టైరు పేలి.. యాసిడ్ ట్యాంకర్ బోల్తా
ABN , Publish Date - Apr 07 , 2024 | 12:44 AM
పెనుప్రమాదం త్రుటిలో తప్పింది.. సగ్గొండ ఆంధ్రా షుగర్స్ ఫ్యాక్టరీ నుంచి శుక్రవారం అర్ధరాత్రి రాజమహేంద్రవరానికి యాసిడ్ ట్యాంకర్ బయలుదేరింది.
తాళ్ళపూడి, ఏప్రిల్ 6 : పెనుప్రమాదం త్రుటిలో తప్పింది.. సగ్గొండ ఆంధ్రా షుగర్స్ ఫ్యాక్టరీ నుంచి శుక్రవారం అర్ధరాత్రి రాజమహేంద్రవరానికి యాసిడ్ ట్యాంకర్ బయలుదేరింది. తాళ్ళపూడి ఏటిగట్టు మీద ఒక్కసారిగా ట్యాంకర్ టైరు పేలిపోయింది. డ్రైవర్‌కు అదుపు చేసే అవకాశం లేకపోవడంతో అదుపుతప్పి ఏటుగట్టు కిందకి దొర్లి బోల్తా పడింది. రాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాద సంఘటన గ్రామస్థులకు తెలియడంతో అంతా కంగారుపడ్డారు. ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడ్డారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం కానీ, పాణనష్టం గానీ జరుగలేదు. ఈ మేరకు సమాచారం అందడంతో శనివారం ఉదయం కొవ్వూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి ట్యాంకర్ పేలకుండా చర్యలు చేపట్టారు. అనంతరం బోల్తా పడిన లారీలోని యాసిడ్‌ను వేరే లారీలోకి నింపి తరలించారు. ఇదిలా యాసిడ్ లారీని ప్రక్కకు తరలించే సమయంలో విద్యుత్ వైర్లు తగిలి ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతన్ని కొవ్వూరు ఆసుపత్రికి తరలించిన ట్లు సమాచారం.