ఐదేళ్ల అరాచకం మరిచారా స్వాములూ?
ABN , Publish Date - Nov 20 , 2024 | 01:39 AM
కుర్చీమీద ఉన్నపుడు ఒక తీరు.. దిగిపోతే ఇంకో తీరా? అధికారంలో ఉన్నపుడు విపక్షాల మీద నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడారు. వారి కుటుంబాలనూ సోషల్ మీడియా బజారుల్లోకి ఈడ్చారు. ఆడవాళ్ల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. ఫోటోలు మార్ఫింగ్ చేశారు. వాయిస్ మార్చేశారు. అతుకులు వేసి అబద్ధాలు సృష్టించారు. గోబెల్స్‌ను తలదన్నేలా ప్రవర్తించిన నాయకుల నోట ఇప్పుడు భావప్రకటనా స్వేచ్ఛ గురించిన ప్రవచనాలు వినిపిస్తున్నాయి. మీడియాను అణగదొక్కేస్తున్నారని ఆక్రోశిస్తున్నారు.
వేగంగా కదులుతున్న పోలీసు యంత్రాంగం
తిరుపతి జిల్లాలో 13 కేసులు నమోదు
తిరుపతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కుర్చీమీద ఉన్నపుడు ఒక తీరు.. దిగిపోతే ఇంకో తీరా? అధికారంలో ఉన్నపుడు విపక్షాల మీద నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడారు. వారి కుటుంబాలనూ సోషల్ మీడియా బజారుల్లోకి ఈడ్చారు. ఆడవాళ్ల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. ఫోటోలు మార్ఫింగ్ చేశారు. వాయిస్ మార్చేశారు. అతుకులు వేసి అబద్ధాలు సృష్టించారు. గోబెల్స్‌ను తలదన్నేలా ప్రవర్తించిన నాయకుల నోట ఇప్పుడు భావప్రకటనా స్వేచ్ఛ గురించిన ప్రవచనాలు వినిపిస్తున్నాయి. మీడియాను అణగదొక్కేస్తున్నారని ఆక్రోశిస్తున్నారు. అధికార పీఠంపై నుంచి అమానవీయంగా ప్రవర్తించినవారే ఇప్పుడు నీతి పలుకులు వల్లిస్తున్నారు. తల్లినీ, చెల్లినీ కూడా వదలని రాజకీయ సోషల్ రాక్షసులను నిస్సిగ్గుగా వెనకేసుకుని వస్తున్నారు. ఐదేళ్ల అరాచకపాలనలో మగ్గిపోయిన ప్రజలు అమాయకులు కారు. అప్పుడేం జరిగిందో గుర్తు చేసుకుంటున్నారు. ఐదేళ్లు పెదవి విప్పలేకపోయిన చీకటి రోజులను తలచుకుని సోషల్ అపరిచితులకు అండగా నిలబడుతున్న నాయకులను ఈసడించుకుంటున్నారు.
అవాకులు చెవాకులు.. అబద్ధాలు.. అసభ్యపు మాటలు.. వీడియోలతో చెలరేగిపోయిన సోషల్ కేటుగాళ్లపై జిల్లాలో ఐదేళ్లు చేష్టలుడిగి ఉండిపోయిన పోలీసులు కూటమి ప్రభుత్వంలో కదులుతున్నారు. కేసులు బయటకు తీస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. జిల్లాలో సోషల్ మీడియా కేంద్రంగా వచ్చిన ఫిర్యాదులు, చర్యల వివరాలు ఇవీ..
చంద్రబాబు కుటుంబంపై అసభ్యంగా..
సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ తిరుపతికి చెందిన తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ మధుబాబు జూలై 23న తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు దర్యాప్తు జరిపి ‘‘నారావారి మాధవరెడ్డి’’ అనే ఐడీ నుంచీ పోస్టులు పెడుతున్నట్టు గుర్తించారు. ఈ పోస్టులు పెడుతున్నది అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం నక్కలపల్లికి చెందిన ఉస్తిలి సంజీవరెడ్డి (42)గా గుర్తించారు. ఈనెల 9న అతనిని అరెస్టు చేశారు. కోర్టు రిమాండు విధించింది. రాజమండ్రి, విశాఖపట్టణం, గుంటూరుల్లో కూడా ఇతనిపై కేసులున్నాయి. దీంతో పీటీ వారెటుపై అతడిని రాజమండ్రి తీసుకెళ్ళారు.
