CM Chandrababu: వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ABN, Publish Date - Aug 08 , 2024 | 09:02 PM
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నూటికి నూరు శాతం ఈ-క్రాప్ నమోదు చేయాలని, జులైలో భారీవర్షాలకు దెబ్బతిన్న పంటలకు రూ.36 కోట్లు ఇన్ పుట్ సబ్సీడీ అందివ్వాలని కోరారు.
పొలాల్లో పురుగు మందులు పిచికారికి డ్రోన్లు వినియోగించేలా ప్రోత్సహించాలని, రాష్ట్రంలో డ్రోన్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ పరికరాల తయారీకి మానుఫ్యాక్చరింగ్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. కాగా ఈ సమీక్షలో వ్యవసాయ యాంత్రీకరణ, గ్రామ సచివాలయ ఉద్యోగులు మాతృ సంస్థలకు అనుసంధానం చేయడం వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడితో పాటు అధికారులు పాల్గొన్నారు.
నామినేటెడ్ పదవులపై పొలిట్ బ్యూరోలో చర్చ
మరోవైపు గురువారం ఉదయం టీడీపీ పోలిట్ బ్యూరో పార్టీ సమావేశం జరిగింది. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలకు చంద్రబాబు పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. నామినేటెడ్ పదవులపై చంద్రబాబు చర్చించారు. వీలైనంత త్వరగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతంపై దృష్టి సారించడంపై కూడా చర్చించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. పార్టీ సభ్యత్వ రుసుం రూ.100లతో ప్రారంభిస్తామని, సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షలు వచ్చే విధంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు.
కాంస్యం సాధించిన హాకీ జట్టుకి అభినందనలు: మంత్రి అనగాని
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టును మంత్రి అనగాని సత్యప్రసాద్ అభినందనలు తెలిపారు. 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో కాంస్య పతకం సాధించడం దేశానికి గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఈ పతకం భారత జాతీయ క్రీడ అయిన హాకీకి పునర్‌వైభవం తీసుకొస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్, కీపర్ శ్రీజేష్ పతక సాధనలో కీలక పాత్ర పోషించారని మంత్రి అభినందించారు. హాకీ జట్టు ఇచ్చిన స్ఫూర్తితో భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు గెలవాలని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.
Updated Date - Aug 08 , 2024 | 09:10 PM