Share News

సీనియారిటీని పట్టించుకోకుండా పదోన్నతులా?

ABN , Publish Date - Nov 23 , 2024 | 04:47 AM

పంచాయతీరాజ్‌ పదోన్నతుల్లో సీనియారిటీ ఉన్న వారిని పక్కనబెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

సీనియారిటీని పట్టించుకోకుండా పదోన్నతులా?

డైరెక్ట్‌ రిక్రూటీలకు ప్రమోషన్లా?.. తప్పుపట్టిన హైకోర్టు

అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ పదోన్నతుల్లో సీనియారిటీ ఉన్న వారిని పక్కనబెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పదోన్నతిపై 1993-95 మధ్య అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(ఏఈఈ) అయినవారిని పక్కనపెట్టి 1997లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా నేరుగా నియమితులైన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు తాత్కాలిక పదోన్నతి(అడ్‌హక్‌) కల్పించడాన్ని ప్రశ్నించింది. డైరెక్ట్‌ రిక్రూటీలకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(డీఈఈ)లుగా పదోన్నతి కల్పించేందుకు వీలుగా గత వైసీపీ ప్రభుత్వం 2021 అక్టోబర్‌ 5న జారీ చేసిన జీవో 71ని కొట్టివేసింది. ఆ జీవో ఆధారంగా డైరెక్ట్‌ రిక్రూటీలకు అడ్‌హక్‌ పదోన్నతి కల్పిస్తూ పంచాయితీరాజ్‌శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కూడా రద్దు చేసింది. ఏఈఈలుగా పదోన్నతి నాటి నుంచి సీనియారిటీ, తదనంతర ప్రయోజనాలు పొందేందుకు పిటిషనర్లు అర్హులని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఈ నెల 15న తీర్పు ఇవ్వగా.. ఆ ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది.


సీనియర్లకు ప్రయోజనాలు కల్పించకపోవడాన్ని సమర్థించలేం

పీపీఎస్సీ 1997లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ద్వారా పంచాయితీరాజ్‌ శాఖలో ఏఈఈగా ఎంపికైన ఉద్యోగులకు డీఈఈలుగా పదోన్నతి కల్పించేందుకు వీలుగా అప్పటి వైసీపీ ప్రభుత్వం 2021 అక్టోబరులో జీవో 71 జారీ చేసింది. ఈ జీవోను సవాల్‌ చేస్తూ పదోన్నతిపై ఏఈఈ అయిన పలువురు ఉద్యోగులు 2021లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు ఇటీవల తుది విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 71ని హైకోర్టు 2021 అక్టోబరు 29న సస్పెండ్‌ చేసిందన్నారు. పదోన్నతుల విషయంలో యథాతథస్థితి పాటించాలని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో సీనియారిటీ, ఇతర ప్రయోజనాల కల్పనకు సంబంధించి ప్రభుత్వం 2006లో ఇచ్చిన జీవో 262, 2011లో ఇచ్చిన జీవో 334 ఉనికిలో ఉన్నాయన్నారు. పిటిషనర్లకు 1994 నుంచి సీనియారిటీ, ఇతర ప్రయోజనాలు కల్పించాలని ఆ జీవోల్లో స్పష్టంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లను పక్కనపెట్టి 1997 ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్‌ అయిన ఏఈఈలకు డీఈఈగా అడ్‌హక్‌ పదోన్నతి కల్పించడం చెల్లుబాటు కాదన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం డైరెక్ట్‌ రిక్రూటీలకు మరో పదేళ్ల సర్వీసు ఉందని గుర్తు చేసింది. అయితే పిటిషనర్లు గత 25-30 ఏళ్లుగా పంచాయతీరాజ్‌ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపింది. పదోన్నతిపై ఏఈఈ అయినవారిలో 50 శాతం మంది పదవీ విరమణ చేశారని పేర్కొంది. మిగిలినవారు మరో రెండేళ్లలో రిటైర్‌ కాబోతున్నారని తెలిపింది. ఏవిధంగా చూసినా పిటిషనర్లకు సీనియారిటీ ప్రయోజనాలు కల్పించకపోవడాన్ని సమర్థించలేమంది. సీనియారిటీ ప్రయోజనాలు పొందేందుకు పిటిషనర్లు అన్నివిధాలా అర్హులని స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఎలాంటి అధికారం లేకున్నా డైరెక్ట్‌ రిక్రూటీలకు పదోన్నతి కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 71 జారీ చేసిందని పేర్కొంది. ఆ జీవోను కొట్టివేయడంతోపాటు దాని ఆధారంగా డైరెక్ట్‌ రిక్రూటీలకు డీఈఈలుగా అడ్‌హక్‌ పదోన్నతి కల్పిస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది.

Updated Date - Nov 23 , 2024 | 04:47 AM