ఇసుక రవాణా, లోడింగ్ ధరలిలా..!
ABN , Publish Date - Aug 11 , 2024 | 02:00 AM
స్టాక్ పాయింట్ల వరకు ఇసుక రవాణా.. అక్కడ లోడింగ్‌కు మాత్రం డబ్బు చెల్లించాలి. జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్ సుమిత్ కుమార్ దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించారు.
చిత్తూరు (సెంట్రల్): కూటమి అధికారంలోకి వచ్చాక ఇసుక నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో ఇసుక పూర్తిగా ఉచితం. అయితే, స్టాక్ పాయింట్ల వరకు ఇసుక రవాణా.. అక్కడ లోడింగ్‌కు మాత్రం డబ్బు చెల్లించాలి. జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్ సుమిత్ కుమార్ దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించారు. ఆ ప్రకారం.. జిల్లాలోని దిగువమాసపల్లి, పాలూరు ఇసుక స్టాక్ యార్డుల నుంచి ట్రాక్టర్, టిప్పర్ల ద్వారా రవాణా చేసుకునే సౌకర్యం కల్పించింది. ఇసుక ఉచితం. అయితే, యార్డుల్లో ట్రాక్టర్‌లో 5 టన్నుల ఇసుక లోడ్ చేయడానికి రూ.775, టిప్పర్‌లో 10 టన్నుల ఇసుక లోడ్ చేయడానికి రూ.1550 ధర నిర్ణయించారు. దీనికి అదనంగా 10 కిలో మీటర్ల నుంచి 30 కిలో మీటర్ల దూరానికి రవణా చార్జీలనూ ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక, రవాణా చార్జీలు కలుపుకొని 10 కిలోమీటర్ల దూరానికి ట్రాక్టర్ ధర రూ.1975, టిప్పర్‌కు రూ.3150గా చెల్లించాలి. 10-15 కిలో మీటర్ల దూరానికి ట్రాక్టర్‌కు రూ.2175, టిప్పర్‌కు రూ.3450.. 15-20 కిలోమీటర్ల దూరానికి రూ.2375, రూ.3750 వంతున.. 20-25 కిలోమీటర్ల దూరానికి రూ.2575, రూ.4050 చొప్పున.. 25-30 కిలోమీటర్ల దూరానికి ట్రాక్టరు ఇసుకకు రూ.2775, టిప్పర్‌కు రూ.4350 చొప్పున ధర నిర్ణయించారు. ట్రాక్టర్, టిప్పర్ యజమానులు ఈ ధరల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గనుల శాఖ అధికారులు హెచ్చరించారు.