ఇసుక లోడింగ్ టన్నుకు రూ.250
ABN, Publish Date - Jul 08 , 2024 | 12:45 AM
ఉచిత ఇసుక విధానం జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ నాగలక్ష్మి వివిధ శాఖల అధికారులతో చర్చించిన అనంతరం స్టాక్‌పాయింట్ల వద్ద లారీలో ఇసుక లోడింగ్‌కు మెట్రిక్ టన్నుకు రూ.250గా ధర నిర్ణయించారు.
గుంటూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఉచిత ఇసుక విధానం జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ నాగలక్ష్మి వివిధ శాఖల అధికారులతో చర్చించిన అనంతరం స్టాక్‌పాయింట్ల వద్ద లారీలో ఇసుక లోడింగ్‌కు మెట్రిక్ టన్నుకు రూ.250గా ధర నిర్ణయించారు. ఇక ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. లారీ/ట్రాక్టర్/ఎద్దులబండికి సంబంధించిన రవాణా ఛార్జీలు వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది. అక్రమాలను నిరోధించేందుకు పూర్తిగా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయనున్నారు. స్టాక్‌పాయింట్ల వద్ద ఎలాంటి నగదు లావాదేవీలు జరగవన్న విషయాన్ని వినియోగదారులు గుర్తించాల్సి ఉంటుంది. యూపీఐ ద్వారా నగదుని స్టాక్‌పాయింట్ వద్ద చెల్లిస్తే సరిపోతుంది.
జిల్లాలో ఐదు స్టాక్‌యార్డులు
జిల్లాలో మొత్తం ఐదు స్టాక్‌యార్డుల్లో ఇసుక అందుబాటులో ఉంటుంది. కొల్లిపరలో 33,388.50 మెట్రిక్ టన్నులు, మున్నంగిలో 1,81,303.50, గుండిమెడలో 20,958, తాళ్లాయపాలెంలో 3,91,242.399, లింగాయపాలెంలో 2,98,480.05 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం మైనింగ్ అధికారులు శాస్త్రీయ విధానాన్ని అనుసరించారు. మొత్తంగా 9,23,372.45 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు జిల్లాలో ఉన్నాయి. ఇవి నెల నుంచి రెండు నెలలకు పైగా ప్రజల అవసరాలకు సరిపోతాయని భావిస్తున్నారు. స్టాక్‌యార్డులో ఎవరైతే ముందు వెళతారో వారికి తొలిగా ఇసుకని సరఫరా చేస్తారు. ఒక్కో వ్యక్తి ఆధార్ కార్డు చూపించి రోజుకు 20 మెట్రిక్ టన్నుల వరకు ఇసుకని తీసుకెళ్లొచ్చు.
ఫిర్యాదులకు అవకాశం
స్టాక్‌యార్డుల వద్ద ఎలాంటి సమస్యలున్నా ఫిర్యాదు చేసే అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించింది. కలెక్టరేట్‌లో కంప్లయింట్ మానిటరింగ్ టోల్ ఫ్రీ నెంబర్‌ని ఏర్పాటు చేసింది. వినియోగదారులు 0863 2234301కి ఫోన్ చేసి సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. అలానే మెయిల్ ఐడీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆంగ్లంలో డీఐసీఎంసీ 2024కి జీమెయిల్ చేస్తే సరిపోతుంది. తక్షణమే ఆయా ఫిర్యాదులపై అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు. వీటిని కలెక్టర్ నాగలక్ష్మి కూడా పర్యవేక్షిస్తారు. కాగా రవాణా ఛార్జీలను లారీ/ట్రాక్టర్ యజమానులు విపరీతంగా వసూలు చేయకుండా ఉండేందుకు ఉప రవాణా శాఖ కార్యాలయం చర్యలు చేపడుతుంది. కిలోమీటర్‌కు రవాణా శాఖ నిర్ణయించిన ఛార్జీలనే వసూలు చేయాల్సి ఉంటుంది.
Updated Date - Jul 09 , 2024 | 11:23 AM