకు పట్టాదారు పాస్‌ పుస్తకం ఉంది. 1బి అడంగల్‌లో మాత్రం ఆయన పేరు నమోదు కాలేదు. రెండుసార్లు చలానా కట్టారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మూడున్నరేళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తన సమస్య మాత్రం పరిష్కారం కాలేదని వాపోతున్నారాయన.

పరిహారం కోసం పుష్కర కాలంగా..

ఈమె పేరు కనుపూరు సుబ్బమ్మ. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామం. కృష్ణపట్నం పోర్టు పరిధిలో ఓ పరిశ్రమ నిర్మాణం కోసం ప్రభుత్వం తూర్పు కనుపూరు 207-2ఏసర్వే నంబరులో ఈమెకున్న 1.36 ఎకరాలను 2012లో సేకరించింది. ఇంతవరకు పరిహారం మాత్రం ఇవ్వలేదు. కోర్టు ఆదేశాలున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదనేది ఆమె ఆవేదన. కొత్తగా వచ్చిన సబ్‌ కలెక్టర్‌ అయినా న్యాయం చేస్తారన్న ఆశతో అర్జీతో వచ్చారామె.


మళ్లీ.. మళ్లీ రమ్మంటున్నారు

ఈ రైతు పేరు బాలకృష్ణ. రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం. రెవెన్యూ సర్వే నెం.195/3లో 22సెంట్ల భూమి ఆన్‌లైన్‌ చేసుకోవడానికి ఏడాదిగా తిరుగుతున్నారు. ప్రతిసారి వీఆర్వో, ఆర్‌ఐ, తహసీల్దారు మళ్లీ రమ్మంటున్నారు గానీ పనిచేయడం లేదు. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమినే ఆన్‌లైన్‌ చేయడానికి ఇలా తిప్పుతున్నారు.

రెండేళ్లుగా తేలని నష్ట పరిహారం

రేణిగుంట మండలంలో రేణిగుంట-కడప రోడ్డు విస్తరణ కోసం శ్రీనివాసపురం, ఇందిరమ్మ కాలనీ, అరుంధతి వాడ, కరకంబాడి బీసీ కాలనీ, రాజీవ్‌ గాంధీ కాలనీ తదితర ప్రాంతాల్లో 135 ఇళ్లను ప్రభుత్వం తొలగించింది. 2022 నుంచీ బాధితుల్లో పలువురికి నష్టపరిహారం అందలేదు. రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడి తమ పేర్ల బదులు ఇతరుల పేర్లు నమోదు చేసి తమకు పరిహారం అందకుండా చేశారని, మార్కెట్‌ విలువ కంటే చాలా తక్కువ ధర నమోదు చేసి పరిహారం తక్కువ రావడానికి కారకులయ్యారని పలువురు బాధితులు రెండేళ్లుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం కూడా వచ్చి అర్జీలు ఇచ్చారు.

మొత్తం 187 ఫిర్యాదులు

తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 30: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యల పరిష్కారానికి 187 వినతులు సమర్పించారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యలపై 120 ఫిర్యాదులున్నాయి. ఆయా ఆర్జీలను పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. జేసీ శుభం బన్సల్‌, డీఆర్వో పెంచలకిషోర్‌, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర, నరసింహులు అర్జీలు స్వీకరించారు.

గ్రీవెన్స్‌ రోజే అధికారులతో సమీక్షలు

అధికారులు, ఉద్యోగులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండేదే సోమవారం. ఫిర్యాదుల దినం పేరిట అతి కష్టంగా ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉంటారు. మిగిలిన రోజుల్లో వారు దొరకడం కష్టం. దొరికినా ఏదో ఒక పని ఉందంటూ ఇతర పనుల్లో బిజీగా ఉంటారు. ఇదీ సామాన్య జనంలో అధికారులు, ఉద్యోగుల పట్ల ఉన్న అభిప్రాయం. అయితే ఫిర్యాదుల దినమైన సోమవారాల్లోనూ అధికారులు కార్యాలయాల్లో ఉండకపోతే తాము ఎక్కడికి పోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి బాధిత జనం నుంచి. సోమవారం తిరుపతి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని దాదాపు అన్ని రెవెన్యూ కార్యాలయాల్లోనూ తహసీల్దార్లు అందుబాటులో లేరు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఆర్డీవో కార్యాలయంలో జరిగే సమీక్షకు హాజరయ్యేందుకు వెళ్లారని సిబ్బంది చెప్పారు. ఇప్పుడు ఓటర్ల జాబితా అత్యవసరమేమీ కాదు. తప్పనిసరి అనుకుంటే సోమవారమే మధ్యాహ్నం తర్వాత సమీక్ష పెట్టుకోవచ్చు. లేదంటే మంగళవారం నిర్వహించుకోవచ్చు. అధికారులు అందుబాటులో లేకుండా ఫిర్యాదుల దినం నిర్వహించి ఉపయోగమేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.


సర్వే కోసం ఏడాదిన్నరగా ఎదురుచూపు

ఈ ఫొటోలోని వ్యక్తి మోపూరు గోపాల్‌. సొంతూరు వెంకటగిరి మండలం పాలెంకోట. తన పొలం గట్టును పొరుగు రైతు ఆక్రమించారని ఏడాదిన్నరగా రెవెన్యూ అధికారులకు గోడు వెళ్లబోసుకుంటున్నారు. తొలుత సర్వే చేసినప్పటికీ రిపోర్టు ఇవ్వలేదు, సమస్యను పరిష్కరించనూ లేదు. ఇద్దరు తహసీల్దార్లు బదిలీపై వెళ్లి.. ఇప్పుడు మూడో తహసీల్దారు రావడంతో మొర పెట్టుకునేందుకు వచ్చానని ఆవేదన వెలిబుచ్చారాయన.

తొలి ప్రజావేదికలో ఇచ్చిన అర్జీపై చర్యల్లేవ్‌

ఈ ఫొటోలోని వృద్ధురాలి పేరు దమయంతి. పిచ్చాటూరు మండలం అడవి కొడియంబేడు గ్రామం. తన స్థలానికి వెళ్లే దారిని కొందరు కబ్జా చేసి దారి లేకుండా అక్రమ కట్టడాలు కట్టేస్తున్నారనేది ఆమె సమస్య. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాసమస్యల పరిష్కార వేదిక పేరిట నిర్వహించిన తొలి ఫిర్యాదుల దినానే (జూన్‌ 24న) ఆమె రెవెన్యూ అధికారులకు అర్జీ ఇచ్చారు. ఇంతవరకు అతీగతీ లేకపోవడంతో మళ్లీ ఇప్పుడు వచ్చానని వాపోయారా వృద్ధురాలు.

Updated Date - Oct 01 , 2024 | 02:32 AM