Share News

CM Chandrababu: సోషల్ మీడియా పోస్టులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

ABN , Publish Date - Dec 12 , 2024 | 07:55 PM

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెరిగిపోయాయని, ఇంట్లో ఆడవారిని సైతం వదలకుండా పోస్టులు పెడుతున్నారని జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదని నాదెండ్ల చెప్పారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu: సోషల్ మీడియా పోస్టులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
AP CM Chandrababu Naidu

అమరావతి: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, హోంమంత్రి అనితతో క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెరిగిపోయాయని, ఇంట్లో ఉన్న ఆడవారిని సైతం వదలకుండా పోస్టులు పెడుతున్నారని జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం దృష్టికి మంత్రి నాదెండ్ల తీసుకెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదని నాదెండ్ల చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవరించాలని, మనం తీసుకునే చర్యలు దేశానికే ఆదర్శం కావాలని చంద్రబాబుని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


ఇకపై అలా పోస్టులు పెడితే..

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "నేరస్థులు రాజకీయ నాయకుల ముసుగులో బెదిరింపులకు దిగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న పరిస్థితి ఏపీలో ఉంది. బ్రహ్మకుమారీస్ లాంటి సంస్థలపైనా అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల నియంత్రణకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నా. సైబర్ సెక్యూరిటీ విభాగం చాలా పటిష్టంగా ఉండాలి. సైబర్ మోసాలు, టెక్నాలజీపై అవగాహన ఉన్న వారికి దీన్ని అప్పగించాలి. నేరస్థులు రాజకీయం ముసుగులో ఉంటూ థ్రెట్‌గా మారారు. సైబర్ క్రిమినల్స్‌కు అడ్డుకట్ట వేయాలంటే పోలీసులూ కొత్త పరిజ్ఞానం ఉపయోగించాలి. కొన్ని కేసుల దర్యాప్తు విషయాలను బహిర్గతం చేయడం ద్వారా ప్రజల్లోనూ అవగాహన పెంచాలి. కొత్త తరహా నేరాలను ప్రత్యేకంగానే డీల్ చేయాల్సిన అవసరం ఉంది. సంప్రదాయ నేరాలతోపాటు డిజిటల్ నేరాలను దర్యాప్తు చేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలి. పోలీసుల్లోనే సాంకేతిక నిపుణులు ఉండాలి లేదంటే బయట నుంచి నిపుణుల్ని తీసుకువచ్చి కేసులు పరిష్కరించాలి.


సీసీ కెమెరాలే కీలకం..

ప్రస్తుతం ఉన్నవాటి కంటే అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాల ద్వారా రియల్ టైమ్ నేరాలు, ప్రమాదాల నియంత్రణ జరుగుతుంది. సీసీ కెమెరాల ద్వారా వచ్చే డేటాను రియల్ టైమ్‌లో వినియోగించుకోవాలి. పోలీసింగ్ అనేది ప్రభావవంతంగా ఉండాలి. ముఖ్యమైన ప్రాంతాల్లో ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను పెట్టి నేరస్థుల్ని గుర్తించాలి. డ్రోన్ల ద్వారా ర్యాండమ్‌గా తనిఖీలు నిర్వహించాలి. రహదారులపై కొన్ని హాట్ స్పాట్‌లలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటినీ విశ్లేషించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునేలా ఆ డేటా ఉపయోగించాలి. సీసీ టీవీ కెమెరాలు అన్ని ప్రదేశాల్లో ఉన్నాయా లేదా చూడాలి. టెంపుల్, విగ్రహలు వద్దా కెమెరాలు పెట్టాలి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ డేటా ఆన్ లైన్‌లో పెట్టాలి" అని ఆదేశించారు.

Updated Date - Dec 12 , 2024 | 09:26 PM