Purandheshwari: అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉంది
ABN, Publish Date - Jan 30 , 2024 | 09:56 PM
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి (Daggubati Purandheshwari) వ్యాఖ్యానించారు. నెల రోజుల పాటు చేసిన పాదయాత్రలో ప్రతి ఇంటికి వెళ్లి కేంద్రం చేసిన పనులను ప్రజలకు వల్లూరు జయ ప్రకాష్ వివరించారని తెలిపారు.
గుంటూరు: రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి(Daggubati Purandheshwari) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... నెల రోజుల పాటు చేసిన పాదయాత్రలో ప్రతి ఇంటికి వెళ్లి కేంద్రం చేసిన పనులను ప్రజలకు వల్లూరు జయ ప్రకాష్ వివరించారని తెలిపారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రం సహకారంతో జరుగుతున్నదేనని తేల్చిచెప్పారు. పదికోట్ల మందికి ఉచితంగా గ్యాస్ అందించిన ఘనత మోదీదేనని తెలిపారు. ఏపీలో ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందడం లేదన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ సహకరించడం లేదని అపవాదు వేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో చేస్తున్న ఏ అభివృద్ధి కార్యక్రమంలోనైనా కేంద్ర సహకారం లేదని నిరూపించగలరా అని పురంధేశ్వరి సవాల్ విసిరారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం తీవ్ర జాప్యం
తల లేని మొండెంలా.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని ధ్వజమెత్తారు.అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అనే విషయంలో బీజేపీ ఎప్పుడు వెనకడుగు వేయలేదని వివరించారు. పోలవరానికి ఇచ్చే ప్రతి పైసా కేంద్రం నుంచే వస్తుందన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో తీవ్ర జాప్యం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను ఒక బూచిగా చూపిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారా లేదా అని ప్రశ్నించారు. కేంద్రంలో అందిస్తున్న సుపరిపాలనే రాష్ట్రంలోనూ రావాల్సి ఉందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ మోదీ చేయించిన తర్వాత.. దేశం వైపు చూడాలంటేనే శత్రువులు భయపడుతున్నాయని పురంధేశ్వరి పేర్కొన్నారు.
Updated Date - Jan 30 , 2024 | 09:59 PM