ప్రత్యేకావసరాల పిల్లల ప్రోత్సాహకాలకు నిధులు
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:48 AM
గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ నేటికీ అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. పాఠశాలల్లో చదువుకునే సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు అందించాల్సిన వివిధ రకాల ప్రోత్సాహకాలను వైసీపీ ప్రభుత్వ హయాంలో విడుదల చేయలేదు. ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే పది నెలల బకాయిలను ఒకేసారి రూ.51.08 లక్షలు విడుదల చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి చిన్నారులకు అందించే అన్ని రకాల ప్రోత్సాహకాలకు సంబంధించిన నిధులను విడుదల చేసింది.
అమలాపురం రూరల్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ నేటికీ అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. పాఠశాలల్లో చదువుకునే సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు అందించాల్సిన వివిధ రకాల ప్రోత్సాహకాలను వైసీపీ ప్రభుత్వ హయాంలో విడుదల చేయలేదు. ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే పది నెలల బకాయిలను ఒకేసారి రూ.51.08 లక్షలు విడుదల చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి చిన్నారులకు అందించే అన్ని రకాల ప్రోత్సాహకాలకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసేలా సమగ్ర శిక్ష జిల్లాశాఖ కార్యాచరణ చేపట్టింది. పాఠశాల లేని గ్రామాల నుంచి ఇతర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు రవాణా ఖర్చులు చెల్లించాలని విద్యా హక్కు చట్టం చెబుతుంది. దీని ప్రకారం ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.6వేలు చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల కోసం మండలానికి ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలకు చిన్నారులను తీసుకువచ్చే తల్లిదండ్రులకు ఎస్కార్ట్ అలవెన్సుల కింద నెలకు రూ.300 చొప్పున అందించాల్సి ఉంది. వీరికి పది నెలల కాలానికి రూ.3వేలు చొప్పున నిధులు విడుదలయ్యాయి. కొందరు ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు పాఠశాలలకు వస్తుంటారు. వారికి కూడా నెలకు రూ.300 చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్న చిన్నారులకు కూడా నెలకు రూ.300 చొప్పన చెల్లించాల్సి ఉంది. చిన్నారుల్లో బాలికలు ఉంటే ఇతర అలవెన్సులతో పాటు నెలకు రూ.200 చొప్పున అందించాల్సి ఉంది. ఇలాంటి ప్రోత్సాహకాలు గత వైసీపీ ప్రభుత్వంలో తూతూ మంత్రంగా అందించారు. కూటమి ప్రభుత్వం అన్ని ప్రోత్సాహకాల కింద జిల్లాకు రూ.51.08 లక్షలు విడుదల చేసింది. ఈ నిధులను మరో మూడు రోజుల్లో విద్యార్థుల ఖాతాలకు జమ చేయనున్నట్లు సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. హోం బేస్డ్ అలవెన్స్ కింద రూ.6.60 లక్షలు, ఎస్కార్ట్ అలవెన్స్ కింద రూ.12.15 లక్షలు, ట్రాన్స్‌పోర్టు అలవెన్స్ కింద రూ.14.07 లక్షలు, బాలికల అలవెన్స్ కింద రూ.18.26 లక్షలు విడుదలయ్యాయని చెప్పారు.