భవిష్యత్ తరాలకు ఇంధన వనరులపై భరోసా కల్పించాలి
ABN , Publish Date - Dec 15 , 2024 | 12:20 AM
భవిష్యత్ తరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్‌ను ఆదా చేయడం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని ఆమె చెప్పారు. కలెక్టరేట్ నుంచి అమలాపురం గడియార స్తంభం సెంటర్ వరకు శనివారం నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని జేసీ జెండా ఊపి ప్రారంభించారు.
అమలాపురం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్ తరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్‌ను ఆదా చేయడం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని ఆమె చెప్పారు. కలెక్టరేట్ నుంచి అమలాపురం గడియార స్తంభం సెంటర్ వరకు శనివారం నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని జేసీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతీ ఒక్కరూ ఇంధనాన్ని పొదుపుగా వాడాలని నినాదాలు చేస్తూ ట్రాన్స్‌కో సిబ్బంది ర్యాలీలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా జేసీ నిషాంతి మాట్లాడుతూ సహజ వనరులను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రతీ ఒక్కరూ సమష్టిగా ఇంధన పొదుపును పాటించాలని స్పష్టం చేశారు. పొదుపు ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మూడు నక్షత్రాల నుంచి ఐదు నక్షత్రాల రేటింగ్ కలిగిన విద్యుత్ గృహోపకరణాలు వినియోగించడం ద్వారా 30 శాతం విద్యుత్‌ను ఆదా చేయవచ్చునన్నారు. ప్రతీ ఏటా డిసెంబరు 14న జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తారన్నారు. ఇంధన వృథాను అరికట్టడంపై అవగాహన పెంపొందించడమే ఇంధన పొదుపు దినోత్సవ ప్రధాన లక్ష్యమన్నారు. ఇష్టారాజ్యంగా ఇంధన వనరులను వినియోగించడం వల్ల భవిష్యత్తు అవసరాలకు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. అవసరాలకు మించి ఇంధనాన్ని వినియోగిస్తూ పొదుపుపై అదుపు లేకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. అందుకే సంప్రదాయేతర ఇంధన వినియోగం ప్రత్యామ్నాయ మార్గంగా ఎంపిక చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జేసీ తెలిపారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎస్.రాజబాబు మాట్లాడుతూ ఇంధన వనరుల రక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత కావాలన్నారు. జనాభా పెరుగుదలతో పాటు ఇంధన వనరుల వినియోగం విపరీతంగా పెరుగుతుందన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్ వనరులపై ఆధారపడాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు బదులు బయో ఇంధన వనరులను, బయో డీజిల్, బయో గ్యాస్ వంటి వనరులపై ఆధారపడడం వల్ల భవిష్యత్తు తరాలకు మేలు చేసినవారం అవుతామన్నారు.విద్యుత్ శాఖ డీఈలు రవికుమార్, పుల్లయ్య, ఏఈ రవికుమార్, ట్రాన్స్‌కో సిబ్బంది పాల్గొన్నారు.