చేనేత సంఘాలకు ఎన్నికలు ఎప్పుడో?
ABN , Publish Date - Nov 04 , 2024 | 12:54 AM
జిల్లాలో చేనేత సహకార సంఘాలకు డిసెంబరు 4న ఎన్నికలు జరుగుతాయని, అక్టోబరు 10న చేనేత, జౌళిశాఖ కమిషనర్ జి.రేఖారాణి టెంటేటివ్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దాంతో పదకొండేళ్ల అనంతరం చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరగబోతున్నాయని చేనేత కళాకారులు ఎంతో ఆశతో ఎదురుచూశారు. కమిషనర్ ఆదేశాలతో జిల్లా, క్షేత్రస్థాయి అధికారులు చేనేత సహకార సంఘాల కార్మికులను కలుసుకుని సమావేశాలు సైతం నిర్వహించారు.
అమలాపురం రూరల్, నవంబరు 3:(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేనేత సహకార సంఘాలకు డిసెంబరు 4న ఎన్నికలు జరుగుతాయని, అక్టోబరు 10న చేనేత, జౌళిశాఖ కమిషనర్ జి.రేఖారాణి టెంటేటివ్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దాంతో పదకొండేళ్ల అనంతరం చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరగబోతున్నాయని చేనేత కళాకారులు ఎంతో ఆశతో ఎదురుచూశారు. కమిషనర్ ఆదేశాలతో జిల్లా, క్షేత్రస్థాయి అధికారులు చేనేత సహకార సంఘాల కార్మికులను కలుసుకుని సమావేశాలు సైతం నిర్వహించారు. కొత్తగా చేనేత సంఘాల్లో చేరేందుకు సభ్యులకు అవకాశాన్ని సైతం కల్పించారు. అయితే ఇటీవల అమరావతిలో చేనేత, జౌళిశాఖ జిల్లాస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి సవిత త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అయితే ఇంత వరకు ఎటువంటి షెడ్యూల్ విడుదల కాలేదని ఉమ్మడి జిల్లా చేనేత సహకార అధికారి కె.పెద్దిరాజు తెలిపారు.
వాయిదాకు కారణాలు ఎన్నెన్నో
సహకార సంఘాల ఎన్నికలు వాయిదాకు అనేక కారణాలు ఉన్నాయని సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24వేలు చొప్పున అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పథకాన్ని కొనసాగించడంతో పాటు కార్మికులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ రెండు పథకాలు ఇంత వరకు గాడిన పడిన దాఖలాలు లేవు. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఆ ప్రభావం ఉంటుందన్న వాదనను ఆ పార్టీ నాయకులే వ్యక్తం చేస్తున్నారు. ఉచిత విద్యుత్‌పై క్షేత్రస్థాయిలో కసరత్తులకే పరిమితమైంది.
ఎన్నికల ఊసేలేదు
2013 ఫిబ్రవరి 12న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికైన పాలకవర్గాలు రాష్ట్ర విభజన అనంతరం 2018 వరకు పదవిలో కొనసాగారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మరో ఏడాది పాటు వారి పదవీకాలాన్ని పొడిగించింది. అనంతరం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చేనేత సహకార సంఘాలకు, కార్మికులకు అందించే అన్ని సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కి రాయితీలు అన్నింటినీ ఎత్తేసింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన కూడా చేయలేదు. కేవలం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతోనే సంఘాలను నడిపించేశారు.
ఫిబ్రవరిలో జరిగే అవకాశం
చేనేత సహకార సంఘాలకు 2025 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతానికి వాయిదా పడడంతో షెడ్యూల్ విడుదలైన తర్వాత చేనేత సంఘాల్లో సభ్యులుగా చేరేవారికి అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ ఒక్కరే ఉండడం, సిబ్బంది కొరతతో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని చేనేత సహకార సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని ఏ జిల్లాకు ఆ జిల్లాకు అసిస్టెంట్ డైరెక్టర్లను నియమించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం అధికారులే చేనేత సహకార సంఘాలను నిర్వహిస్తున్నారు. పలు సంఘాల్లో ఒక పక్కన వస్త్ర నిల్వలు పేరుకుపోతుండగా మరోపక్కన చేనేత ముడి సరుకైన నూలు కట్టలుగా ఉన్నా నేసేందుకు కార్మికులు ముందుకు రాని పరిస్థితులు కూడా పలు సంఘాల్లో నెలకొన్నాయి. ఇప్పటికైనా కార్మికులందరికీ ఉపాధి కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.