Dairy farmers : ‘విజయ’కు పాడి రైతు సాయం
ABN , Publish Date - Sep 13 , 2024 | 04:02 AM
దశాబ్దాలుగా పాడి రైతుల అభివృద్ధికి సేవలందించిన విజయవాడలోని కృష్ణ మిల్క్ యూనియన్ పాల ఫ్యాక్టరీ ముంపు బారిన పడి భారీగా నష్టపోయింది.
విజయవాడలోని ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చేయూత
హనుమాన్‌జంక్షన్ రూరల్, సెప్టెంబరు 12: దశాబ్దాలుగా పాడి రైతుల అభివృద్ధికి సేవలందించిన విజయవాడలోని కృష్ణ మిల్క్ యూనియన్ పాల ఫ్యాక్టరీ ముంపు బారిన పడి భారీగా నష్టపోయింది. సంస్థ పునరుద్ధరణకు పాడి రైతులు స్వచ్ఛందంగా చేయూత అందిస్తున్నారు. వీరవల్లిలోని కామధేను (పాల ఫ్యాక్టరీ) ఆవరణలో గురువారం గన్నవరం పాల సొసైటీ అధ్యక్షుడు పాలడుగు వెంకటరామవరప్రసాద్ (నాని) ఆధ్వర్యంలో రూ.1,01,116, దావాజిగూడెం పాల సొసైటీ అధ్యక్షుడు గొంది నరేంద్ర ఆధ్వర్యంలో రూ.1,01,116 విరాళాల చెక్కును చైర్మన్ చలసాని ఆంజనేయులుకు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాడి రైతులు నెలవారి బిల్లుల్లో రెండు రోజుల పాలసేకరణ విలువ సుమారు రూ.10 లక్షల విరాళాన్ని ఎంపీఏ అసోసియేషన్ అధ్యక్షుడు ఘంటా నాగేశ్వరరావు ద్వారా చైర్మన్ చలసానికి అందజేశారు. ‘ఫ్యాక్టరీ పునరుద్ధరణకు పశ్చిమ గోదావరి జిల్లా పాడి రైతులతో పాటు అన్ని పాల సొసైటీల సభ్యులు చేయూత అందిస్తున్నారు. ఇది సమష్ఠితత్వానికి నిదర్శనం. అందరి ఆకాంక్షల మేరకు త్వరలోనే విజయవాడ పాల ఫ్యాక్టరీ రైతు సేవకు పునరంకితం అవుతుంది’ అని చైర్మన్ చలసాని అన్నారు.