CM Chandrababu: బీ కేర్ ఫుల్.. మా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
ABN, Publish Date - Nov 09 , 2024 | 05:35 PM
ఫేక్ అకౌంట్లతో సభ్యత, సంస్కారం మరిచిపోయి ప్రవర్తిస్తే ఇచ్చే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ వాళ్ల ఆడ బిడ్డల జోలికి వచ్చినా వదిలి పెట్టమని వార్నింగ్ ఇచ్చారు.
నంద్యాల: శ్రీశైలంలో సీ ప్లేన్ వినూత్న కార్యక్రమంకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీ ప్లేన్ ద్వారా విజయవాడ కనకదుర్గమ్మ.. శ్రీశైలం పరమ శివుడు ఆలయం కనెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. శ్రీశైలానికి రోజుకు 25 వేల మంది వస్తారని, వీకెండ్ లో 70 వేలు, పండుగలకు లక్ష ఇరవై వేల మంది వస్తారని తెలిపారు. నల్లమల ఫారెస్ట్ లో పెద్ద పులులు, చిరుత పులులు.. అనేక పక్షి జాతులు ఉన్నాయని.. తుమ్మల బైలులో జంగిల్ సఫారి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
కొత్త అనుభూతి..
నల్లమల అడవుల్లో సీ ప్లేన్ లో ప్రయాణం చేయడం ఒక కొత్త అనుభూతి కలిగిందన్నారు. శ్రీశైలం సమీపంలోని అక్కమహాదేవి గుహలు.. ట్రెక్కింగ్ కు ధ్యాన కేంద్రాలకు అనుకూలంగా ఉందన్నారు. తిరుపతి, శ్రీశైలం ప్రశాంతమైన ప్రదేశాలన్నారు. శ్రీశైలంలో రథోత్సవానికి ఇబ్బందులు లేకుండా రోడ్ల విస్తరణ...రింగ్ రోడ్డు నిర్మాణం చేశామన్నారు. కమిటీ వేసి మాస్టర్ ప్లాన్ లో భాగంగా శ్రీశైలంను దివ్య క్షేత్రం పర్యాటక కేంద్రంగా ఏర్పాటుకు శ్రీకారం చుడతామన్నారు.
మార్చి నుంచి..
సున్నిపెంటను తిరుపతి నివాస యోగ్యంగా చేస్తామని స్పష్టం చేశారు. గండికోట.. ప్రపంచంలో టాప్ టెన్ టూరిజం ప్రదేశాల్లో ఒకటి అని.. గండికోటలో సీ ప్లేన్ ఆపరేషన్లు ఉంటాయని తెలిపారు. మార్చి నుంచి సీ ప్లేన్ సర్వీసు సేవలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అరకు, లంబసింగి, కాకినాడ కలిపితే టూరిజంగా అభివృద్ధి చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందన్నారు. మనం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇతరులే మన దగ్గరకు వచ్చేలా టూరిజం డెస్టినేషన్ కు ప్రాధాన్యత ఇస్తామన్నారు. టూరిజం డెవలప్ చేస్తే ఫైవ్ స్టార్ హోటల్లు, హౌసెస్ వస్తాయని.. ఎకానమీ పెరుగుతుందని వివరించారు.
డ్రోన్ హబ్ గా ఓర్వకల్లు..
ఐదేళ్లలో వ్యవస్థలను జగన్ నాశనం చేశారని.. నిధులను డైవర్ట్ చేసి టోటల్ గా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారం వల్ల రాష్ట్రం వెంటిలేటర్ నుంచి బయటపడిందన్నారు. పెన్నా, గోదావరి, వంశధార నదులు కలిపి రాయలసీమకు నీళ్లు తీసుకొస్తే.. బిగ్ ఛేంజర్ అవుతుందని వ్యాఖ్యానించారు. త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని.. రాయలసీమలో అపారమైన వనరులు ఉన్నాయని.. వాటినన్నిటినీ ఉపయేగించుకుంటామని అన్నారు. ఓర్వకల్లును డ్రోన్ హబ్ గా చేసి ప్రపంచ దేశాలకు డ్రోన్ లు ఎగుమతి చేసేలా చేస్తామన్నారు.
వార్నింగ్..
ఆడ పిల్లల జోలికి వస్తే తమ ప్రభుత్వం ఏ మాత్రం సహించదన్నారు. పోలీసులు తోక జాడిస్తే అదే లాస్ట్ రోజు అవుతుందని.. ఫేక్ అకౌంట్లతో సభ్యత సంస్కారం మరిచిపోయి ప్రవర్తిస్తే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ వాళ్ల ఆడ బిడ్డల జోలికి వచ్చినా వదిలి పెట్టమని వార్నింగ్ ఇచ్చారు. బాబాయ్ ని చంపి గుండెపోటు అంటే తాను కూడా నమ్మానన్నారు. నారాసుర రక్త చరిత్ర అని తనపై బురద చల్లారని.. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నేను వారిని లోపలేసుంటే అప్పుడే అన్ని నిజాలు బయటపడేవన్నారు.
Updated Date - Nov 09 , 2024 | 05:35 PM