నెయ్యి కల్తీలో దోషులను శిక్షించాలని కూటమి ప్రదర్శనలు
ABN, Publish Date - Sep 29 , 2024 | 12:59 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది.
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. జనసేన, కూటమి నేతలు, వైసీపీ పార్టీ నేతలు పోటాపోటీగా శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు హోరెత్తిపోయాయి. ఆయా పార్టీల నేతల ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయాల సందర్శన పేరుతో నిర్వహించిన కార్యక్రమాలు ఉత్కంఠ భరితంగా సాగాయి. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాజకీయ పార్టీల నేతలతో కిటకిటలాడాయి. అమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి జనసేన, కూటమి నేతల ఆధ్వర్యంలో అమలాపురం నుంచి అప్పనపల్లికి నిర్వహించిన పాదయాత్రలో ఆ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యులు గంటి హరీష్‌మాధుర్, టీడీపీ నేత మెట్ల రమణబాబులతో పాటు జనసేన నాయకులు నల్లా శ్రీధర్, లింగోలు పండు, యేడిద శ్రీనుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా కూటమి కార్యకర్తలు హాజరయ్యారు. అమలాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర అప్పనపల్లికి చేరింది. అక్కడ జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నాయకత్వంలో జనసేన, కూటమి నాయకులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేశారు. ఈపాదయాత్రలో భారీగా హిందూ భక్తులు, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా అమలాపురం పట్టణ నడిబొడ్డున గల గడియార స్తంభం సెంటర్‌లో చిక్కం భీముడు ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, జనసేన నాయకులు ఆకుల బుజ్జి, పిండి రాజా, తాళ్ల లక్ష్మీనర్సాయమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ హరీష్‌మాధుర్, టీడీపీ నేత మెట్ల రమణబాబులో శిబిరంలో పాల్గొన్న జనసేన నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు.
Updated Date - Sep 29 , 2024 | 12:59 AM