పవన్‌పై పోస్టులు
కూటమి ప్రభుత్వం మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ తిరుపతి నగర జనసేన అధ్యక్షుడు రాజారెడ్డి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వైసీపీ సానుభూతిపరుడైన ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన హరీశ్వరరెడిని హైదరాబాదులోని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈకేసుతో సంబంధం వున్న మరికొందరిని కూడా ఇటీవల అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. హరీశ్వరరెడ్డిపై రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదై వుండడంతో పీటీ వారెంటుపై రాజమండ్రి పోలీసులు తీసుకెళ్ళారు.
జిల్లావ్యాప్తంగా 13 కేసులు నమోదు
-సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల మీద జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబుపై పెట్టిన పోస్టులపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో మూడు, తిరుమల వన్ టౌన్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అసభ్య వ్యాఖ్యలకు సంబంధించి తిరుపతి అలిపిరి, ఈస్ట్ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదు అయ్యాయి.
- శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను చికాకు పరిచేలా పోస్టులు పెట్టిన శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన దువ్వల మాధురి (38)పై తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిష్టర్ చేశారు.
-బంగ్లాదేశ్ వరదల వీడియోలు చూపుతూ విజయవాడలో జరిగినట్టు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం అనికలపల్లికి చెందిన హరీశ్వర్‌రెడ్డి మీద తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు పెట్టారు.
- రెండు రాజకీయ పార్టీలు, రెండు కులాల నడుమ ఉద్రిక్తతలు పెంచేలా వీడియోలు పోస్టు చేసి అందులో పోలీసు శాఖపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన శ్రీకాళహస్తి మండలం తొండమనాడుకు చెందిన పోలంరెడ్డి అనే వ్యక్తిపై శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి, టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి సర్క్యులేట్ చేసిన వ్యక్తిపై తిరుమల టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
-టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడుపై అసభ్యంగా ధూషిస్తూ పోస్టు పెట్టిన సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళిపై సూళ్ళూరుపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
- తిరుమల అన్నదాన సత్రంలో శ్రీవారి అన్న ప్రసాదంలో జెర్రి కనిపించిందంటూ తప్పుడు ప్రచారానికి పాల్పడిన ముగ్గురిపై తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
-తిరుమలలో లడ్డూ కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి అని, ఒకరికి ఒక లడ్డూ మాత్రమే ఇస్తారని తప్పుడు ప్రచారం సాగించిన వ్యక్తిపై కూడా తిరుమల వన్ టౌన్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ బుక్ చేశారు.
జగన్‌కి బాసటగా భూమన ఫిర్యాదు
మాజీ సీఎం జగన్ మీద అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం భూమన కరుణాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి రోజా, తిరుపతి మేయర్ శిరీష కూడా ఉన్నారు. మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఐటీడీపీ విభాగం నుంచీ ఈ పోస్టులు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయిస్తున్నారని వీరు ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతం మరచి వైసీపీ నేతల విలాపాలు
ఇపుడు సామాజిక మాధ్యమాల్లో తమ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విలాపాలకు జనం విస్తుపోతున్నారు. 2019 నుంచీ 2024 జూన్ వరకూ వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అప్పటి ప్రతిపక్ష నేతలను, మహిళా నాయకులను, వారి కుటుంబీకులను అసభ్యకర పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురి చేసిన విషయాన్ని జనం ఇపుడు గుర్తు చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల నియంత్రణకు అప్పుడూ ఇవే చట్టాలు, నిబంధనలు వున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైసీపీ వ్యక్తులు రెచ్చిపోయి విచ్చలవిడిగా వ్యవహరించిన వైనానికి, బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసు తీరుకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు....
జనసేన మహిళానేత అరణ్యరోదన
2022 అక్టోబరు: తిరుపతిలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సైబర్ క్రైమ్ సెల్‌కు వెళ్ళి తన ఫోటోలను, తన కోడలి ఫోటోలను వైసీపీకి చెందిన వ్యక్తులు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టు చేసి కామెంట్లు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ సెల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ నేరుగా అప్పటి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. అయినా కేసు నమోదు కాలేదు. సుభాషిణికి న్యాయం జరగలేదు.
హైకోర్టు ఆదేశించినా జరగని న్యాయం
2023 డిసెంబరు: తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ 2023 డిసెంబరులో వైసీపీ వ్యక్తులు తన కుటుంబ సభ్యుల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టు చేశారని, వారిపై చర్యలకు పోలీసులను ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన హైకోర్టు అప్పటి తిరుపతి ఎస్పీ, పుత్తూరు డిఎస్పీ, నగరి సిఐలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడంతోపాటు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇంతవరకూ పోలీసులు కౌంటర్ దాఖలు చేయలేదు. విచారణా జరపలేదు.