AP Politics: ఏపీలో ప్రజాకంటక పాలన సాగుతోంది: పురంధేశ్వరి
ABN, Publish Date - Feb 01 , 2024 | 03:21 PM
ఏపీలో ప్రజాకంటక పాలన సాగుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) అన్నారు. ఏపీ బీజేపీ చరిత్రలో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పారు.
ఏలూరు: ఏపీలో ప్రజాకంటక పాలన సాగుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) అన్నారు. గురువారం నాడు భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ... ఏపీ బీజేపీ చరిత్రలో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 24 పార్లమెంటు ఎన్నికల కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు కార్యాలయాలు గుండెకాయలయితే , కార్యకర్తలు గుండె చప్పుళ్లలాంటివారని అన్నారు. బీజేపీ కార్యకర్తలను గౌరవిస్తుందని.. అందుకే ఛాయ్ అమ్ముకునే వ్యక్తి పీఎం అయ్యారన్నారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని.. ఏ పార్టీలోనూ కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం ఉండదని తెలిపారు.
కేంద్రంలో గతంలో ఇతర పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో ప్రతీరోజూ అవినీతి ఆరోపణలు వచ్చేవని.. ఇప్పుడు మోదీ పాలనలో ప్రతీ రోజూ కొత్త స్కీములను ప్రవేశపెడుతున్నారని వివరించారు. ప్రధాని మోదీ మహిళలకు పార్లమెంటులో 33 శాతం రిజర్వేషన్లు కల్పించి, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సాహిస్తున్నారని అన్నారు. బీజేపీ అన్ని పార్టీల కంటే భిన్నమైనదని.. ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. 2019 ఎన్నికల్లో 302 పార్లమెంటు సీట్లు గెలుచుకుంటే, రాబోయే ఎన్నికల్లో 350 సీట్లకు పైగా గెలుచుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారన్నారు. నియంతృత్వం, విద్వేషం, విధ్వంసాలతో కూడిన పాలనను ఏపీలో గత అయిదేళ్లుగా చూస్తున్నామని పురంధేశ్వరి తెలిపారు.
వైసీపీ అవినీతిని ప్రశ్నిస్తే.. ఎస్సీ, ఎస్టీ కేసులు
అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేస్తే, దానిని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి సామాన్యుడిపై ఉందన్నారు. అలా ఎవరైనా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతూ జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. సామాజిక సాధికారిక యాత్ర పేరుతో యాత్ర చేస్తున్న వైసీపీకు.. ఆ నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని అని విశ్వసించి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఏపీ అభివృద్ధి కోసం కేటాయించిందని వివరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును వారికి అనుకూలమైన మేఘా కంపెనీకి ఇచ్చారని మండిపడ్డారు. ప్రాజెక్టు డిజైన్ సరిగ్గా లేకపోవడంతోనే పనులు మూలన పడ్డాయని చెప్పారు. కాంగ్రెస్‌కు ఏపీలో కొత్త అధ్యక్షురాలు వచ్చారని..ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్నారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం అంటే, ప్రత్యేక ప్యాకేజీకి గతంలో అంగీకరించ లేదా అని ప్రశ్నించారు. బీజేపీ ఏపీకి ఏ విధంగానూ అన్యాయం చేయలేదని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా సీఎం జగన్ ప్రకటిస్తూ.. స్టిక్కర్లు అంటించుకుంటున్నారని.. అందుకే జగన్ ప్రభుత్వం స్టిక్కర్ల ప్రభుత్వంగా మిగిలిపోతుందని పురంధేశ్వరి ఎద్దేవా చేశారు.
Updated Date - Feb 01 , 2024 | 03:27 PM