CM Chandrababu: రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు.. ఎందుకంటే?
ABN , Publish Date - Aug 07 , 2024 | 07:29 PM
ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు (గురువారం) పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు జరగనున్న టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు.
అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు (గురువారం) పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు జరగనున్న టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. కాగా సమావేశంలో ఆరు అంశాలు అజెండాగా ఉన్నాయి. నామినేట్ పదవులు, శ్వేత పత్రాలు, సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు. తెలంగాణా టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా పాలిట్ బ్యూరోలో నేతలతో పార్టీ అధినేత చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పొలిట్ బ్యూరో సమావేశం.
చేనేత రంగంపై ఎమ్మెల్యే రామ్మోహన్ స్పందన..
కాగా మరో ప్రత్యేక కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అధిక మంది ఆధారపడిన రంగం చేనేత రంగం అని అన్నారు. నిరంతరం కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. చేతులు, కాళ్లు ఒకే పని మీద దృష్టి పెట్టి చేసే రంగం చేనేత రంగమని, కూటమి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు ఎప్పుడు అండగా నిలుస్తుందని అన్నారు.
ఇక ఎమ్మెల్యే సృజన చౌదరి మాట్లాడుతూ.. చేనేత రంగం అభివృద్ధి కోసం అప్పటిలోనే గాంధీజీ, నెహ్రూజీ ఎంతో కృషి చేశారని, చేనేత ఉద్యమాలు సైతం చేశారని గుర్తుచేశారు. చేతివృత్తిని నమ్ముకొని జీవించే వారందరికీ ప్రభుత్వం నుంచి ఎప్పుడు మద్దతు ఇస్తామని పేర్కొంది. ఇక టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేనేత కార్మికుల దినోత్సవం రోజు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. చేనేత కార్మికులపై వైసీపీ నేతలు రౌడీయిజం చేశారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునేలా చేశారని మండిపడ్డారు. ‘‘జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చేనేత కార్మికులు అంటే ఆ వర్గం అంటే పడదు. చేనేతలకు చేయూతనిచ్చింది చంద్రబాబు మాత్రమే’’ అని అన్నారు.