వాళ్లకు ‘మళ్లీ పెళ్లి’!!
ABN , Publish Date - Nov 23 , 2024 | 01:53 AM
ఏంటి పెళ్లయిన వాళ్లకు మళ్లీ పెళ్లి అంటున్నారు.. అనుకుంటున్నారా.. వాళ్లు పొరుగు రాష్ట్రానికి చెందిన వలస ఆదివాసీలు కావడం.. మన రాష్ట్రంలో స్థానికత సమస్యల కారణంగా ప్రభుత్వ సేవలు అందడంలేదు.
వలస ఆదివాసీలకు సామూహిక వివాహాలు
యువకులకు అల్లూరి జిల్లా చింతూరులోని అల్లిగూడెం స్థానికత
యువతులకు ఒడిశా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లోనే స్థానికత
ఇతర రాష్ట్రాల గుర్తింపుతో అందని ప్రభుత్వ సేవలు
వివాహ ధ్రువీకరణ పత్రాల మంజూరుకోసం మళ్లీ పెళ్లి
చింతూరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఏంటి పెళ్లయిన వాళ్లకు మళ్లీ పెళ్లి అంటున్నారు.. అనుకుంటున్నారా.. వాళ్లు పొరుగు రాష్ట్రానికి చెందిన వలస ఆదివాసీలు కావడం.. మన రాష్ట్రంలో స్థానికత సమస్యల కారణంగా ప్రభుత్వ సేవలు అందడంలేదు. ఈ సమస్య పరిష్కారానికి వివాహ ధ్రువీకరణ పత్రం కావాలి. వీరికి ఇదివరకే వారి సంప్రదాయం ప్రకారం వివాహమైనా ఇప్పుడు మళ్లీ పెళ్లి చేయాలని ఇక్కడ వైద్యశాల సిబ్బంది నిర్ణయించారు. దీనివల్ల వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ వస్తుంది. దాంతో సమస్య పరిష్కారమవుతుందని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకల ప్రాథమిక వైద్యశాల సిబ్బంది శుక్రవారం సామూహిక వివాహాలు చేశారు. విచిత్రమేంటంటే.. ఇప్పుడు ఈ మళ్లీ పెళ్లయినవారిలో చాలామంది గర్భిణులు కూడా ఉన్నారు. ఏంటీ కథ.. సవివరంగా తెలుసుకుందాం..
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని అల్లిగూడెం అనే ప్రాంతం వలస ఆదివాసీ గ్రామం. వీరంతా ఛత్తీస్‌గడ్, ఒడిశా రాష్ట్రాల నుంచి 40ఏళ్ల క్రితం ఇక్కడకు వలస వచ్చారు. ఈ క్రమంలో ఇక్కడ జన్మించిన 14మంది యువకులకు ఇటీవల ఆదివాసీ సంప్రదాయ పద్ధతిన వివాహం జరిగింది. వీరందరూ కూడా ఛత్తీస్‌ఘడ్, ఒడిశాలకు చెందిన యువతులనే వివాహం చేసుకున్నారు. ఈ యువకులకు మన రాష్ట్రానికి చెందిన ఆధార్‌తోపాటు ఇతర గుర్తింపుకార్డులు ఉన్నాయి. కానీ, ఆ యువతులకు మాత్రం వారి రాష్ట్రాలకు చెందిన గుర్తింపు కార్డులే ఉన్నాయి. దీంతో వారికి మన రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ సదుపాయాలు పొందే పరిస్థితి లేకుండా పోయింది. నూతన జంటలకు సంబంధించి 14మంది మహిళల్లో చాలామంది గర్భం దాల్చారు. ఈ క్రమంలో వారు ప్రసవ సమయంలో ఆరోగ్యశ్రీ సేవలతోపాటు ఇతర పథకాలకు చెందిన లబ్ధి పొందే పరిస్థితి లేదు. ఇవి పొందాలంటే స్థానికత కావాలి. ఇది కావాలంటే వివాహ ధ్రువీకరణ పత్రం పొందాలి. ఈ నేపథ్యంలో వీరి ఇబ్బందులు గమనించిన స్థానిక తులసిపాకల ప్రాథమిక వైద్యశాల పరిధిలోని సిబ్బంది ఆ జంటలకు శుక్రవారం సామూహికంగా వివాహం జరిపించారు. ఈ మేరకు వారందరికీ వివాహ ధ్రువీకరణ పత్రాలు తీసుకునే ఏర్పాట్లను వైద్యశాఖ సిబ్బంది బాధ్యతగా తీసుకున్నారు. వివాహ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఆ మహిళలు కూడా మన రాష్ట్ర పఽథకాలు అందిపుచ్చుకునే అవకాశం కలగనుంది. వివాహ కార్యక్రమంలో వైద్యశాఖ సిబ్బంది సీహెచ్ ముక్తేశ్వరరావు, హెచ్‌ఈవో పి.సరోజిని, కె.గంగరాజు, ఎంపీహెచ్‌ఎస్ వి.చిన్నలక్ష్మి, ఆశావర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.